ఏపీలో కులాల పోరు కాదు, వర్గ పోరాటమే!

YSRCP MP Vijayasai Reddy Comments Over AP Politics And Chandrababu - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నది కులాల మధ్య పోరు కాదు. ఇది ధనిక, పేద వర్గాల మధ్య పోరాటం అనే వాస్తవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చెప్పడం కొందరికి విస్మయం కలిగించింది. చాలా మందికి మింగుడు పడడం లేదు. 

గడచిన నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలోని పేదలు, దిగువ మధ్య తరగతి, ఇంకా ప్రభుత్వ సాయం, ఆసరా అవసరమైన అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోంది సీఎం జగన్‌ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం. అన్ని ఆర్థిక ఇబ్బందులనూ అధిగమించి, ఎంతో శ్రమకోర్చి సకల జనుల కల్యాణమే పరమార్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

ఐదున్నర కోట్ల జనసంఖ్య ఉన్న రాష్ట్రంలో ఏ కుటుంబమూ ఆర్థిక లేదా ఆరోగ్య సమస్యతో బాధపడకుండా చూడడానికి ప్రభుత్వమూ, పాలకపక్షమూ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అవసరమైతే కేంద్ర ప్రభుత్వానికి నచ్చచెప్పి మరీ వేలాది కోట్ల రూపాయలు ఏపీకి మంజూరు చేయించి, బడుగు బలహీనవర్గాల ఆయురారోగ్యాల కోసం ఆ ధనాన్ని రాష్ట్ర సర్కారు ఖర్చుచేస్తోంది. 

నవ్యాంధ్ర ప్రదేశ్‌లో ఇంత మంచి శుభకార్యాలు జరగుతుంటే కులాల మధ్య కుమ్ములాటలు ఉన్నట్టు కొందరు చాలా కాలంగా చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్నారు. దాదాపు మూడున్నర సంవత్సరాలు ఓపిక పట్టిన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్‌ కిందటేడాది డిసెంబర్‌ నెలలోనే ఈ విషయంపై సూటిగా అర్ధమయ్యే మాటలతో స్పష్టత ఇచ్చారు. 

అంతరాలు తొలగాలి, బడుగులు బాగుపడాలి
2023 డిసెంబర్‌ 16న  ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ అనే ప్రజా సంపర్క కార్యక్రమం తీరుతెన్నెలను సమీక్షించడానికి ఏర్పాటు చేసిన మంత్రులు, పార్టీ శాసనసభ్యుల సమావేశంలో సీఎం జగన్‌ ఈ విషయం గురించి మాట్లాడారు. ‘రాష్ట్రంలో జరుగుతున్నది కుల పోరాటం కాదు, వర్గ పోరాటం. ఇది ధనికులు, పేదలకూ మధ్య యుద్ధం. ఈ సందర్భంలో పేదలకు న్యాయం జరిగేలా చూడడం మన బాధ్యత. మనం ఈ పోరాటంలో పేదల పక్షానే నిలబడాలి’ అని ముఖ్యమంత్రి చాలా సూటిగా స్పష్టంగా చెప్పారు. 

ఇక్కడ ధనికులకు, పేదలకు మధ్య పోరు అంటే ఈ రెండు వర్గాల మధ్య హింసాత్మక భౌతిక పోరాటం కాదు. తమ సంపద మరింత పెంచుకోవడానికి సంపన్నులు అక్రమ మార్గంలో పేదలను దోపిడీ చేయడానికి ప్రయత్నించినప్పుడు, బడుగులు వారిని ప్రతిఘటించడం అని గ్రహించాలి. ఈ ప్రతిఘటనలో పేదల పక్షాన పాలకపక్షమైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం, నాయకులు, కార్యకర్తలు ఉండాలనేది ముఖ్యమంత్రి జగన్‌ ఉద్దేశం. 

ఈ ఏడాది జనవరి మొదటి వారం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్‌ ప్రసంగిస్తూ.. ‘రాష్ట్రంలో నేడు జరుతున్నది పేదలకూ, పెట్టుబడిదారులకు మధ్య వర్గపోరాటం. అంతేగాని కులాల కుమ్ములాట కాదు. పేద ప్రజలను దోచుకోవడానికి సిద్ధమైన వారితో నేను పోరాడుతున్నా. ఈ పోరాటంలో నాకు బలహీనవర్గాలు, దేవుడి తోడ్పాటు అవసరం’ అని స్పష్టంచేశారు. 

చదువు+సంక్షేమం=అభివృద్ధి
ఇంగ్లీష్‌ మీడియంలో బోధన ద్వారా పేదలకు మేలు చేయడం ఇష్టంలేని ధనికవర్గాలతో తమ పార్టీ పోరాడుతోందని కూడా ఆయన తేల్చిచెప్పారు ఈ బహిరంగ సభలో. ఇంకా, మే నెల 12 శుక్రవారం నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన ప్రజా సమావేశంలో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో నేను వర్గ పోరాటంలో నిమగ్నమయ్యాను. నా పోరు పేదల సంక్షేమం కోసమే. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ధనిక, పెత్తందారీ వర్గాలు నాపై పోరు సలుపుతున్నారు. పేదలకు న్యాయం చేసే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీ–పేదల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ) పథకాలు, ఇతర సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకోవడానికి ఈ వర్గాలు నాతో తలపడుతున్నాయి’ అంటూ సీఎం జగన్‌ వివరించారు. 

పేదలకు ఎలాంటి లోపాలు లేకుండా నేరుగా నగదు బదిలీ ద్వారా, ఇతరత్రా మేలు చేసే పథకాలను అడ్డుకునేవారు స్వార్ధపరులైన ధనికులనీ, వారు తమ పోకడల ద్వారా పేదలతో యుద్ధం చేస్తున్నారని అంటూ ఎలాంటి అనుమానాలకు తావులేకుండా చెప్పినా.. కొందరు మాత్రం వక్రభాష్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఆరు నెలల కాలంలో మూడు వేర్వేరు సందర్భాల్లో జగన్‌ వర్గపోరు అనే మాట వాడటంతో సామాన్య ప్రజానీకానికి మాత్రం దాని భావం చక్కగా బోధపడింది.

- విజయసాయిరెడ్డి. వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ ఎంపీ. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top