ఎన్నికల షెడ్యూల్‌: కేంద్రంపై సీఎం ఫైర్‌ | Mamata Banerjee Asks Is It On PM Suggestion Over Marathon Polls | Sakshi
Sakshi News home page

ఎన్నికల షెడ్యూల్‌: మమతా బెనర్జీ ఆగ్రహం

Feb 26 2021 8:54 PM | Updated on Feb 27 2021 12:05 AM

Mamata Banerjee Asks Is It On PM Suggestion Over Marathon Polls - Sakshi

ఒకరోజు ఓ జిల్లాలోని సగం నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తారా? ఇది ప్రధాని మోదీ ఐడియానా లేదంటే అమిత్‌ షా చెప్పారా? అసోంలో ప్రచారం ముగిసిన అనంతరం తాపీగా బెంగాల్‌లో ప్రచారం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారా?

కోల్‌కతా: కేంద్ర సర్కారుపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ వేసిన ఎత్తుగడలో భాగంగానే 8 విడతల్లో ఎన్నికల నిర్వహణ అంటూ ధ్వజమెత్తారు. కాగా బెంగాల్‌తో పాటు తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 27 నుంచి ఏప్రిల్‌ 29 వరకు 8 దశల్లో బెంగాల్‌లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ విషయంపై స్పందించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 294 శాసన సభ స్థానాలున్న బెంగాలో పాటు షెడ్యూల్‌ ప్రకటించిన తమిళనాడు(234), కేరళ(140)లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తూ తమ రాష్ట్రంలో మాత్రం ఎందుకిలా అని ప్రశ్నించారు.

ఈ మేరకు శుక్రవారం మమతా బెనర్జీ మాట్లాడుతూ.. ‘‘బీజేపీ వర్గాల నుంచి నాకు సమాచారం అందింది. వారి సలహాలకు అనుగుణంగానే ఈ తేదీలు ఖరారు చేసినట్లు కనిపిస్తోంది. ఒకరోజు ఓ జిల్లాలోని సగం నియోజకవర్గాలకే ఎన్నికలు నిర్వహిస్తారా? ఇది ప్రధాని మోదీ ఐడియానా లేదంటే అమిత్‌ షా చెప్పారా? అసోంలో ప్రచారం ముగిసిన అనంతరం తాపీగా బెంగాల్‌లో ప్రచారం చేసుకునేందుకే ఈ ఎత్తుగడ వేశారా? ఈ సారి ఆటలో మిమ్మల్ని మరోసారి చిత్తుగా ఓడిస్తాను. దెబ్బకు దెయ్యం వదిలిస్తాను. నేను బెంగాల్‌ పుత్రికను. బీజేపీ కంటే నాకే ఈ రాష్ట్రం గురించి ఎక్కువగా తెలుసు. ఎనిమిది విడతలు అయినా గెలుపు మాదే. మీ కుట్రలన్నీ ఛేదిస్తాను. 

మీరు చేసిన అవమానానికి బెంగాల్‌ ప్రజలు కచ్చితంగా బదులు తీర్చుకుంటారు. మీకు వాయింపులు తప్పవు. దేశంలో ఉన్న ఒకే ఒక్క మహిళా ముఖ్యమంత్రి మీద మీ కక్షసాధింపు చర్యలు అందరూ గమనిస్తున్నారు’’ అంటూ బీజేపీ అధినాయకత్వంపై నిప్పులు చెరిగారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల్లో(2016) 294 స్థానాలకు గానూ టీఎంసీ 211, వామపక్షాలు 79 గెలుచుకోగా బీజేపీ కేవలం 3 స్థానాల్లోనే గెలుపొందిన విషయం తెలిసిందే. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో  అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ 18 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుని మమతకు షాకిచ్చింది. అదే జోరులో టీఎంసీ ప్రధాన నేతలను పార్టీలో చేర్చుకుంటూ అసెంబ్లీ ఎన్నికలకు సై అంటోంది.

చదవండిబెంగాల్‌, తమిళనాడు కీలక ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement