
విద్యార్థులు ప్రపంచాన్ని చదవాలి
ఒంగోలు టౌన్: విద్యార్థులు పాఠ్యాంశాలతోపాటు పుస్తకాలు చదవాలని, సరైన కోణంలో ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ సూచించారు. స్థానిక పీవీఆర్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏడో రోజు గురువారం పుస్తక ప్రదర్శనను ఆయన తిలకించారు. అనంతరం మాదాల రంగారావు సాహిత్య వేదికపై ప్రెస్ అకాడమీ చైర్మన్ మాట్లాడుతూ.. నేటి విద్యార్థుల్లో సామాజిక స్పృహ సన్నగిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గాజా యుద్ధంలో 20 వేల మందికి పైగా చిన్నారులు మరణించారని, వారిలో అత్యధికంగా తిండి కోసం బారులుగా నిలబడినవారే ఉండటం బాధాకరమన్నారు. అమెరికా ఇప్పటికీ ఈ మానవ హననం కొనసాగాలని కోరుకుంటోందని చెప్పారు. ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినవారేనన్న వాదన కొన్ని శతాబ్దాలుగా చర్చలో ఉందని, వీటన్నింటినీ పుస్తకాలు చదవడం ద్వారా తెలుసుకోవాలని చెప్పారు. మాతృభాషకు ప్రాధాన్యత ఇస్తూనే ఇంగ్లిష్ నేర్చుకోవాలని సూచించారు. తాను కూడా పీవీఆర్ ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నానని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ.. విద్యాలయాల్లో కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కావాలని, ఇతర వ్యాపకాలు ఉండకూడదని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం దుర్మార్గమన్నారు. విద్యార్థులు అన్ని రకాల పుస్తకాలు చదవడం ద్వారా ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని, ఎల్లలు లేకుండా ఎదగాలని ఆకాంక్షించారు. తొలుత అద్దంకి బస్టాండ్ నుంచి పీవీఆర్ గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ అధ్యక్షుడు మనోహర్ నాయుడు అధ్యక్షత వహించిన సభలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాల కృష్ణ, విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ కార్యదర్శి లక్ష్మయ్య, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు, జేవీవీ నాయకులు సీఏ ప్రసాద్, ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రా నాయక్, కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కవి పొన్నూరి వెంకట శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్