నాగులుప్పలపాడు ఎస్సైపై వేటు
● వీరయ్య చౌదరి హత్య కేసులో అనుమానితులను బెదిరించి భారీగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు
● అంకమ్మతల్లి కొలుపుల వివాదంలోనూ ఎస్సైపై విమర్శలు
● విచారణకు ఆదేశించిన ఎస్పీ.. దీర్ఘకాలిక సెలవులో ఎస్సై
ఒంగోలు టౌన్: అవినీతి ఆరోపణల నేపథ్యంలో నాగులుప్పలపాడు ఎస్సై శ్రీకాంత్‌పై వేటుపడింది. శనివారం ఉదయం ఆయనను జిల్లా పోలీసు కార్యాలయానికి పిలిపించిన ఎస్పీ ఏఆర్ దామోదర్.. చివాట్లు పెట్టినట్లు తెలిసింది. ఎస్పీ చాంబర్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే ఆయన దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిపోయినట్లు సమాచారం. పోలీసు డిపార్ట్‌మెంటుకు సంబంధించిన సిమ్ కార్డును కూడా కార్యాలయంలో అప్పగించినట్లు తెలిసింది. నాగులుప్పలపాడు ఎస్సైగా శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయనపై విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ, టీడీపీ నాయకుడు ముప్పవరపు వీరయ్య చౌదరి గత నెల 22వ తేదీ హత్యకు గురయిన కేసు విచారణను ఎస్సై శ్రీకాంత్ తనకు అనుకూలంగా మార్చుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో నాగులుప్పలపాడు మండలానికి చెందిన కొందరు అనుమానితులను పోలీసుస్టేషన్‌కు పిలిపించి వేధించడమే కాకుండా వారి నుంచి భారీ మొత్తంలో వసూలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మరికొందరికి ఫోన్లు చేసి బెదిరించి కిందిస్థాయి సిబ్బందిని వారి వద్దకు పంపించి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలొచ్చాయి.
అంకమ్మతల్లి కొలుపుల్లోనూ భారీగా ముడుపులు...
ఇటీవల నాగులుప్పలపాడులో అంకమ్మతల్లి కొలుపుల నిర్వహణ విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం నెలకొన్న సమయంలోనూ ఎస్సై శ్రీకాంత్ తీరుపై విమర్శలు వచ్చాయి. వైజాగ్ నుంచి వచ్చిన టీడీపీకి చెందిన ఒక వ్యాపారి వద్ద నుంచి భారీగా ముడుపులు తీసుకుని అతడికి అనుకూలంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపించాయి. దీంతో స్థానికులు నలుగురు ఆత్మహత్యకు యత్నించడం జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆ తర్వాత ఆత్మహత్యకు యత్నించిన వారితో పాటు స్థానికులు 16 మందిపై కేసులు బనాయించి ఒక మైనర్ బాలికను పోలీసుస్టేషన్‌కు పిలిపించి అసభ్యంగా దూషించినట్లు విమర్శలు వచ్చాయి. గత ఫిబ్రవరి నెలలో చేలల్లో మట్టి తోలుకుంటున్న రైతులను కూడా వదిలిపెట్టలేదని ప్రచారం జరిగింది. డబ్బులిచ్చిన తర్వాతే మట్టి తోలుకోవాలని రైతులను ఇబ్బందులకు గురిచేయడంతో వారంతా నాగులుప్పలపాడు పోలీసు స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఇక, అధికార పార్టీ నాయకుల అండదండలతో రెచ్చిపోయిన ఎస్సై శ్రీకాంత్.. పేకాటరాయుళ్లు, కోడిపందేల నిర్వాహకులు, బెల్టుషాపుల వ్యాపారస్తుల నుంచి కూడా భారీగా డబ్బులు పిండుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎస్సై శ్రీకాంత్ వ్యవహారాన్ని ఎస్పీ ఏఆర్ దామోదర్ సీరియస్‌గా తీసుకుని విచారణకు ఆదేశించినట్లు తెలిసింది.


