
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగై, అరాచకం రాజ్యమేలుతోందని వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం. మనోహర్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంల మీడియాతో మాట్లాడుతూ తాజాగా పల్నాడు జిల్లా దాచేపల్లిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త హరికృష్ణను పోలీస్ స్టేషన్‌లో అత్యంత దారుణంగా పోలీసులు హింసించిన ఘటన పోలీస్ వ్యవస్థ అధికార పార్టీ కోసం ఎంతగా దిగజారిపోయిందనేందుకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి పార్టీల కార్యకర్తల మాదిరిగా పోలీస్ అధికారులే వ్యవహరిస్తున్నారని, బాధితులే ముద్దాయిలుగా మారుతున్న దుర్భర పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..
రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కార్యక్రమం జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, గత ప్రభుత్వంలో పనిచేసిన ప్రభుత్వ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి హింసిస్తున్నారు. అనేక మంది ప్రభుత్వ అధికారులకు పోస్టింగ్‌లు ఇవ్వకుండా, వీఆర్‌లో పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మాటలు విని పోలీస్ అధికారులు చట్ట విరుద్దంగా వ్యవహరిస్తూన్నారు. ఏడేళ్లలోపు జైలు శిక్ష పడే కేసులకు సుప్రీంకోర్ట్ గైడ్‌లైన్స్ ప్రకారం నోటీస్‌లు ఇచ్చి, వివరణ తీసుకోవాల్సి ఉంటే వాటిని ఏ మాత్రం పాటించడం లేదు.
ఈ కేసుల్లో అర్ధరాత్రి పూట అరెస్ట్‌లు చేసి, భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. కంతేరు ఎంపీటీసీ కల్పనను రాత్రిపూట అరెస్ట్ చేసే సందర్భంలో తాను నైటీలో ఉన్నాను, చీర మార్చుకుని వస్తానని చెప్పినా వినకుండా పోలీసులు రౌడీల మాదిరిగా వ్యవహరించి అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో పాలేటి కృష్ణవేణి అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్ ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కనీసం భోజనం కూడా పెట్టకుండా, మరుసటి రోజున కోర్ట్‌లో హాజరు పరిచారు. సాయంత్రం ఆరు గంటల తరువాత, ఉదయం ఆరు గంటల లోపు మహిళలను అరెస్ట్ చేయకూడదనే చట్టాలు ఉన్నా కూడా పోలీసులు చట్టాలను అతిక్రమిస్తున్నారు. రాజకీయ నాయకుల మెప్పుకోసం వారు ఏం చెబితే అది చేయడం జరుగుతోంది.
దాచేపల్లిలో పోలీసుల దారుణం
పల్నాడు జిల్లా దాచేపల్లిలో నిన్న హరికృష్ణ అనే వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేశారు. ఆ కేసు ఎఫ్‌ఐఆర్‌లో ప్రాథమికంగా ఎటువంటి ఆధారాలు లేకుండానే హరికృష్ణ హత్యాయత్నం చేశాడని రాసుకున్నారు. అంటే కుట్రపూరితంగానే హత్యాయత్నం కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారని తెలిసిపోతోంది. ఇది అన్యాయం అని గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అడిగినా కనీసం సమాధానం చెప్పలేదు. మరో వైపు హరికృష్ణను రాత్రి పోలీసులు విపరీతంగా కొట్టడంతో కనీసం అతడు నడవలేని స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిని పోలీసులు ఎంతగా హింసించారో వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ మీడియా సమావేశం ద్వారా వాటిని ప్రజలు కూడా చూసేందుకు ప్రదర్శిస్తున్నాం.
పోలీసులు తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు రిమాండ్ రిపోర్ట్‌లో అరెస్ట్‌కు సంబంధించిన వివరాలను కూడా తప్పుగా నమోదు చేశారు. తాము హింసించడం వల్ల అతడు నడవలేని స్థితిలో ఉన్నాడనే దానిని కూడా కప్పిపుచ్చుకునేందుకు గతంలోనే హరికృష్ణ కాళ్లకు గాయాలయ్యాయని, అతడు దానికి చికిత్స చేయించుకోలేదని, తాము అరెస్ట్ చేసే సమయంలో అతడు పారిపోయే ప్రయత్నంలో పరుగులు తీసి పడిపోవడం వల్లే ఆ గాయాలు అయ్యాయని రిమాండ్ రిపోర్ట్‌లో పచ్చి అబద్దాలు రికార్డు చేశారు. కానీ బాధితుడు హరికృష్ణ మేజిస్ట్రేట్ ముందు తనను పోలీసులు హింసించడం వల్లే గాయపడ్డానని స్పష్టంగా చెప్పడంతో ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి పంపారు.
దీనిపై సదరు పోలీస్ అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తున్నాం. దాచేపల్లి సీఐ భాస్కర్‌రావు గతంలోనూ ఇలాంటి అరాచకాలకు పాల్పడ్డారు. గతంలో పాలేటి కృష్ణవేణి అనే సోషల్ మీడియా యాక్టివీస్ట్‌ను కూడా ఇదే సీఐ అర్ధరాత్రి అరెస్ట్ చేసి, ఆమెకు కనీసం భోజనం కూడా పెట్టించకుండా, అసభ్యంగా మాట్లాడి వేధించడంతో ఆయనపై ప్రైవేటు కేసు కూడా వేయడం జరిగింది. అలాగే తాడికొండ సీఐ మొవ్వా వాసు, డీఎస్పీ మురళీకృష్ణలు కూటమి ప్రభుత్వంలో రౌడీల్లా వ్యవహరిస్తున్నారు.
మాజీ మంత్రి విడదల రజిని పట్ల సీఐ సుబ్బానాయుడు ఎంత దురుసుగా వ్యవహరించారో ప్రజలంతా చూశారు. ప్రభుత్వం చెప్పే దానిని తూచా తప్పకుండా, చట్టాలను ఉల్లంఘిస్తూ అమలు చేస్తామనే రీతిలో ఈ పోలీసుల వ్యవహారం ఉంది. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని తన సొంత నియోజకవర్గం తాడిపత్రిలోకి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి బెదిరిస్తున్నా, జిల్లా ఎస్పీ దానికి వత్తాసు పలుకుతున్నారు. తన గ్రామానికి వెళ్ళేందుకు పోలీస్ రక్షణ కల్పించాలని పెద్దారెడ్డి కోర్ట్‌ను ఆశ్రయించారు. పెద్దారెడ్డికి పోలీస్ రక్షణ ఇవ్వాలని జిల్లా ఎస్పీకి కోర్ట్ డైరెక్షన్ ఇచ్చినా కూడా పోలీసులు దానిని అమలు చేయడానికి సాకులు చెబుతున్నారు. మనంఇది ప్రజాస్వామ్య వ్యవస్థలోనే ఉన్నామా అనే సందేహం కలుగుతోంది.