కార్పొరేటర్ సింధుకు ప్రగతి భవన్ నుంచి పిలుపు

Who Will Be New Female Mayor For GHMC Is Currently Under Discussion - Sakshi

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)కు కొత్త మహిళా మేయర్‌ ఎవరన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.  అతిపెద్ద పార్టీగా టీఆర్‌ఎస్‌ అవతరించింది. 31 మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల బలం గులాబీ పార్టీకి ఉన్నప్పటికీ మ్యాజిక్‌ ఫిగర్‌ 98ను అందుకోలేదు.  ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతు కూడగట్టుకొని మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవాలి. టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరికి ఛాన్స్‌ దొరుకుతుందనేది ఆసక్తికరంగా మారింది. రేసులో పలుపేర్లు వినిపిస్తుండగా... భారతీనగర్‌ డివిజన్‌ నుంచి గెలిచిన వి.సింధును ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం ప్రగతిభవన్‌కు పిలిపించుకున్నారు. దాంతో ఆమెనే మేయర్‌ పీఠం వరించనుందనే ప్రచారం జరుగుతోంది. అయితే ఆశావహులు చాలామందే ఉన్నారు.

టీఆర్‌ఎస్‌ నాయకుడు మన్నె గోవర్థన్‌రెడ్డి భార్య, వెంకటేశ్వరకాలనీ కార్పొరేటర్‌ మన్నె కవితారెడ్డి, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి కోడలు విజయశాంతి, ఎంపీ కె.కేశవరావు కుమార్తె గద్వాల విజయలక్ష్మి, ఖైరతాబాద్‌ కార్పొరేటర్‌ విజయారెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. వీరంతా రెండో పర్యాయం గెలిచినవారే. వీరితోపాటు ప్రస్తుత మేయర్‌ బొంతు రామ్మోహన్‌ సతీమణి శ్రీదేవి పేరు కూడా వినిపిస్తోంది. ఈసారి మేయర్‌ సీటు జనరల్‌ మహిళకు రిజర్వు కావడంతో ఓసీల నుంచే అవకాశం కల్పించనున్నారని బలంగా వినిపిస్తోంది. ముఖ్యమంత్రి సింధును పిలవడం ఇందుకు ఊతమిస్తోంది.  జీహెచ్‌ఎంసీగా అవతరించాక జరిగిన తొలి ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ నుంచి మహిళా మేయర్‌గా కార్తీకరెడ్డి బాధ్యతలు చేపట్టడం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top