
విజిలెన్స్ కొరడా!
అక్రమ ఎరువులపై
● పొదిలిలో 1704 బస్తాలు, ముండ్లమూరు మండలంలో 270 బస్తాల ఎరువులు సీజ్
పొదిలి/ముండ్లమూరు(దర్శి): ఎరువుల కొరత, అధిక ధరలతో రైతులు సతమతమతున్నట్లు ప్రచార మాధ్యమాల్లో వెలువడుతున్న కథనాలతో విజిలెన్స్ అధికారులు నిద్ర లేచారు. సోమవారం జిల్లాల్లోని పలు ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. పొదిలి, ముండ్లమూరు మండలం చింతలపూడిలో 1974 బస్తాల ఎరువులను సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న శ్రీలక్ష్మీ ట్రేడర్స్ ఎరువుల దుకాణాన్ని విజిలెన్స్ అధికారులు తనిఖీ చేశారు. స్టాక్ రికార్డుల్లో తేడాలను గమనించి ఇక్కడి వెంకయ్యస్వామి ఆలయం ఎదురుగా దుకాణానికి సంబంధించిన గోడౌన్‌పై దాడి చేశారు. 1704 బస్తాల వివిధ రకాల ఎరువులను అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. గోడౌన్‌కు అనుమతులు లేవని తనిఖీలో వెల్లడి కావడంతో ఎరువులతో సహా సీజ్ చేశారు. ఆ ఎరువుల విలువ సుమారు రూ.20.43 లక్షలు ఉంటుందని విజిలెన్స్ అధికారులు చెప్పారు. దుకాణ యజమానిపై 6ఏ కేసుతోపాటు క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించేందుకు ఎరువులు అక్రమంగా నిల్వ చేస్తే డీలర్లపై క్రిమినల్ కేసులు తప్పవని విజిలెన్స్ సీఐ రవిబాబు హెచ్చరించారు. తనిఖీల్లో తహసీల్దార్ పాల్, విజిలెన్స్ ఎస్సై నాగేశ్వరరావు, వ్యవసాయాధికారి దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, దుకాణ యజమాని మాట్లాడుతూ.. తనపై కక్షతో అధికారులు కేసులు నమోదు చేశారన్నారు. గతంలో జరిగిన విషయాలను దృష్టిలో పెట్టుకుని తన గోడౌన్‌ను సీజ్ చేశారని వాపోయారు. తమకు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పారు.
270 బస్తాల యూరియా పట్టివేత
ముండ్లమూరు(దర్శి): మండలంలోని చింతలపూడి గ్రామంలో ఎరువుల దుకాణాలను విజిల్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో సోమవారం తనిఖీలు చేపట్టారు. మల్లికార్జున ట్రేడర్స్ షాపులో బిల్లు లేని 50 బస్తాల యూరియా, నాగార్జున ఫర్టిలైజర్స్ దుకాణంలో రూ.1,56,145 విలువైన 220 బస్తాల యూరియా, కాంప్లెక్స్ ఎరువులు సీజ్ చేశారు. తనిఖీలో విజిలెన్స్ ఏఓ శివనాగప్రసాద్, వ్యవసాయాధికారి తిరుమలరావు, కమర్షియల్ ట్యాక్స్ అధికారి రామారావు, హెడ్ కానిస్టేబుల్ రవికుమార్ పాల్గొన్నారు.

విజిలెన్స్ కొరడా!