
కంభంలో అర్ధరాత్రి చోరీ
కంభం: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి నగలు, నగదు అపహరించుకెళ్లిన సంఘటన స్థానిక షిరిడీసాయి నగర్‌లో సోమవారం వెలుగుచూసింది. వివరాలు.. షిరిడీసాయి నగర్‌కు చెందిన మట్టిమల్ల భాస్కర్ ఆదివారం ఉదయం అర్ధవీడు మండలంలోని బోగోలులో అత్తగారింటికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఉదయం కంభంలోని తన ఇంటికి చేరుకోగా తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని వస్తువులన్నీ చిందరవందరగా పడి ఉండటం చూసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటనా స్థలాన్ని ఏఎస్సై నారాయణ పరిశీలించి వివరాలు సేకరించారు. మూడు జతల బంగారు కమ్మలు, ఒక జత వెండి పట్టీలు, రూ.15 వేల నగదు చోరీ అయ్యాయని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
మార్కాపురం టౌన్: హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సుబ్బారావు సోమవారం తెలిపారు. సీఐ కథనం మేరకు.. ఈనెల 9న కళాశాల విశ్రాంత అటెండర్ గోగిరెడ్డి కాశిరెడ్డి(65) సత్యనారాయణ స్వామి గుడి వద్ద ఉండగా పట్టణంలోని నానాజాతుల కాలనీకి చెందిన ఆవుల నాగేంద్ర, చల్లా శ్రీనివాసులు అతి వేగంగా వచ్చి ఢీకొట్టారు. ప్రమాద ధాటికి రోడ్డుపై పడిపోయిన కాశయ్య ‘ఏమి మిడిమాలంగా బండి తోలుతున్నావురా’ అని అనడంతో బైక్‌పై ఉన్న ఇద్దరు వాదనకు దిగి కాశయ్యను కాళ్లతో ఇష్టం వచ్చినట్లు తన్ని, తలను సిమెంటు రోడ్డుకేసి బలంగా బాదారు. గుంటూరులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతూ కాశిరెడ్డి మరణించారు. తొలుత దాడి కేసు నమోదు చేసిన పోలీసులు.. కాశిరెడ్డి మృతిపై భార్య వెంకట సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా మార్చారు. డీఎస్పీ ఆధ్వర్యంలో సీఐతోపాటు ఎస్సైలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డు వద్ద ఉన్న నిందితులు ఆవుల నాగేంద్ర, చల్లా శ్రీనివాసులు పోలీసులను గమనించి బైక్‌పై పారిపోయేందుకు విఫలయత్నం చేశారు. ఇద్దరు నిందితులను అదుపులోనికి తీసుకుని విచారించగా నేరం అంగీకరించారని సీఐ తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు చెప్పారు.