
కొత్తవి ఇవ్వకపోగా..ఉన్నవి పీకేస్తున్నారు
దివ్యాంగుల పొట్టగొడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం గతంలో డాక్టర్ ఇచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడెలా తీసేస్తారు కాళ్లు, కళ్లులేని వారి పెన్షన్ కూడా తొలగించారు దివ్యాంగుల పక్షాన నిలిచి వాళ్ల గోడు జిల్లా అధికారులకు వినిపించిన వైఎస్సార్ సీపీ నేతలు
ఒంగోలు సబర్బన్: టీడీపీ కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వకపోగా...ఉన్న పెన్షన్లు పీకేస్తున్నారు...ఇదెక్కడి అన్యాయమని మాజీ మంత్రి, ససంతనూతలపాడు వైఎస్సార్ సీపీ ఇన్‌చార్జ్ మేరుగు నాగార్జున ధ్వజమెత్తారు. పింఛన్లు కోల్పోయిన దివ్యాంగులను తీసుకొని కలెక్టరేట్‌లో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీ కోసం కార్యక్రమానికి మేరుగు నాగార్జున సోమవారం వచ్చారు. వైఎస్సార్‌సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, పార్టీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డితో పాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు దివ్యాంగుల వెంట వచ్చారు. వాళ్ల వెంట నడుస్తూ దివ్యాంగుల పట్ల టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా నినాదాలు చేశారు. అనంతరం దివ్యాంగులను తీసుకొని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను కలిసి దివ్యాంగులు గోడును మాజీ మంత్రి మేరుగు నాగార్జున వినిపించారు. వాళ్ల కాళ్లు చూడండి, వాళ్ల కళ్లు చూడండి అంటూ కలెక్టర్‌ను మేరుగు నాగార్జున వేడుకున్నారు. ఇలాంటి దివ్యాంగుల పెన్షన్లు తీసేయటానికి ప్రభుత్వానికి మనస్సు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. 90 శాతం ఉన్న అంగవైకల్యం ఒక్కసారిగా 35 శాతానికి, 40 శాతానికి ఏ విధంగా పడిపోతుందో చెప్పాలన్నారు. అంటే ప్రభుత్వం కావాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వకూడదని నిర్ణయించుకుందా అని కలెక్టర్‌ను ప్రశ్నించారు. మీ కళ్లతో మీరు చూడండి అంటూ కలెక్టర్‌కు దివ్యాంగులను మేరుగు నాగార్జున స్వయంగా చూపించారు. దాంతో రీ వెరిఫికేషన్ పెట్టించి పరీక్షలు చేయిస్తామని కలెక్టర్ తమీమ్ అన్సారియా భరోసా ఇచ్చారు.
అనంతరం మేరుగు నాగార్జున మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు, పెన్షనర్లకు అండగా ఉంటుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దివ్యాంగులకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు, వితంతువులకు అండగా ఉండి ప్రతి ఒక్కరికీ పెన్షన్లు మంజూరు చేసి ఆయా కుటుంబాలను ఆదుకుంటే టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి ఆ పెన్షన్లు పీకేయటం ఎంతవరకు సబబన్నారు. అనాదిగా పెన్షన్ల మీదే ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలను ఈ రోజు వీధిన పడేస్తారా అంటూ కూటమి ప్రభుత్వ పెద్దలను నిలదీశారు. ఒక్క ప్రకాశం జిల్లాలోనే 3,592 పెన్షన్లు దివ్యాంగులవి తీసేశారంటే ఎంతటి దుర్మార్గానికి కూటమి ప్రభుత్వం ఒడిగట్టిందో అర్థమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లే లక్ష తీసేశారని, మిగతా పెన్షన్లు 5 లక్షల వరకు తొలగించారన్నారు. ఇంతటి దివాళాకోరు ప్రభుత్వం మరొకటి ఉంటుందా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో 66 లక్షల మందికి పెన్షన్లు అందించారంటే ఆయనది ఎంత పెద్దమససో అర్థం చేసుకోవాలన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వానికి డబ్బులు ఆదాయం చేద్దామనే తప్ప దివ్యాంగులను ఆదుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. గతంలో ప్రభుత్వ డాక్టర్లు ఇచ్చిన సర్టిఫికెట్లు ఇప్పుడే ఎలా తీసేస్తారన్నారు.
వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు గోపిరెడ్డి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కొత్తగా ఇవ్వకపోగా ఉన్నవాటిని తొలగించటం దుర్మార్గమైన చర్య అన్నారు. అర్హులైన వికలాంగులకు అందరికీ పెన్షన్లు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దివ్యాంగులను ఇబ్బందులు పెడుతున్న ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానంద రెడ్డి, పార్టీ ఒంగోలు ఇన్‌చార్జ్ చుండూరు రవిబాబు, దివ్యాంగుల విభాగం రాష్ట్ర కార్యదర్శి కాట్రగడ్డ శ్రీనివాసులు, రాష్ట్ర కార్యదర్శి బొట్ల రామారావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకర్, చెంచిరెడ్డి, క్రాంతి కుమార్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
పోలీసుల తీరును తప్పుపట్టిన మేరుగు:
మీ కోసం కార్యక్రమం కోసం దివ్యాంగులను తీసుకొచ్చిన వైఎస్సార్‌సీపీ నాయకులపై పోలీసులు అనుసరించిన తీరును మాజీ మంత్రి మేరుగు నాగార్జున తప్పుపట్టారు. తామేమీ ఆందోళన చేయటానికో, ధర్నా చేయటానికో రాలేదని, కొంతమంది దివ్యాంగులను తీసుకొని మీ కోసం కార్యక్రమంలో కలెక్టర్‌ను కలుస్తామంటే పోలీసులు అడ్డుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. ముగ్గురు కానీ నలుగురు కానీ లోపలకు రావాలనటం, అంతవరకే లోపలకు అనుమతిస్తామనటం సరైన పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేశారు. ఆంక్షలు పెట్టి దివ్యాంగులను, ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని కూడా మేరుగు నాగార్జున స్పష్టం చేశారు.

కొత్తవి ఇవ్వకపోగా..ఉన్నవి పీకేస్తున్నారు