
సాక్షి, చిత్తూరు: ఏపీలో చంద్రబాబు అన్యాయ పాలన చేస్తున్నారని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. ఓట్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ వైఎస్సార్‌సీపీ కార్యకర్త అప్రమత్తంగా ఉండాలి. బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలని సూచించారు.
చిత్తూరులో వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన పుంగనూరు నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వైఎస్సార్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల నియోజకవర్గాల సమన్వయకర్తలు, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి, ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకరరెడ్డి, నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సజ్జల మాట్లాడుతూ..‘ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా వైఎస్ జగన్ పాలన సాగింది. సంస్థాగతంగా పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాం. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. రాబోయే వైఎస్ జగన్ పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుంది. మీ పాత్ర ప్రత్యక్షంగా ఉంటుంది. జగన్ చేసే యజ్ఞంలో మనం క్రియాశీలక పాత్రదారులం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. కానీ, వైఎస్ జగన్.. ప్రజల సంక్షేమం లక్ష్యంగా పాలన చేశారు.
టీడీపీ కమిటీలు దోచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తాయి. జగనన్న సైనికులు అని గర్వంగా చెప్పుకునే విధంగా మీరు పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఉన్నప్పటికీ మేము ఉన్నాము అని చెప్తున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పాటు పడిన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మనకు 18 లక్షలు మంది క్రియాశీలక సైన్యం ఉంది. ఎల్లో మీడియా, సోషల్ మీడియా గ్లోబల్ ప్రచారం చేస్తున్నారు. మన వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాటిని అడ్డుకుంటున్నారు. వ్యక్తిత్వ హననం, అబద్ధపు ప్రచారం చేస్తున్న ఎల్లో మీడియాను మన సోషల్ దీటుగా ఎదుర్కొంటోంది. వ్యక్తిగతంగా దాడికి రెడ్ బుక్ ఉపయోగించారు.
మనం డిజిటల్ బుక్ను లాంచ్ చేశాం. కార్యకర్తలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నాం అనే దానికి ఇది గుర్తు. ఫిర్యాదులు వస్తున్నాయి, వీడియోలు రికార్డు చేస్తున్నాం. డిజిటల్ బుక్ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా నమోదు చేయవచ్చు. చట్టబద్ధంగా వారిని శిక్షించేందుకు ఇది ఉపయోగ పడుతుంది. ప్రతీ ఒక్కరికి పార్టీ గుర్తింపు కార్డులు అందిస్తాం, టెక్నాలజీ వాడుకుని ముందు వెళ్తున్నాం. అన్యాయమైన పాలన చంద్రబాబు సాగిస్తున్నారు. ఓటర్లను తొలగించడం, వ్యవస్థలను మేనేజ్ చేయడం చంద్రబాబుకు తెలుసు. ప్రతీ కార్యకర్త, నాయకులు అప్రమత్తంగా ఉండాలి, బూత్ లెవల్లో నిత్యం పరిశీలిస్తూ ఉండాలి. నిర్మాణాత్మకమైన పార్టీగా, సంస్థాగతంగా సిద్ధం చేస్తాం. రాబోయే 30 ఏళ్లలో తిరుగులేని శక్తిగా వైఎస్సార్సీపీని బలోపేతం చేస్తున్నాం. ప్రత్యర్థులను వణుకు పుట్టించేలా ఈరోజు పుంగనూరు నియోజకవర్గం సమావేశానికి హాజరయ్యారు. బీటలు వారిన కోటలు టీడీపీ అని వ్యాఖ్యలు చేశారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు గ్రామ స్థాయి కమిటీలు ఏర్పాటు చేశాం. గ్రామ కమిటీలకే పూర్తి బాధ్యత, రాబోయే ఐదేళ్లు వీరికే బాధ్యత అప్పగిస్తామన్నారు.
భూమన కరుణాకరరెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అన్ని కమిటీలు నియమించిన మొట్టమొదటి నియోజకవర్గం పుంగనూరు నియోజకవర్గం. రాబోయే జగనన్న ప్రభుత్వంలో కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత. జగనన్న మాటగా మీరు గ్రామస్థాయిలో తీసుకు వెళ్లాల్సిన బాధ్యత మీపై ఉంది.
ఆకేపాటి అమరనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో జరిగిన పొరపాట్లు ఈసారి జరగనివ్వను. కార్యక్తలకే మొదటి ప్రాధాన్యత అని జగనన్న చెప్పారు. ఈసారి వైఎస్సార్సీపీ కార్యకర్తలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది అని హామీ ఇచ్చారు.