
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో కూటమి పార్టీల నేతలే కీచకులుగా మారి మహిళ మానప్రాణాలను, వారి ఆత్మగౌరవాన్ని హరిస్తున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నంలో కొల్లు రవీంద్ర అనుచరుడి కుమారుడు ఒక యువతిని మోసం చేస్తే, సదరు యువతికి న్యాయం చేయకుండా ఆమె జీవితానికి వెలకట్టేందుకు మంత్రి సెటిల్ మెంట్ చేయడం దారుణమని మండిపడ్డారు.
చివరికి తన కుమార్తెకు న్యాయం జరగడం లేదంటూ బాధిత యువతి తల్లి ఆత్మహత్యయత్నం చేసినా కూడా కూటమి నేతల మనస్సు కరగడం లేదని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఇంకా ఆమె ఎమన్నారంటే..
మచిలీపట్నంలో టీడీపీ నాయకులు, మంత్రి కొల్లు రవీంద్ర అనుచరుడు సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి విలువలతో కూడిన విద్య నేర్పిస్తాను అంటూ హరేకృష్ణ పేరుతో ఒక స్కూల్ నడిపిస్తున్నారు. తన స్కూల్‌లో పనిచేస్తున్న యువతిని సుబ్రహ్మణ్యం కుమారుడు ప్రేమించానంటూ, పెళ్ళి చేసుకుంటానని తీసుకుని వెళ్ళి, నాలుగు రోజుల పాటు బయట తిప్పి, తరువాత తిరిగి ఇంటికి తెచ్చి వదిలేశాడు. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి కోరితే దానిపై పంచాయతీ చేయాలని మంత్రి కొల్లు రవీంద్రను ఆశ్రయించాడు.
చట్ట ప్రకారం వ్యవహరించాల్సిన మంత్రి కొల్లు రవీంద్ర బాధిత మహిళ జీవితానికి వెలకట్టే ప్రయత్నం చేశాడు. ఇదేనా మహిళల పట్ల సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, మంత్రి కొల్లు రవీంద్రకు ఉన్న గౌరవం. తన కుమార్తెకు అన్యాయం చేస్తున్నారంటూ సదరు యువతి తల్లి పోలీస్ స్టేషన్ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించడం వల్ల ఆమె ప్రాణాలతో ఉన్నారు. ఈ ప్రభుత్వంలో తమకు న్యాయం జరగదని భావించి ప్రాణం తీసుకునే పరిస్థితి కల్పించారు.
కొల్లు రవీంద్ర ఒక మంత్రిగా ఉండి బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా వ్యవహిరంచడం దారుణం. సదరు యువతకి న్యాయం చేయాల్సిన అవసరం లేదా..? మహిళలకు అన్యాయం జరిగితే బాదితులకు అండగా నిలబడాల్సిన స్థానంలో ఉండి, దోషులకు కొమ్ముకాయడం కూటమి ప్రభుత్వంలోనే కనిపిస్తోంది. ఈ వ్యవహారంలో బాధిత యువతికి న్యాయం చేయకపోతే వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు తప్పవు.
హోంమంత్రి అనిత ఒక మహిళ అయి ఉండి, మహిళలపై జరిగే అరాచకాలను పట్టించుకోవడం లేదు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మహిళలు ప్రశాంతంగా నిద్రపోవచ్చని గొప్పగా ప్రకటించారు. నేడు నిత్యం రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాష్టికాలను చూస్తే ఏ మహిళ ప్రశాంతంగా నిద్రపోతోందో చెప్పాలి. తెలుగుదేశంకు చెందిన నాయకులు, కార్యకర్తలే కీచకులుగా మారి మహిళలను వేధిస్తున్నంటే హోంమంత్రిగా ఉండి కూడా అనిత స్పందించడం లేదు.
