
తాడేపల్లి: బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమానికి జిల్లా, నియోజవర్గ, మండల స్థాయి నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో కూడా సక్సెస్ చేద్దామని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈరోజు(ఆదివారం, జూలై 27) వైఎస్సార్‌సీపీ నగర, మున్సిపల్ క్లస్టర్, మండల పార్టీ అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు సజ్జల,. దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆగష్టు నెలాఖరికల్లా గ్రామస్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణం పూర్తిచేయాలి. మండల స్ధాయి నాయకులు క్రియాశీలకంగా పనిచేయాలి. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పనిచేసి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దాం’ అని ఆయన పార్టీ శ్రేణులకు సూచించారు.
సజ్జల ఏమన్నారంటే..
బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ (రీకాలింగ్ చంద్రబాబూస్ మేనిఫెస్టో…, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ) కార్యక్రమం మండల స్ధాయిలో కూడా గ్రాండ్ సక్సెస్ అయింది, ఇప్పుడు గ్రామాల్లోకి వెళుతున్నాం. మన నాయకుడు జగన్ తన పాలనలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అమలుచేసి, చక్కటి పాలన అందించారు,
కానీ కూటమి ప్రభుత్వం అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ సాగిస్తుంది. మనం ప్రజల పక్షాన నిలుచున్నాం, ప్రజల్లో వైఎస్సార్సీపీ అంటే ఒక నమ్మకం, భరోసా కల్పించాం. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకుంది, జగన్ ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ క్షేత్రస్ధాయిలోకి వెళుతున్నారు.
వారి ఫేక్ న్యూస్‌ను బలంగా తిప్పికొడదాం
మండల స్ధాయి నుంచి గ్రామస్ధాయిలోకి మనం వెళుతున్నాం కాబట్టి మనం క్రియాశీలకంగా ఉండాలి. పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టాలి, సోషల్ మీడియాను ఉపయోగించుకుంటూ మన వాణిని బలంగా వినిపిద్దాం. ప్రజలను చైతన్యపరుద్దాం. కూటమి నాయకులు తప్పుడు ప్రచారం చేస్తూ ఫేక్‌న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారు. దానిని బలంగా తిప్పికొడదాం.
మండల స్ధాయిలో పార్టీ కమిటీల నిర్మాణంలో అవసరమైతే మరింత మందిని నియమించుకునే వెసులుబాటు కల్పించాం, మండల పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలి. నిర్ణీత కాలపరిమితిలోగా గ్రామాల్లో కూడా బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం పూర్తికావాలి. మన కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్యమైన స్పందన వస్తుంది. నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళాలి. మండల, గ్రామ స్ధాయిలో ఉన్న సీనియర్ నాయకులను పరిశీలకులుగా నియమించుకుని గ్రామ కమిటీల నియామకం చేపట్టాలి. టాస్క్‌ఫోర్స్‌లాగా పనిచేసి పార్టీ అప్పగించిన బాధ్యతలు నిర్వర్తించాలి. మండల స్ధాయిలో 22 అనుబంధ విభాగాలు ఉంటాయి, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీ నుంచి మండల స్ధాయి కమిటీలలో ప్రాతినిద్యం ఉండాలి.
ఈ కార్యక్రమం ప్రతీ గడపకూ వెళ్లాలి..
గ్రామస్దాయిలో బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం ప్రతి గడపకూ వెళ్ళాలి. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సమన్వయం ఉంటుంది. గ్రామమంతా ప్రజల్లో చైతన్యం వచ్చేలా మన కార్యక్రమం ఉండాలి. ఆగష్టు నెలాఖరికల్లా గ్రామ కమిటీల నియామకాలు పూర్తవ్వాలని జగన్ చెప్పారు. కాబట్టి మనం దీనిపై సీరియస్‌గా దృష్టిపెడదాం. అంకితభావంతో పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలి, పార్టీ నియమావళికి లోబడి పార్టీ నిర్మాణంలో కష్టపడి పనిచేసేవారిని గుర్తించి తగిన విధంగా పదవులు ఇవ్వడం జరుగుతుంది.
బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి
ియోజకవర్గ ఇంఛార్జ్ బలోపేతం అయినప్పుడే పార్టీ బలపడుతుంది. గ్రామ స్ధాయి నుంచి మండల స్ధాయి తర్వాత నియోజకవర్గ స్ధాయిలో వేలాదిమంది వైఎస్సార్సీపీ సైన్యం సిద్దమవుతారు. అప్పుడు ఏ చిన్న కార్యక్రమం చేపట్టినా వేలాదిమందితో మన గొంతు వినిపించినవారు మవుతాం. పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చే సమాచారం ప్రతి ఒక్కరికీ చేరాలి, సాంకేతికతపై అవగాహాన ఉన్న ఉత్సాహవంతులైన యువతీ యువకులను వినియోగించుకుని మన నెట్‌వర్క్ పెంచుకుందాం. డేటా బిల్డింగ్, ప్రొఫైలింగ్ చేయగలిగితే లక్షలాదిమందికి మన సందేశం, సమాచారం క్షణాల్లో చేరుకుంటుంది. బూత్ లెవల్ ఏజెంట్ల నియామకంపై కూడా దృష్టిపెట్టాలి. పరిశీలకులు దీనిపై దృష్టిపెట్టాలి.
మన నాయకుడు జగన్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకువద్దాం
కూటమి ప్రభుత్వ తప్పుడు కేసులకు ఎవరూ ఆందోళన చెందవద్దు, పార్టీ అండగా ఉంటుంది. అత్యంత కీలకమైన దశలో ఉన్నాం, మనం కమిటీలను పటిష్టంగా నియమించుకుంటే నియోజకవర్గంలో మన పార్టీ అంత బలపడుతుంది. మనమంతా సమిష్టిగా, సమన్వయంతో పార్టీ నిర్మాణం కోసం పనిచేసి మన నాయకుడు జగన్ , మన వైఎస్సార్సీపీని అధికారంలోకి తీసుకువద్దాం’ అని సజ్జల స్పష్టం చేశారు.