వికారాబాద్‌: మంత్రి సబితా ఎదుటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల లొల్లి

War Between Trs MLA Rohit Reddy And  MLC Patnam Mahender Reddy - Sakshi

నేతల వైరం.. అభివృద్ధికి దూరం

తాండూరులో తార స్థాయికి చేరిన వర్గపోరు

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాల బాహాబాహీ

ప్రజా సమస్యలు గాలికొదిలేసి.. గ్రూపు రాజకీయాలకే ప్రాధాన్యం

ఏళ్ల తరబడి ఎక్కడి పనులు అక్కడే

నేతల మధ్య నెలకొన్న వైరం.. అభివృద్ధికి ఆటంకంగా మారుతోంది. తాండూరులో ప్రజా సమస్యలను గాలికొదిలేసిన పాలకులు వ్యక్తిగత ఎజెండాల అమలుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ క్రమంలో పరస్పర ఆరోపణలు చేసుకుంటూ వర్గపోరును ప్రోత్సహిస్తున్నారు. రెండేళ్లకుగా పైగా ఈ తతంగాలను గమనిస్తున్న నియోజకవర్గ ప్రజలు వీరి తీరును ఈసడించుకుంటున్నారు. 

సాక్షి, వికారాబాద్‌: అధికార పార్టీలో కొనసాగుతున్న ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వ్యవహార శైలిపై ప్రజలు మండిపడుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్లెక్కి ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. సాధారణ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు సైతం వినూత్న నిరసనలతో వీరి తీరును ఎండగడుతున్నారు. జిల్లాలోని మిగతా నియోజకవర్గల్లోనూ అధికార పార్టీలో గ్రూపు తగాదాలు కనిపిస్తున్నా తాండూరులో ఇవి తార స్థాయికి చేరాయి. శుక్రవారం పట్టణంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు వాగ్వాదానికి దిగడం పరిస్థితికి అద్దం పట్టింది. 


తాండూరులో రోడ్ల దుస్థితిపై చెప్పుల దండ వేసుకుని నిరసన

మీకు ఓటేసి సిగ్గుపడుతున్నా.. 
‘జనం బాధలు పట్టించుకోని ఈ నేతలకు  ఓటేసినందుకు సిగ్గుపడుతున్నా’ అంటూ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి చెప్పుల దండ మెడలో వేసుకుని ఇటీవల నిరసన తెలిపాడు. ‘తాండూరు మున్సిపాలిటీతో పాటు నియోజకవర్గంలోని రోడ్ల ను చూసి.. ఈ నాయకుల్లో చలనం రాకపోవడం తమ దౌర్భాగ్యం’ అని పట్టణ ప్రజలు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మాజీ మంత్రి, ఎమ్మెల్సీ  మహేందర్‌రెడ్డికి ప్రత్యామ్నాయంగా రాజకీయాలు, అభివృద్ధిలో నూతన ఒరవడి సృష్టిస్తానని చెప్పిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి సైతం ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పర్యటనల్లో ఆందోళన చేస్తున్న ప్రజలను అరెస్టులు, గదమాయింపులతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

పైలెట్‌ చేరికతో సీన్‌ రివర్స్‌  
టీఆర్‌ఎస్‌ తరఫున జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్లో కొప్పుల హరీశ్వర్‌రెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు. మొదటినుంచి పార్టీని బలోపేతం చేసే దిశగా తమవంతు ప్రయత్నాలు చేశారు. ఈ క్రమంలో హరీశ్వర్‌రెడ్డి వయసు పైబడటం, ఆరోగ్యం సహకరించని కారణంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో మహేందర్‌రెడ్డి పార్టీకి పెద్దదిక్కుగా మారారు. టీఆర్‌ఎస్‌ మొదటిసారి అధికారంలో ఉన్న ఐదేళ్లలో మంత్రిగా పనిచేసిన ఆయన జిల్లా రాజకీయాలను శాసించారు. అనూహ్యరీతిలో 2018 సార్వత్రిక ఎన్నికల్లో  ఓటమిపాలవగా.. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించారు. ఆతర్వాత కొద్ది రోజులకే రోహిత్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీలో గ్రూపు తగాదాలకు తెరలేచింది.


మంత్రి సబితారెడ్డి సమక్షంలో వాగ్వాదానికి దిగిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గీయులు,

మహేందర్‌రెడ్డి, సునీతారెడ్డి, రోహిత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు నియోజకవర్గంలో నెలకొన్న వర్గపోరుతో జనం అవస్థలు పడుతున్నారు. అభివృద్ధి పనుల నిర్వహణ, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల సమయంలో నూ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని  పరిస్థితి నెలకొంది. వీరి మధ్య అధికారులు సైతం నలిగిపోతున్నారనే వాదన వినిపిస్తోంది. ఇటీవల పెద్దేముల్‌ మండలంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డి ప్రారంభించాల్సిన పలు అభివృద్ధి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేయడం నేతల మధ్య అంతరాన్ని మరింత పెంచింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదర్చాల్సిన మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి సైతం సొంత కేడర్‌ను బలోపేతం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారనే చర్చ సాగుతోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top