చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్‌ జగన్‌ | YS Jagan Serious on Chandrababu Naidu Govt over Tenali Police Incident | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కారు అరాచకానికి ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి?: వైఎస్‌ జగన్‌

May 28 2025 4:57 AM | Updated on May 28 2025 6:50 AM

YS Jagan Serious on Chandrababu Naidu Govt over Tenali Police Incident

తెనాలి దారుణంపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

ముగ్గురు దళిత, మైనారిటీ యువకులను అత్యంత దారుణంగా కొట్టారు 

ఇది మానవ హక్కులను కాలరాసే చర్య.. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి 

మాట్లాడే ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు 

ఈ ప్రభుత్వంలో నెలకొన్న భయానక వాతావరణాన్ని ఈ ఘటన చెబుతోంది 

రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తోంది 

రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తోంది

సాక్షి, అమరావతి: గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో ముగ్గురు దళిత, మైనారిటీ యువకులపై పోలీసులు బహిరంగంగానే థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉల్లంఘిస్తున్నదో చెప్పడానికి ఇంతకంటే సాక్ష్యం కావాలా? అని ధ్వజమెత్తారు. చంద్రబాబు సర్కారు తీరును తీవ్రస్థాయిలో ఎండగడుతూ మంగళవారం ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

తెనాలిలో యువకులపై పోలీసుల దాడిని ఉటంకిస్తూ.. ‘‘చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం రాజ్యాంగాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. పోలీసులకు అంతులేని అధికారాన్ని కల్పించి... దళితులు, మైనారిటీలు, ఎస్టీలు, బీసీల హక్కులను గౌరవించకుండా ‘రెడ్‌బుక్‌ రాజ్యాంగం’ అమలు చేస్తోంది’’ అని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 

యువకులపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి 
‘తెనాలిలో దళిత, మైనారిటీ యువకులు చేబ్రోలు జాన్‌ విక్టర్, దోమా రాకేశ్, షేక్‌ బాబూ­లాల్‌ అలియాస్‌ కరీముల్లాపై పోలీసులు అత్యంత పాశవికంగా దాడి చేశారు. బాధితులను నడి రోడ్డుపై కూర్చోబెట్టి, అరికాళ్ల మీద లాఠీలతో దారుణంగా కొట్టారు. ఒక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌.. బాధితుల కాళ్లను తొక్కిపట్టగా, మరొక సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ లాఠీలతో దాడి చేశారు. మిగిలినవారు ఈ దాడిని  వీడియో తీశారు. లాఠీలు విరిగిపోతే నవ్వుతూ కొత్తవి అందజేశారు. 

వీడియో వైరల్‌ అయ్యాకే విషయం వెలుగులోకి... 
ఘోర ఘటనపై మాట్లాడడానికి కూడా ధైర్యం లేక స్థానికులు భయంతో నెలపాటు మౌనంగా ఉన్నారు. వీడియో వైరల్‌ అయ్యాకే దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రభుత్వంలో ఎంతటి భయానక వాతావరణం నెలకొందో ఈ ఉదంతం చెబుతోంది. ఇది కేవలం ఒక సంఘటన మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌ అంతటా ఇలాంటి ఎన్నో దారుణ, అమానవీయ దాడులు జరుగుతున్నాయి. భయంతో ప్రజలు నోరు విప్పలేని పరిస్థితులు ఉండటం వల్ల వెలుగులోకి రావడం లేదు. పోలీసులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం, అక్రమ కేసులు పెట్టడం, అన్యాయంగా అరెస్టులు చేయడం ద్వారా రాజ్యాంగాన్ని ప్రభుత్వం అపహాస్యం చేస్తోంది. ఇలాంటి పరిస్థితులు ప్రజల్లో ప్రభుత్వం పట్ల, చట్టబద్ధ పాలన పట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేస్తున్నాయి. రాజ్యాంగం కేవలం కాగితంగా మిగిలిపోయే ప్రమాదం పొంచి ఉంది. 

ఇది మానవ హక్కులను కాలరాసే చర్య... 
తెనాలిలో దళిత, మైనారిటీ యువకులపై పోలీసుల దాడి మానవ హక్కులను కాలరాసే చర్య. రాజ్యాంగ విలువల మీద నేరుగా దాడి చేయడమే. పోలీసులు న్యాయస్థానం ముందు సాక్ష్యాధారాలను సమరి్పంచాలే తప్ప... వాళ్లే న్యాయమూర్తులుగా వ్యవహరించి, శిక్షించే పని చేపట్టకూడదు. ప్రజాస్వామ్యంలో ప్రజలను కొట్టడం, హింసించడానికి చోటే లేదు. చంద్రబాబు ప్రభుత్వం ఈ దాడులకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్‌ చేస్తున్నాం’ అని వైఎస్‌ జగన్‌  పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement