
పెన్షన్ సవరణ క్లాజ్ రద్దు చేయండి
● ఏపీఆర్‌పీఏ డిమాండ్
ఒంగోలు సిటీ: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్థిక బిల్లులో దొంగచాటుగా చూపించిన పెన్షన్ సవరణ క్లాజ్ ను తక్షణమే రద్దు చేయాలని ఏపీఆర్‌పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రాంబాబు డిమాండ్ చేశారు. ఏపీఆర్‌పీఏ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు స్థానిక ప్రకాశం భవనం వద్ద జీ శేషయ్య అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. ధర్నాలో సంఘం జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి సీహెచ్.రాంబాబు మాట్లాడుతూ ఈపీఎస్ 95 పెన్షన్‌దారులకు కనీస పెన్షన్ రూ.9 వేలు, డీఏ ప్రకటించాలని, సీనియర్ సిటిజన్‌లకు రైల్వేలో 50 శాతం రాయితీని పునరుద్ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు 12వ వేతన సవరణ కమిటీలను తక్షణమే నియమించి ఐఆర్ 30 శాతం ప్రకటించాలన్నారు. పెన్షన్‌దారులకు, ఉద్యోగులకు రావలసిన బకాయిలు వెంటనే మంజూరు చేయాలని, పెన్షన్‌దారులకు రావాల్సిన కమ్యూటేషన్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్‌కాష్‌మెంట్ తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన అన్ని రకాల బకాయిలు మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో ధర్నా చేశారు. యూనియన్ నాయకులు మీగడ వెంకటేశ్వర రెడ్డి, టీవీఆర్ సుబ్బారావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, రాబిన్ రవికుమార్, పీ పేరయ్య మాట్లాడారు. ఏపీ ఎన్జీవో సంఘ నాయకులు శరత్ బాబు కృష్ణారెడ్డి, బీఎస్‌ఎన్‌ఎల్ సంఘ నాయకులు నాగేశ్వరరావు, పోస్టల్ సంఘ నాయకులు కే వీరాస్వామి రెడ్డి, ఎస్జీపీఏ నాయకులు పరిటాల సుబ్బారావు, సీఐటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రమేష్, ఎస్‌డబ్ల్యూఎఫ్ నాయకులు అయ్యప్ప రెడ్డి తదితరులు సందేశాలిచ్చారు. ధర్నా అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.