
రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి
● జిల్లా రజక వృత్తిదారుల సంఘం డిమాండ్
ఒంగోలు సిటీ: రజక వృత్తిదారులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని జిల్లా రజక వృత్తిదారుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టంగుటూరి రాము, రాయల మాలకొండయ్య డిమాండ్ చేశారు. రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసనల్లో భాగంగా ఒంగోలు ప్రకాశం భవనం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తులు అంతరించి పట్టణ ప్రాంతాలకు వలసలు వచ్చి అనేక రకాల వృత్తులైన అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్, ఇంటి పని వారిగా, ఇసీ్త్ర దారులుగా, బిల్డింగ్ వర్కర్స్ గా పనులు చేసుకుంటూ చాలీచాలని ఇరుకు గదుల్లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారని అన్నారు. ఇల్లు, ఇళ్ల స్థలాలు లేని వారు దాదాపు 250 మంది ఉన్నారని, వీరి జాబితా స్థానిక ఎమ్మెల్యేకు ఇచ్చామని, కలెక్టర్‌కు మరొక 16 మంది అర్హత జాబితా కూడా ఇచ్చినట్లు చెప్పారు. వీటన్నింటినీ పరిశీలించి తక్షణమే ఇళ్లు మంజూరు చేయాలని వారు కోరారు. రజకులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరిస్తామని కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలన్నారు. వాటిలో 50 ఏళ్లు నిండిన ప్రతి రజకవృత్తిదారునికి పింఛను మంజూరు చేయాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో రజకులకు సామాజిక రక్షణ చట్టం అమలు చేయాలన్నారు. రజకులకు కేటాయించిన చెరువుల కుంటలపై హక్కు కల్పించి జీవో నంబర్ 343 అమలు చేయాలని, తెలంగాణలో మాదిరిగా ఆంధ్రాలో కూడా రజక ల్యాండ్రీ వృత్తిదారులకు నెలకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ధోబీ నిర్వహణ కాంట్రాక్టులని రజకులకే కేటాయించాలన్నారు. ధోబి పోస్టులు రజక యువతీ యువకుల ద్వారా భర్తీ చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో భూ సమస్యల మీద దృష్టి పెట్టి భూ ఆక్రమణదారుల నుంచి కాపాడాలన్నారు. అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్‌లకు కనీస వేతన చట్టం అమలు చేసి నెలకు రూ.18 వేలు ఇవ్వాలని, రజకుల సమస్యలు పరిష్కరించాలన్నారు. సమస్యలపై కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాకు వినతి పత్రం ఇచ్చారు. ధర్నాకు ఒంగోలు నగర కమిటీ సీఐటీయూ నాయకులు జీ రమేష్, జిల్లా కార్యదర్శి ఎం రమేష్ మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఆవులమంద రమణమ్మ, డాక్టర్ వెంకట కృష్ణయ్య, చీమకుర్తి కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి సీహెచ్ కొండయ్య, యోగమ్మ, అపార్ట్‌మెంట్ కం ఇసీ్త్రదారుల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, కమిటీ సభ్యులు శ్రీనివాసులు, నాగేశ్వరరావు, బూచిరాజు నాగేశ్వరరావు పాల్గొన్నారు.