
తాడేపల్లి: కులాల వారీగా జనగణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ స్వాగతిస్తుందన్నారు పార్టీ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు పోతిన మహేష్. కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్ అని ఈ సందర్భంగా పోతిన పేర్కొన్నారు. తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన పోతిన.. ‘వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడే దీనిపై తీర్మానం చేశారని గుర్తుచేశారు.
‘అణగారిన వర్గాల అభివృద్ధికి ఈ కుల గణన ఎంతో మేలు చేస్తుంది. జగన్ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎంతో మేలు చేశారు. కుల గణన కోసం ఆరుగురు అధికారుల తో కమిటీని కూడా జగన్ నియమించారు. దేశంలో కుల గణన చేసిన మొదటి రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్.కుల గణన చేసిన మొదటి సీఎం వైఎస్ జగన్. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అణగారిన వర్గాలకు అందించిన గొప్ప వ్యక్తి జగన్. కూటమి ప్రభుత్వంలో సంక్షేమం అందించడానికి మీ కులం, ప్రాంతం ఏంటి అని అడుగుతున్నారు’ అని పోతిన మహేష్ స్పష్టం చేశారు.
