ఏపీలో అరాచక పాలనపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YSRCP Chief YS Jagan Slams Chandrababus Ruilng Over Misuse Of Police And Law & Order Failure In AP, Post Went Viral | Sakshi
Sakshi News home page

చంద్రబాబు రాష్ట్రంలో ప్రతీచోట విషపు విత్తనాలు నాటారు: వైఎస్‌ జగన్‌

Jul 5 2026 4:37 PM | Updated on Jul 5 2026 6:09 PM

YSRCP Chief YS Jagan Slams Chandrababus Ruilng

తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చంద్రబాబు పాలనలో అరాచక పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి తీవ్ర ఆగ్రహం  వ్యక్తం చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దుష్టసంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతీచోటా విషపు విత్తనాలు నాటారని, అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు హే రామ్‌… సేవ్‌ ఆంధ్రప్రదేశ్ అంటూ ట్వీట్‌ చేశారు. 

‘చంద్రబాబూ.. రాజకీయ అణచివేత చర్యలకోసం ప్రశ్నించేవారి గొంతు నొక్కడానికి ఆంధ్రప్రదేశ్‌లో మీరు పోలీస్‌ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణివైపు నడిపిస్తున్నారు. మీ పాలనలో పుట్టుకొచ్చిన దుష్టసంప్రదాయాలతో మీరు రాష్ట్రంలో ప్రతిచోటా విషపు విత్తనాలు నాటారు. అవి క్రమంగా మొక్కలై విషవృక్షాలుగా మారుతున్నాయి. చిన్నారులు మిస్సింగ్‌ అయినా దర్యాప్తుపై వేగం లేదు.మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదు. గిరిజన మహిళను వివస్త్రచేసి, దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్‌ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్‌బెయిలబుల్‌ సెక్షన్లు పెడతారా?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇప్పటికీ  ఆ పాప ఆచూకీ లేదు.. 
‘కాకినాడ జిల్లా తుని నియోజకవర్గానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి కనిపించకుండా పోయి 30 రోజులు దాటిపోయింది. ఇప్పటికీ ఆ పాప ఆచూకీ లేదు.తన కూతురు ఫొటోలు పట్టుకుని ఆ తండ్రి వీధివీధి తిరుగుతున్నాడు. పాప తల్లి ఆ బాధ తట్టుకోలేక తీవ్ర అనారోగ్యానికి గురైంది.ఒక చిన్నారి ఆచూకీ కనుగొనడంలోనే ప్రభుత్వం విఫలమైతే ఇక ప్రజల భద్రతకు భరోసా ఎలా ఇవ్వగలుగుతారు?’ అని ప్రశ్నించారు.

ఇదేమి పాలన చంద్రబాబూ..?
‘ఇంకో ఘటనలో ఇదే కాకినాడ జిల్లా పెద్దాపురంలో మానసిక దివ్యాంగురాలైన బాలికపై లైంగిక దాడి ఘటనపై కేసు నమోదుకు నానా తాత్సారం చేసి, నిందితులతో కుమ్మక్కు అయితే ఇక ఈ రాష్ట్రంలో పాలన ఎక్కడుంది?, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో టీడీపీ మాజీ కౌన్సిలర్‌ గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేశారన్న ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ఇలాంటి దారుణ ఘటనలో, తాత్సారం చేసి వారం రోజుల తర్వాత ఫిర్యాదు తీసుకోవడం ఒక పెద్ద తప్పు అయితే ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయకపోవడం మరింత దారుణం. పైగా బాధితులపైనే ఎదురు కేసు పెట్టడం చూస్తే, నేరస్తులకు రక్షణ, బాధితులకు వేధింపులు అన్నట్టుగా మీరు పోలీసు వ్యవస్థను నడుపుతున్నారు.’ అని మండిపడ్డారు. 

ఆ  తల్లి అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు..
‘సాయికృష్ణ లాకప్‌డెత్‌, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసింది. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాల్లేవు. క్రాంతికుమార్‌ ఆత్మహత్య కేసు, తాను ఇచ్చిన మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్‌ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలతచెందారు.గంగమ్మ, తిరుపతమ్మల లాకప్‌డెత్‌, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు, ఇవన్నీ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయి. అయినా, మీ బరితెగింపునకు కట్టడి లేదు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియా యాక్టివిస్టులపై వాటికి సంబంధించిన సెక్షన్లతో కాకుండా, బెయిల్‌ రాని సెక్షన్లు పెట్టాలని, కేసులను వ్య‌వ‌స్థీకృత నేరాల‌కు లింక్‌ చేయాలంటూ ఒక ఆర్గనైజ్డ్‌ క్రిమినల్‌ మాదిరిగా మీరే, ప్రతి స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు ఈ ఆదేశాలు చేరేలా, పోలీసుల‌కు హుకుం జారీ చేసిన‌ట్లుగా స‌మాచారం వ‌స్తోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి’ అని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఆ అభియోగాలను మీ మీదకూడా పెట్టాలికదా?
‘ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, భయపెట్టాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అవుతుంది. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌, ఉస్మానియా గోల్డ్‌మెడల్‌ జర్నలిస్ట్‌ కేవీఆర్‌ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్‌ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావడం, అతను చేయని వాటిని చేసినట్టుగా ఎఫ్‌ఐఆర్‌లో పెట్టి, జైలుకు పంపడం అత్యంత దుర్మార్గం. 

యూట్యూబర్‌ రావణ్ విషయంలో ఇప్పుడు మీరు పెట్టిన కేసులకు, నాలుగు కోర్టుల్లో బెయిల్స్‌ వచ్చినా, అహంకారంతో చెలరేగిపోతూ, నేరుగా సంబంధిత పోలీస్‌స్టేషన్లపై త‌మ వారి చేత దాడులు చేయించారు. అసహనంతో తీవ్రవాదులపై పెట్టే అభియోగాలు మోపారు. చంద్రబాబూ.., మీరు, పవన్‌కళ్యాణ్‌, లోకేష్‌లు సహా మీ పార్టీ నాయకులు గతంలో, ఇప్పుడుకూడా  ఏ మాట్లాడారో, ఏం మాట్లాడుతున్నారో  ఇప్పుడు వాళ్లుకూడా అవే మాటలు మాట్లాడుతున్నారు, వాటినే ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు మరి అవే అభియోగాలు మీ మీదకూడా పెట్టాలికదా?అని నిలదీశారు.

ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి
‘విమర్శకులను నేరస్తులుగా చిత్రీకరించడం, వారిని చంపడం కోసం పోలీస్‌స్టేషన్ల మీదకు మీవారిని పంపి దాడిచేయించడం, పోలీసులు మౌనం వహించి, ప్రేక్షకు పాత్ర పోషించడం, ఇవన్నీ ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలు. ఇది రాజ్యాంగ హక్కులపై దాడి. ఇది ప్రజాస్వామ్య విలువలపై దాడి.చంద్రబాబూ.. ఆంధ్రప్రదేశ్‌కు కావాల్సింది రౌడీ పోలీస్‌ రాజ్యం కాదు. జంగిల్‌రాజ్‌ కాదు. బాధితులకు న్యాయం చేసే వ్యవస్థ కావాలి. ప్రజలకు భద్రత కల్పించే పాలన కావాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం కావాలి. రాజకీయ ఆదేశాలకు కాకుండా, రాజ్యాంగానికి లోబడి నడిచే పోలీస్‌ వ్యవస్థ కావాలి’ అని స్పష్టం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement