ఇదే చంద్రబాబుకు నా ఛాలెంజ్‌: సీఎం జగన్‌

Ys Jagan Comments On Chandrababu In Markapuram Public Meeting - Sakshi

30 లక్షల ఇళ్ల స్థలాల వద్దకొచ్చి సెల్ఫీ దిగమని అడగండి

ఇప్పుడున్న పథకాలన్నీ అప్పుడెందుకు లేవని ప్రశ్నించండి

ఆ డబ్బును ఎవరికి దోచిపెట్టావని నిగ్గదీయండి

మనందరి ప్రభుత్వ పాలనకు, గత పాలనకు తేడా గమనించండి

నాకున్నదల్లా దేవుడి దయ, మీ దీవెనలే

నిప్పులు చెరిగిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ‘అయ్యా.. చంద్రబాబూ.. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే నాలుగు ఫేక్‌ ఫొటోలు కాదు.. ఈ రాష్ట్రంలో ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఇతరత్రా ప్రతి పేద ఇంటి ముందు నిలబడి.. ఈ ఇంటికి మా ప్రభుత్వం వల్ల జరిగిన మంచి ఇదీ అని చెప్పగలగాలి. అది మన ప్రభుత్వం వల్లే జరిగిందని ఆ అక్కచెల్లెమ్మలు చిరునవ్వుతో ఆశీర్వదిస్తున్న­ప్పుడు తీసుకునే ఫొటోను సెల్ఫీ అంటారు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో, నాలుగేళ్ల తమ ప్రభుత్వ పాలనలో ప్రతి ప్రాంతానికి, గ్రామానికి, ప్రతి సామాజిక వర్గానికి జరిగిన మేలు గురించి బేరీజు వేసుకునే సత్తా మీకు ఉందా.. ఇదీ ఛాలెంజ్‌ అని చంద్రబాబుకు సవాలు విసురుతూ నిప్పులు చెరిగారు.

ప్రకాశం జిల్లా మార్కాపురంలో బుధవారం ఆయన వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం పథకం కింద రెండో విడత నగదు పంపిణీని కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘చంద్రబాబు టిడ్కో ఇళ్లు కట్టకుండా వదిలేశాడు. అలా వదిలేసిన ఇళ్లను మీ బిడ్డ హయాంలో పూర్తిగా కట్టిన చోటుకు, వేగంగా పనులు జరుగుతున్న ఇళ్ల వద్దకు వెళ్లి ఈ 75 ఏళ్ల ముసలాయన నాలుగు ఫేక్‌ ఫొటోలు దిగి సెల్ఫీ ఛాలెంజ్‌ అంటున్నాడు’ అని ఎద్దేవా చేశారు. సెల్ఫీ ఛాలెంజ్‌ అంటే ఫేక్‌ ఫొటోలు కాదన్నారు. 

బాబు బృందాన్ని ఇలా నిలదీయండి
► ఈ నిజాలు ప్రజలందరికీ తెలుసు. అయినా చంద్రబాబు, ఎల్లోమీడియా నిందలు, అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తు­న్నారు. నిజంగా ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5­లు ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించేందుకు దిక్కుమాలిన ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి అబద్ధాల బ్యాచ్‌ని నమ్మకండి. వారిని నిలదీయండి. 

► గత ఐదేళ్లలో ఒక్క ఇంటి స్థలం ఇవ్వని మీరు.. ఈ ప్రభుత్వంలో ఏకంగా 30 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి.. అందులో కట్టిస్తున్న ఇళ్ల వద్ద సెల్ఫీ దిగే ధైర్యం, స్టిక్కర్‌ అంటించే దమ్ము ఉందా అని నిలబెట్టి అడగండి.

► మనందరి ప్రభుత్వంలో అమ్మ ఒడి ద్వారా 45 లక్షల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు మంచి జరిగిందని చెబుతూ.. మీరేం చేశారని ప్రశ్నించండి.

► 53 లక్షల మంది రైతు కుటుంబాలకు వరుసగా నాలుగేళ్లుగా ప్రతి ఏటా రూ.13,500 రైతు భరోసాగా అందిందని చెప్పండి. గతంలో బేషరతుగా రుణమాఫీ చేస్తామని ఎందుకు మోసం చేశావని చంద్రబాబును అడగండి.

► అయ్యా.. చంద్రబాబూ.. రుణమాఫీ చేస్తానని మోసం చేశావు.. బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపించి ఇంటికి ఇప్పిస్తానని చెప్పి మోసం చేశావు. చివరకు సున్నా వడ్డీ పథకాన్ని కూడా ఎగురగొట్టావ్‌.. మమ్మల్ని రోడ్ల మీద నిలబెట్టావ్‌.. అలాంటి మనిషివి నువ్వు మా ఇంటి ముందు నిలబడి సెల్ఫీ దిగే నైతికత, స్టిక్కర్‌ అంటించే అర్హత ఉందా.. అని పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు అందరూ గట్టిగా నిలబెట్టి అడగండి. 

► వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ కాపు నేస్తం, ఈబీసీ నేస్తం.. ఇంకా అనేక పథకాలు మా జగనన్న ఇచ్చాడు.. ఈ పథకాలకు సంబంధించిన డబ్బులు నీ పాలనలో ఎక్కడికి పోయాయి.. ఎవరు తిన్నారు.. అని 45–60 ఏళ్ల వయస్సులో ఉన్న నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఈబీసీ అక్కచెల్లెమ్మలు చంద్రబాబును అడగండి.

► ప్రభుత్వ బడి గురించి, మధ్యాహ్న భోజనం, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్, 6వ తరగతి నుంచి ప్రతి క్లాస్‌లో డిజిటల్‌æ బోర్డ్, ఇంగ్లిష్‌ మీడియం.. సీబీఎస్‌సీ సిలబస్, బైలింగ్వల్‌ టెక్ట్స్‌బుక్స్, పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలాంటి ఆలోచనలు మీకు ఎప్పుడైనా తట్టాయా అని చంద్రబాబును గట్టిగా నిలదీస్తూ అడగండి. 

► మీ పాలనలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు ముష్టి ఇచ్చినట్లు రూ.వెయ్యి పింఛన్‌ ఎందుకిచ్చావని ఇప్పుడు రూ.2,750 పెన్షన్‌ తీసుకుంటున్న నా అవ్వాతాతలు, వితంతు అక్కచెల్లెమ్మలు, దివ్యాంగ అక్కచెల్లెమ్మలు నిలదీయండి. పింఛన్‌ మూడు వేలు కాబోతోందని చెప్పండి. ఇంత మేలు చేసిన మా బిడ్డతో కాకుండా మీతో సెల్ఫీ ఎలా దిగుతాము అని ప్రశ్నించండి.  

► ఇంటింటికీ మంచి చేయడం అభివృద్ధా.. లేక రామోజీ ఇంటికి, రాధాకృష్ణ ఇంటికి, టీవీ–5 ఇంటికి.. చంద్రబాబు ఇంటికి దత్తపుత్రుడు ఇళ్లకు.. మూటలు పంపడం అభివృద్ధా.. అని గట్టిగా అడగండి. సామాజిక న్యాయం అంటే అన్ని కులాలకు మంచి చేయడమా...లేక చంద్రబాబు బృందం భోజనం చేయడమా అని  ప్రశ్నించండి. 

► భక్తి ఉంటే విజయవాడలో 45 గుళ్లను కూల్చేయ­డ­మా... మైనార్టీల మీద దేశ ద్రోహం కేసులు పెట్టడమా.. అ­ని కూ­డా గట్టిగా అడగండి. జన్మభూమి కమిటీలు మంచి­వా.. లే­క ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయ వ్యవస్థ, వ­లం­­టీర్ల వ్యవస్థ మంచిదా అని చంద్రబాబు బృందాన్ని అడగండి. 

► చంద్రబాబుకు సీఎం పదవి అంటే.. అరడజన్‌ దొంగలు.. గజదొంగలుగా దోచుకోవడం.. పంచుకోవడం... తినడం. అదే మీ బిడ్డ జగన్‌కు సీఎం పదవి ఇవ్వడమంటే.. ఇంటింటా అభివృద్ధి అని చెప్పండి. 

అన్నీ గుర్తు పెట్టుకోండి..
► గతంలో 600 పేజీలతో ఒక మేనిఫెస్టో తీసు­కొ­చ్చాడు. ఎన్నికలు అయిపోగానే దానిని చెత్తబుట్టలో పడే­శా­డు. అక్కచెల్లెమ్మలు, రైతులు, విద్యార్థులకు ఇచ్చిన మా­ట­లు గాలికి ఎగిరిపోయాయి. ఆ మేనిఫెస్టో వాళ్ల వెబ్‌­సైట్‌­లో కూడా కనబడని పరిస్థితి. అదే మీ బిడ్డ ప్రభుత్వంలో మే­నిఫెస్టో అంటే ఒక బైబిల్‌.. ఒక ఖురాన్‌.. ఒక భగవద్గీత. ప్రతిరోజూ, ప్రతిక్షణం ఆ మేనిఫెస్టో కోసం తపించిన మీ బిడ్డ పాలన ఎలాంటిదో ఆలోచించమని కోరుతున్నా.

► రాబోయే రోజుల్లో ఇంకా చాలా డ్రామాలు చూస్తాం. చాలా చాలా అబద్ధాలు  వింటాం. వాళ్లకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఉంది. తోడుగా వాళ్ల దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. కానీ మీ బిడ్డకు ఇవేమీ లేవు. మీ బిడ్డ వీళ్ల మాదిరి గజ దొంగల ముఠాను నమ్ముకోలేదు. మీ బిడ్డ నమ్ముకుంది ఆ దేవుడి దయను, మిమ్ముల్ని. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా మద్దతుగా నిలవండి.    

తేడా మీరే చెప్పండి..
► ఈ నాలుగేళ్ల మనందరి ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు, వివక్షకు చోటు లేకుండా డీబీటీ ద్వారా మీ బిడ్డ బటన్‌ నొక్కుతున్నాడు. నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ఇంటింటికీ ఎంత మంచి చేశామో మీ అందరికీ తెలుసు. అదే గత ప్రభుత్వంలో 2014–2019 మధ్య ఒక ముసలా­యన సీఎంగా ఉండేవాడు. అప్పట్లో ఈ పథకాలు ఉండేవా? ఈ బటన్‌ నొక్కే డీబీటీ పద్ధతి ఉండేదా? ఆ రోజు దోచుకో.. పంచుకో.. తినుకో.. (డీపీటీ).

► 2 లక్షల 7 వేల  కోట్ల రూపాయలు మనందరి ప్రభుత్వంలో మన అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా జమ అయింది. గత చంద్రబాబు పాలనలో ఈ డబ్బును ఎవరు దోచుకున్నారు?

► గత చంద్రబాబు పాలనలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా వేశారా? (లేదు లేదు అని మహిళలు చేతులు పైకెత్తి చెప్పారు). ఇవాళ ఏ పథకం తీసుకున్నా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో సొమ్ము జమ అవుతోంది. గతంలో జరగనిది.. మీ బిడ్డ జగన్‌ ఎలా ఇవ్వగలుగు­తున్నాడో రాష్ట్రంలోని ప్రతి అన్నను, తమ్ముడ్ని.. ప్రతి అక్కను, చెల్లెమ్మను.. మొత్తంగా 1.56 కోట్ల కుటుంబాలను ఆలోచించాలని కోరుతున్నా.  

మా అమ్మాయి మీకు థ్యాంక్స్‌ చెప్పమంది 
అన్నా.. నా భర్త చిన్న ఉద్యోగస్తుడు. ఓసీల్లోని పేదలను గుర్తించి ఈబీసీ నేస్తం ద్వారా ఏటా రూ.15 వేలు నేరుగా మా అకౌంట్‌లో వేస్తున్నారు. ఈ డబ్బుకు మరికొంత కలుపుకుని కిరాణా షాపు పెట్టుకోవాలనుకుంటున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. అమ్మఒడి సాయం అందింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు–నేడు ద్వారా మా పిల్లలు చదువుకునే పాఠశాలను బాగు చేశారు. 8వ తరగతి చదువుతున్న మా పాపకు ట్యాబ్‌ ఇచ్చారు. మా అమ్మాయి మీకు థ్యాంక్స్‌ చెప్పమంది. సొంతింటి కలను కూడా నిజం చేస్తున్నారు. ప్రజల దగ్గరకు వచ్చి పాలన అందిస్తున్న మీరు కలకాలం చల్లగా ఉండాలి.  – కాసుల వెంకట అరుణ, పదో వార్డు, మార్కాపురం 
చదవండి: అడ్డంగా దొరికినా అడ్డదారిలోనే!
మీ మేలు ఎవరూ మరచిపోరు 
మహిళలంతా ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా ఎన్నో పథకాలు తీసుకొచ్చిన మీ మేలును అక్కచెల్లెమ్మలు ఎవరూ మరచి పోరు. జగనన్న పాలనలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. నారీ లోకమంతా మిమ్మల్ని దీవిస్తోంది. నాలుగేళ్లుగా సకాలంలో వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాయి. పంటలు బాగా పండాయి. దిగుబడులు బాగా వచ్చాయి. పేదరికం అనే పెద్ద రోగాన్ని తరిమేయాలని మీరు తపస్సు చేస్తున్నారు. ముందు తరాలకు కూడా భరోసా ఇచ్చేలా పాలన అందిస్తున్న మీకు అన్ని వర్గాల వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు. 
– చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top