పొగాకు రైతులకు గడ్డుకాలం
టంగుటూరు మండలం జమ్ములపాలెం గ్రామానికి చెందిన కె.కోటేశ్వరరావు 20 సంవత్సరాలకుపైగా పొగాకు పంట సాగుచేస్తున్నాడు. గత నాలుగు సంవత్సరాలుగా ఎకరా పొలంలో పొగాకు సాగుచేయడానికి ఖర్చులు రూ.1.40 లక్షలయ్యేవి. పంట విక్రయించగా, ఆ ఖర్చులుపోను లాభాలు చూసేవాడు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో పొగాకు కంపెనీలు కుమ్మకై ధరలు దిగజారుస్తున్న సమయంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి పొగాకు రైతులను ఆదుకోవడంతో మూడేళ్లుగా కోటేశ్వరరావు లాభాలు పొందుతూ వచ్చాడు. ఈ ఏడాది పొగాకు సాగుకు ఎకరాకు పొలం కౌలు, కూలి ఖర్చులు, బ్యారన్ కౌలు, తదితరాలన్నీ కలుపుకుని రూ.1.80 లక్షలకుపైనే ఖర్చయింది. దీనికితోడు దిగుబడులు కూడా 30 శాతం తగ్గాయి. వేలం కేంద్రాల్లో పలుకుతున్న ధరలకు లాభాల సంగతి దేవుడెరుగు.. పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కోటేశ్వరరావు ఆందోళన చెందుతున్నాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పొగాకు రైతులు పలు రకాలుగా నిరసనలు తెలుపుతున్నా పట్టించుకున్న పాపానపోలేదని వాపోతున్నాడు. ప్రస్తుతం పొగాకు రైతులకు గడ్డుకాలం దాపురించిందని, ఏం చేయాలో దిక్కుతోచడం లేదని అంటున్నాడు.


