బెంగాల్‌ ఎన్నికలు: ప్రశాంత్‌ కిషోర్‌ ఆసక్తికర ట్వీట్‌

West Bengal Polls Prashant Kishor Says On May 2 Hold Me To Last Tweet - Sakshi

కోల్‌కతా: ప్రజాస్వామ్యాన్ని గెలిపించుకునే క్రమంలో పశ్చిమ బెంగాల్‌ అతిపెద్ద ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతోందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. సరైన నాయకులను ఎంచుకునేందుకు, స్పష్టమైన సందేశం ఇచ్చేందుకు బెంగాల్‌ ప్రజలు సన్నద్ధమయ్యారంటూ పరోక్షంగా బీజేపీకి చురకలు అంటించారు. తమ పుత్రికనే మరోసారి ముఖ్యమంత్రిగా చూడాలని బెంగాల్‌ కోరుకుంటోందని సీఎం మమతా బెనర్జీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాగా పశ్చిమ బెంగాల్‌తో పాటు తమిళనాడు, అసోం, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసిన విషయం తెలిసిందే. 294 శాసన సభ స్థానాలు గల బెంగాల్‌లో 8 విడతల్లో(మార్చి 27- ఏప్రిల్‌ 29) పోలింగ్‌ జరుపనున్నట్లు సీఈసీ సునిల్‌ అరోరా వెల్లడించారు. అసోంలో మూడు దశల్లో, మిగిలిన ప్రాంతాల్లో ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో బెంగాల్‌లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే పరస్పర విమర్శలతో అధికార తృణమూల్‌- బీజేపీ దూకుడు పెంచాయి. ఈ క్రమంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల అనంతరం కేంద్రం తీరుపై మండిపడ్డారు. అసోంలో ఎన్నికల ప్రచారం పూర్తిచేసుకుని బెంగాల్‌లో ప్రచారానికి వచ్చేందుకే 8 దశల్లో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రచించారా అంటూ మోదీ సర్కారును విమర్శించారు. ఈ క్రమంలో టీఎంసీ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ శనివారం ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ‘‘భారత్‌లోని అతిపెద్ద ప్రజాస్వామ్య పోరాటం పశ్చిమ బెంగాల్‌లో జరుగనుంది. బెంగాల్‌ ప్రజలు ఇందుకు సిద్ధంగా ఉన్నారు. వారి వైఖరి ఏమిటో స్పష్టం చేసేందుకు సన్నద్ధమయ్యారు. బెంగాల్‌ తమ బిడ్డ గెలుపునే కోరుకుంటోంది’’ అని పేర్కొన్నారు. సీఎం మమత మరోసారి విజయభేరి మోగించడం ఖాయం అని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే తేదీ మే 2 వరకు తనను ఫాలో అవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

చదవండి: టీఎంసీ- బీజేపీ పోరు: 8 విడతల్లో బెంగాల్‌ ఎన్నికలు!

 ఎన్నికల షెడ్యూల్‌: కేంద్రంపై సీఎం ఫైర్‌

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top