మాజీ సీఎం వైఎస్ జగన్‌ను దూషించడానికే ఆమె పరిమితమయ్యారు. ప్రతిచోటా పోలీసుల నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. మహిళల మానప్రాణాలను కాపాడేందుకు ఎటువంటి చర్యలు లేవు. డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికే పరిమితమయ్యారు. దీనివల్ల తప్పుడు పనులు చేసే వారిలో ఎటువంటి భయం కనిపించడం లేదు. అందువల్లే ఈ రాష్ట్రంలో రోజుకు డెబ్బై నుంచి ఎనబై సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
ఎవరైనా మహిళలపై చేయి వేస్తే, అదే వారికి చివరి రోజు అంటూ సీఎం చంద్రబాబు, మహిళల జోలికి వస్తే తాట తీస్తాను అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గతంలో హెచ్చరించారు. అయితే వారి మాటలు ఎక్కడైనా కార్యరూపంలోకి వచ్చాయా అంటే ఒక్కటీ కనిపించడం లేదు. రాప్తాడు నియోజకవర్గంలో పద్నాలుగేళ్ళ దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు ఆరు నెలలుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నా పోలీసులు కనీసం వారిపై కేసు కూడా నమోదు చేయలేదు. చివరికి వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో దీనిపై ఆందోళలు చేయడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.
రెండు నెలల కిందట రాజమండ్రిలో ఫార్మసీ విద్యార్ధినిపై టీడీపీకి చెదిన నాయకుడి బంధువు దీపక్ అనే వ్యక్తి చేసిన వేధింపులకు తాళలేక సదరు విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ కుటుంబానికి నేటికీ ప్రభుత్వం న్యాయం చేయలేదు. అలాగే తిరువూరులో టీడీపీ నాయకుడు రమేష్ అనే వ్యక్తి ఒక గిరిజన మహిళను లోబరుచుకునేందుకు ప్రయత్నించిన ఆడియో కూడా వెలుగుచూసినా, అతడిపై ఎటువంటి చర్య లేదు. గుంటూరు జిల్లా తెనాలిలో ఒక దళిత యువతిని టీడీపీ రౌడీషీటర్ నవీన్ దారుణంగా కొట్టడంతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయింది. సీఎం నివాసం ఉంటున్న జిల్లాలో జరిగిన ఈ దుర్ఘటన చంద్రబాబు కనీసం స్పందించలేదు.
తిరుపతిలో లక్ష్మీ అనే బాధితురాలిని జనసేన నాయకుడు కిరణ్‌రాయల్ ఎలా వేధింపులకు గురి చేశాడో మీడియా ద్వారా ప్రజలంతా చూశారు. దీనిపైనా ఎటువంటి చర్యలు లేవు. ఇక టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం తన దగ్గర పనిచేసే మహిళను లైంగికంగా వేధిస్తే, ఆమె హైదరాబాద్‌కు వెళ్ళి ప్రెస్‌మీట్ పెట్టి ఈ దారుణాన్ని వెల్లడించినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ వేధింపుల వల్ల ఒక మహిళా వీఆర్‌ఓ ఆత్మహత్యాయత్నం చేసింది.
కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే అనుచరులు మహిళా ఫీల్డ్ అసిస్టెంట్‌ను ముడుపులు ఇవ్వాలి, లేదా తమ కామవాంఛలు తీర్చాలంటూ వేధింపులకు గురి చేయడంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేశారు. దీనిపై ప్రభుత్వం వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో దళిత సంఘాలు ఆదోళనలు చేశాయి. కర్నూలు జిల్లా ముచ్చిమర్రిలో ఒక తొమ్మిదేళ్ళ బాలికను గ్యాంగ్ రేప్ చేసి, ముక్కలుగా చేసి విసిరేశారు. ఆ బాలిక మృతదేహం నేటికీ లభించలేదు. హోంమంత్రి నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ప్రేమోన్మోది నీరబ్ శర్మ ఒక యువతిపై హత్యాయత్నం చేశాడు. ఇతడి వల్ల తనకు హాని ఉందని యువతి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కూడా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల సదరు దుండగుడు ఆమెపై హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనలన్నీ ఈ ప్రభుత్వ వైఫల్యాలను చాటుతున్నాయి.