
దస్తురాబాద్(ఖానాపూర్): తెలంగాణలో రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్‌జోడో పాద యాత్రను స్వాగతిస్తున్నామని, ఇదే క్రమంలో దేశంలో అతిపెద్ద అవినీతి జరిగిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ యాత్రలో స్పందించాలని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల కోరారు. ఈమేరకు రాహుల్‌గాంధీకి బుధవారం బహిరంగ లేఖ రాశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని కుమురంభీం చౌర స్తాలో ఏర్పాటుచేసిన బహిరంగసభలో లేఖ వివరాలు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు కేవలం 57 వేల ఎకరాలకు మాత్రమే నీరిస్తున్నారని తెలిపారు.
మంత్రి కేటీఆర్‌పై ఫైర్..
బీజేపీ రోజ్‌గార్ గురించి మంత్రి కేటీఆర్ మాట్లాడటం మంచిదేనని, 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని అడిగిన కేటీఆర్ ఇంతకాలం బీజేపీని ఎందుకు ప్రశ్నించలేదని షర్మిల ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికలు వచ్చాయి కాబట్టే కేటీఆర్ బీజేపీని విమర్శిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ పార్టీ శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగిన కేటీఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందో శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఉందా అని నిలదీశారు.