తాడేపల్లి : రాష్ట్ర గవర్నర్‌తో కూడా కూటమి ప్రభుత్వం పచ్చి అబద్ధాలు మాట్లాడించిందని విమర్శించారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లు అబద్ధాలతోనే బతుకుతున్నారని వెల్లంపల్లి మండిపడ్డారు. రిపబ్లిక్ డే రోజున కూడా గవర్నర్‌తో పచచి అబద్ధాలు చెప్పించడం దుర్మార్గమన్నారు.
ఈరోజు(సోమవారం, జనవరి 26వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన వెల్లంపల్లి.. ‘ చంద్రబాబు ఎన్నికలలో గెలవటానికి సూపర్ సిక్స్ పేరుతో పచ్చి మోసం చేశారు. జనవరి 1న జాబ్ కేలండర్ అని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారు. 23 లక్షల కోట్ల ఉద్యోగాలు ఇచ్చామంటూ చంద్రబాబు మోసపు మాటలు మాట్లాడారు. 30 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇవ్వలేదు. ఏ రైతు కూడా సంతోషంగా లేడు. అన్నదాత సుఖీభవ, ఉచిత సిలిండర్ పథకాల పేరుతో రైతులు, మహిళలను మోసం చేశారు.
జగన్ చేయూత పథకం కింద రూ.18 వేలు ఇచ్చారు. చంద్రబాబు పీ4 పేరుతో మోసం చేశారు. పీ4ని గొప్పగా అమలు చేస్తన్నామంటూ గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు. పెన్షన్ 5 లక్షల మందికి తగ్గించి వృద్దులు, వితంతువులను మోసం చేశారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లలో తిరగటం తప్ప ప్రభుత్వ పెద్దలు ఏమీ చేయటం లేదు. కూటమి ప్రభుత్వంలో ఏ వర్గమూ హ్యాపీగా లేదు. మంత్రి లోకేష్ నాయకత్వంలో ప్రభుత్వ స్కూళ్లు సర్వం నాశనం అయ్యాయి. అమరావతి రైతులను చంద్రబాబు దగా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా వేధిస్తున్నారు. మందడంలో రైతు రామారావు చావుకు ప్రభుత్వమే కారణం. రియల్ ఎస్టేట్ బిజినెస్ కోసం అమరావతిని అడ్డం పెట్టుకున్నారు. భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారు.

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే హోంమంత్రి సైలెంట్ గా ఉన్నారు. జగన్‌ని విమర్శించటం తప్ప హోంమంత్రికి మరేం పనిలేదు. సిగ్గులేని మాటలు మాట్లాడటం స్పీకర్ అయ్యన్నపాత్రుడికి అలవాటే. 2014-19 మధ్య మా పార్టీ నుండి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటే ఈ స్పీకర్ ఏం చేశారు?’ అని ప్రశ్నించారు.


