ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి

Women Candidate Hillarious Campaign By Urging Money For Election Chennai - Sakshi

సాక్షి, చెన్నై: ఎన్నికల్లో ఓటుకు నోటు ఇస్తున్న అభ్యర్థులకు భిన్నంగా ఓ మహిళా అభ్యర్థి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు కోసం నోటు ఇవ్వడంటూ అభ్యర్థించే పనిలో పడ్డారు. నాగపట్నం జిల్లా తిరుత్తురై పూండి అసెంబ్లీ నియోజకవర్గంలో నామ్‌ తమిళర్‌ కట్చి అభ్యర్థిగా ఆర్తీ పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆమె వినూత్న బాటను ఎంచుకున్నారు. ఓటుకు నోటు ఇచ్చే స్థితిలో తాను లేనని, అయితే, గెలిపిస్తే అందరికీ మంచి చేస్తానని ప్రసంగాలు చేస్తున్నారు.

ఎన్నికల కమిషన్‌ కొన్ని లక్షలు ఖర్చుపెట్టుకోవచ్చని సూచించిందని, ఆ మొత్తం కూడా తన వద్ద లేదని వాపోతున్నారు. అంతేకాదు,  ఓటుతో పాటు ఎన్నికల ఖర్చు నిమిత్తం తనకు విరాళంగా ఎంతో కొంత ఇవ్వాలని ప్రజల్ని అభ్యర్థిస్తూ ముందుకు సాగే పనిలో పడ్డారు. గురువారం ఇదే తరహాలో ఆమె తిరుత్తురై పూండి మార్కెట్‌ పరిసరాల్లో ప్రచారంలో ముందుకు సాగారు. దీంతో ఆమె ప్రసంగం, ఆమె అభ్యర్థనకు స్పందించిన అక్కడి వర్తకులు తమకు తోచినట్టుగా రూ. వంద, రూ. ఐదు వందలు అంటూ ఎన్నికల ఖర్చునిమిత్తం ఆర్తీకి విరాళం అందించడం విశేషం.  

అమ్మ వరమిచ్చింది...
సహకార శాఖ మంత్రిగానే కాదు థర్మాకోల్‌ మంత్రిగా ముద్రపడ్డ సెల్లూరు రాజు తాను పోటీ చేస్తున్న మదురై ఉత్తరం నియోజకవర్గం పరిధిలో ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. గురువారం ఆయన పలంగానత్తం పరిసరాల్లో ప్రచారం చేశారు. ఆయనకు హారతి పట్టేందుకు వచ్చిన ఓ వృద్ధురాలు పూనకం వచ్చినట్టుగా ఊగిపోయింది. సెల్లూరు రాజు వైపు దూసుకొచ్చి అమ్మ వరమిచ్చేసింది..గెలుపు నీదే అంటూ పెద్ద పెద్దగా కేకలు పెట్టింది.

దీంతో ఆమెను ఓ శాలువతో సెల్లూరు సత్కరించారు. ఆయన సత్కరించి అటు వెళ్లగానే, ఆ శాలువతో ఆ వృద్ధురాలు పరుగులు తీయడం గమనార్హం.  అన్నాడీఎంకే పరమకుడి అభ్యర్థి సదన్‌ ప్రభాకర్‌ ఓటర్లను ఆకర్షించేందుకు గురువారం ఓ మాంసం దుకాణంలో పనిచేశారు. మాంసాన్ని ముక్కలుగా కత్తిరించి విక్రయించే పనిలోపడ్డారు. అలాగే పక్కనున్న హోటల్లో పరోటా మాస్టర్‌ అవతారమెత్తారు.  
చదవండి: 
తమిళనాడు ఎన్నికలు : మీ జీవితంలో ఇలాంటి హామీలు వినుండరు

‘సాగర్‌’.. సస్పెన్స్‌: పోటీదారులెవరో..?‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top