మరి కేంద్రం అప్పుల సంగతి ఏంటి?: ఎంపీ విజయసాయిరెడ్డి | YSRCP MP Vijayasai Reddy Slams Central Govt Over AP Debts Remarks | Sakshi
Sakshi News home page

కేంద్రం కంటే ఏపీ ఆర్థిక స్థితి బెటర్‌.. రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది: ఎంపీ విజయసాయిరెడ్డి

Published Thu, Jul 28 2022 1:49 PM | Last Updated on Thu, Jul 28 2022 2:15 PM

YSRCP MP Vijayasai Reddy Slams Central Govt Over AP Debts Remarks - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని, వైఎస్‌ జగన్‌ లాంటి సమర్థ నాయకత్వం చేతిలో ప్రభుత్వం పని చేస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తావించారు. ఏపీ ఆర్థిక స్థితిపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, అసలు రాష్ట్రాల విషయంలో కేంద్రం తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. ఈమేరకు గురువారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 

ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది. చంద్రబాబు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ, రాష్ట్రం సీఎం జగన్‌ లాంటి సమర్థ నాయకుడి చేతిలో ఉంది. ఒకరకంగా కేంద్రం కంటే ఏపీ పరిస్థితినే ఆర్థికంగా మెరుగ్గా ఉంది. 2021-22 సంవత్సరంలో కేంద్రం జీడీపీ 57 శాతంగా ఉంది. ఏపీ జీడీపీ ఐదో స్థానంలో ఉంది. ఎగుమతుల్లోనూ ఏపీ ఎంతో అభివృద్ధి సాధించింది. కానీ, కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల ఆదాయం తగ్గింది. 

కేంద్రానికి పన్నుల ఆదాయం పెరిగినా రాష్ట్రాలకు మాత్రం సరైన వాటా ఇవ్వడం లేదు. 41 శాతం పన్నుల వాటా  కేంద్రం ఇస్తున్న దాంట్లో ఎలాంటి వాస్తవం లేదు. సెస్‌, సర్‌ఛార్జీలు కేంద్రం ఏటా పెంచుతోంది. కానీ, ఆ ఆదాయం మాత్రం కేంద్రం ఇవ్వడం లేదు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం ఆత్మపరిశీలన చేసుకోవాలి. రాష్ట్రాల అప్పుల గురించి మాట్లాడుతున్న కేంద్రం.. తన అప్పుల సంగతిపై ఏం చెబుతుందని ఎంపీ విజయసాయిరెడ్డి నిలదీశారు. 

2014-19లో కేంద్రం అప్పులు 60 శాతం పెరిగితే , చంద్రబాబు హాయంలో రాష్ట్రంలో 117 శాతం అప్పులు  పెరిగాయి. కేంద్రం 2019 నుంచి ఇప్పటి వరకు 50 శాతం అప్పులు చేస్తే, వైఎస్సార్ సీపీ ప్రభుత్వం హయాంలో కేవలం 43 శాతం అప్పులు మాత్రమే పెరిగాయి. నాటి చంద్ర బాబు ప్రభుత్వం అయిదుగురు కోసం పని చేస్తే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అయిదు కోట్ల మంది ప్రజల అభివృద్ధికి పని చేస్తుంది అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

టీడీపీ నేతలది తప్పుడు ప్రచారం: మిథున్ రెడ్డి
జాతీయ రహదారుల విషయంలో ఏ రాష్ట్రానికి రాని నిధులు ఏపీకి వచ్చాయి. రైతు భరోసా కేంద్రాలు, వాలంటరీ వ్యవస్త ను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం కింద నిధులు తీసుకు రావడంలో ఎంపీలందరం సమిష్టిగా పని చేస్తున్నాం. జల్ జీవన్ మిషన్  వాటర్ గ్రిడ్ పథకం కింద రాష్ట్రంలో సురక్షిత జలాలు ఇస్తున్నాం. అయినా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వం పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని  వైఎస్సార్ సీపీ లోక్ సభ పక్ష నేత మిథున్‌ రెడ్డి పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement