
గణేష్ మండపాల అనుమతికి సింగిల్ విండో విధానం
● ఎస్పీ ఏఆర్ దామోదర్
ఒంగోలు టౌన్: ప్రభుత్వ నిబంధనలకు లోబడి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవాలని, గణేష్ విగ్రహాల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఎస్పీ ఏఆర్ దామోదర్ స్పష్టం చేశారు. వినాయక మండపాల అనుమతులకు పోలీసు శాఖ ప్రత్యేకంగా సింగిల్ విండో విధానాన్ని తీసుకొచ్చిందని, గణేష్‌ఉత్సవ డాట్ నెట్ అనే వెబ్‌సైట్‌లో కమిటీ సభ్యుల వివరాలు, మండపం ఏర్పాటు చేసే స్థలం, పోలీసు స్టేషన్ పరిధి, విగ్రహం ఎత్తు, మండపం ఎత్తు, విగ్రహ ప్రతిష్ట జరిపే రోజు, నిమజ్జనం ఎక్కడ చేస్తారు, ఏ వాహనంలో నిమజ్జనానికి తరలిస్తారు తదితర వివరాలు తెలియజేస్తూ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని వివరించారు. పోలీసు అనుమతి పొందడానికి ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తు మేరకు ఎస్‌హెచ్‌ఓ తనిఖీ చేసి, క్యూఆర్ కోడ్ కలిగిన నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తారని తెలిపారు. వినాయక విగ్రహాల వద్ద భద్రతాపరమైన జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
● నిందితుడి నుంచి 2 బైకులు స్వాధీనం
మార్కాపురం: చెడు వ్యసనాలకు లోనై బైకులు చోరీ చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రెండు బైకులు స్వాధీనం చేసుకున్నట్లు మార్కాపురం సీఐ పి.సుబ్బారావు తెలిపారు. గురువారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నిందితుడి వివరాలు వెల్లడించారు. పట్టణంలోని ఎస్‌వీకేపీ కళాశాల ఎదురు నారాయణం శ్రీనివాసులు అనే వ్యక్తికి చెందిన టూవీలర్ చోరీ కాగా ఈనెల 19వ తేదీన టౌన్ ఎస్సై సైదుబాబు కేసు నమోదు చేశారు. వన్‌టౌన్ ఎస్సై సైదుబాబు, టూటౌన్ ఎస్సై రాజమోహన్‌రావుతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. గురువారం పట్టణంలోని సహారా పెట్రోల్ బంకు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని పెద్దదోర్నాల మండలం వైచెర్లోపల్లి గ్రామానికి చెందిన సండ్ర అజయ్‌గా పోలీసులు గుర్తించారు. మార్కాపురం పట్టణంతోపాటు దోర్నాలలో కూడా బైక్ చోరీ చేసినట్లు నిందితుడు ఒప్పుకొన్నాడు. నిందితుడి నుంచి రూ.1.75 లక్షల విలువైన 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని, కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ చెప్పారు.
● కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు సబర్బన్: సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల ఆరోగ్యంపై దృష్టి సారించాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. గురువారం వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో విద్యార్థినీ, విద్యార్థులు ఆరోగ్యంగా ఉండాలంటే భోజనం, వసతితోపాటు పరిసరాలు బాగుండాలన్నారు. రెసిడెన్షియల్ విద్యాలయాల్లో పిల్లల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. విద్యాలయాలతోపాటు హాస్టళ్లలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు–ఖాళీలు, మౌలిక సదుపాయాలు, సొంత–అద్దె భవనాలు, ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న తీరు, విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానం, ఆహార నాణ్యత, మెనూ అమలు –సమస్యలపై కలెక్టర్ చర్చించారు. ఉన్నతాధికారులు హాస్టళ్లను తనిఖీ చేసిన వివరాలు ప్రతి వారం తనకు నివేదించాలని ఆదేశించారు. ఆయా హాస్టళ్లను నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లకు ట్యాగ్ చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని చెప్పారు. ఆరోగ్య సమస్యలను విద్యార్థులు ప్రస్తావించినప్పుడు తేలికగా తీసుకోవద్దని, వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పదో తరగతి విద్యార్థులకు ఆల్ ఇన్ వన్ గైడ్లు త్వరగా వచ్చేలా చూస్తానని, గణితం, సైన్స్ బోధించేందుకు ట్యూటర్లను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయ, కేజీబీవీ జీసీడీఓ హేమలత, ఆయా శాఖల నియోజకవర్గ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

గణేష్ మండపాల అనుమతికి సింగిల్ విండో విధానం

గణేష్ మండపాల అనుమతికి సింగిల్ విండో విధానం