
ప్రజా సమస్యల పరిష్కారానికి పాటే ఆయుధం
ఒంగోలు టౌన్: ప్రజా సమస్యల పరిష్కారానికి పాటే ఆయుధంగా ప్రజా నాట్యమండలి కళారూపాలు నిర్వహిస్తుందని ప్రజా నాట్యమండలి గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని నగరంలోని సీవీఎన్ రీడింగ్ రూంలో నిర్వహిస్తున్న ఒంగోలు కళా ఉత్సవాలు గురువారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో నల్లూరి మాట్లాడుతూ...ప్రజలను చైతన్య పరిచి ఉద్యమ మార్గంలోకి నడిపించే శక్తి ఒక్క పాటకు మాత్రమే ఉందని చెప్పారు. పేదలకు భూములు పంచడం, కూలి రేట్లు పెంచడం, కార్మికుల హక్కుల కోసం చేస్తున్న పోరాటాల్లో పాట కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సినీ గేయ రచయిత ఎస్‌కే మీరా మాట్లాడుతూ.. పామరులకు సైతం వేదిక ఇచ్చిన గొప్ప చరిత్ర కమ్యూనిస్టు పార్టీలకే దక్కుతుందన్నారు. మూడో తరగతి మాత్రమే చదివిన తాను రాసిన భక్తి కోరిన బలి, కనురెప్ప, చర్లపల్లి భూ పోరాటాలు, పద్మప్యూహం నాటికలు ప్రజాదరణ పొందాయని చెప్పారు. సభలో ప్రజా నాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు చంద్రనాయక్, కార్య నిర్వాహక కార్యదర్శి రామకృష్ణ, కోశాధికారి పిచ్చయ్య, ధూళిపాళ్ల సీతారామయ్య, ఎస్కే నజీర్ పాల్గొన్నారు.