
విద్యార్థులు లక్ష్య సాధనకు కృషి చేయాలి
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు వన్‌టౌన్: ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. స్థానిక భాగ్యనగర్‌లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమశాఖ కళాశాల బాలికల వసతి గృహాలు – 2, 3 విద్యార్థులను సోమవారం జేడీ శీలం పరివర్తన భవనంలోకి మార్చారు. ఆధునికీకరించిన పరివర్తనా భవనాన్ని కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి మాట్లాడారు. ఒంగోలులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహాలు – 2, 3లో రూ.5.12 కోట్ల డీఎంఎఫ్ నిధులతో అదనపు గదుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. తద్వారా విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా పరివర్తనా భవనంలోకి మార్చినట్లు చెప్పారు. జిల్లాలోని 38 సంక్షేమ వసతి గృహాల్లో వసతుల కల్పనకు రూ.13 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. డీఎంఎఫ్ నిధుల నుంచి రూ.19 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. జిల్లాలో బాల్య వివాహాలను నిర్మూలించడానికి పేద విద్యార్థులు విద్యపై శ్రద్ధ వహించేలా సంక్షేమ వసతి గృహాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ప్రతి విద్యార్థి పాజిటివ్ దృక్పథంతో, మానసిక స్థైర్యంతో ముందుకు సాగినప్పుడే నిర్దేశించుకున్న లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుందన్నారు. విద్యతో పాటు ఇతర వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకుని ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. కార్యక్రమంలో సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎన్.లక్ష్మానాయక్, నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు, వార్డెన్లు, సిబ్బంది పాల్గొన్నారు.