టిడ్కో గృహాల నిర్మాణంలో సర్కారు విఫలం
ఒంగోలు టౌన్: టిడ్కో గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు, భవనాల సముదాయంలో మౌలిక సదుపాయాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.180 కోట్లు విడుదల చేయాలని సీపీఎం కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నప్పటికీ టిడ్కో గృహాలను పూర్తి చేయడంలో వైఫల్యం చెందిందని విమర్శించారు. దీంతో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. నగర కమిటీ నాయకులతో కలిసి మంగళవారం ఒంగోలు శివారులోని చింతలలో టిడ్కో గృహాలను ఆమె సందర్శించారు. గృహ సముదాయంలో పనుల గురించి షాపూర్‌జీ పలోంజీ ప్రతినిధి రాజశేఖర్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే టిడ్కో గృహాలను పూర్తి చేసి ఇస్తామని చెప్పిన చంద్రబాబు గత రెండేళ్లుగా లబ్ధిదారులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఒంగోలు పరిధిలో మూడు స్కీముల్లో ప్రారంభించిన గృహాలను ఇప్పటి వరకు పూర్తి చేయకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన వాటా విడుదల చేసినప్పటికీ, లబ్ధిదారులు కూడా బ్యాంకు రుణాల ద్వారా తమ వాటా చెల్లించినప్పటికీ గృహాలు పూర్తి చేయకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. లబ్ధిదారులపై వడ్డీ భారం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కారే వడ్డీ భారాన్ని భరించాలని డిమాండ్ చేశారు. రియల్ టైం గవర్నెన్స్ అని డప్పాలు కొట్టుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో టిడ్కో గృహాలను ఎందుకు నిర్మించలేకపోయిందో జవాబు చెప్పాలని నిలదీశారు. కేరళం రాష్ట్రంలో పూరెస్ట్ ఆఫ్ పూర్ పేరుతో పక్కా గృహాలు నిర్మించి ఇస్తుండగా ఇక్కడ ఎందుకు అలా ఇవ్వలేకపోతున్నారని ప్రశ్నించారు. చౌడుతో కూడుకున్న చింతల టిడ్కో భవనాల సముదాయాన్ని మట్టితో లెవెలింగ్ చేసి నివాసయోగ్యంగా మార్చాలని సూచించారు. సీపీఎం నగర కార్యదర్శి చీకటి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 4128 టిడ్కో ఇళ్లు మొండిగోడలుగా మిగిలిపోయాయని చెప్పారు. ఇంకా 300 గృహాలు ఫౌండేషన్ స్థితిలోనే ఉండటం సిగ్గుచేటన్నారు. ఒట్టి ప్రకటనలతో ప్రజలను మాయ చేయకుండా సకాలంలో టిడ్కో గృహాలను పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు తంబి శ్రీనివాసరావు, జి.రమేష్, ధారా వెంకటేశ్వర్లు, హనుమంతరావు, ఎస్‌డీ హుసేన్ పాల్గొన్నారు.
గృహాలు పూర్తి చేసేందుకు రూ.180 కోట్లు విడుదల చేయాలి
సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు డి.రమాదేవి


