అర్ధరాత్రి మాజీ ఎంపీపీ కారుకు నిప్పు
సాక్షి టాస్క్‌ఫోర్స్: ఇంట్లో పార్క్ చేసి ఉన్న కారుకు నిప్పంటించిన సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వైఎస్సార్ సీపీకి చెందిన మార్కాపురం జిల్లా అర్థవీడు మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి 20 ఏళ్లుగా కంభం పట్టణంలోని రావిపాడు రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటి ఒకటిన్నర గంటల సమయంలో ఇంటి బయట మంటలను గమనించి బయటకు వచ్చి చూస్తే కారు మంటల్లో కాలిపోతోంది. వెంటనే మంటలను ఆర్పేసి పోలీసులకు సమాచారం అందించారు. ఏఎస్‌ఐ నారాయణ, ఫైర్ సిబ్బంది ఉదయం ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ గొటిక రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12వ తేదీన పాపినేనిపల్లిలో తనతో పాటు పక్కన ఉన్న రైతులకు చెందిన బత్తాయి, జామాయిల్ తోటలకు ఎవరో నిప్పంటించడంతో కాలిపోయి నష్టం వాటిల్లిందన్నారు. ఆ ఘటన మరువక ముందే ఇప్పుడు తన కారుకు నిప్పంటించారన్నారు. ఇద్దరు వ్యక్తులు ముసుగు వేసుకొచ్చి కారుకు నిప్పంటించినట్లు తెలుస్తోందని, దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
రాజకీయ కక్షతోనే నిప్పంటించారు
అర్థవీడు మాజీ ఎంపీపీ రాజేశ్వరరెడ్డి
అర్ధరాత్రి మాజీ ఎంపీపీ కారుకు నిప్పు


