మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాలా! | Witnesses Penaka Sarath Chandra Reddy and Rohit Reddy approached the High Court | Sakshi
Sakshi News home page

మా ప్రమేయం లేకుండా వాంగ్మూలాలా!

Nov 8 2025 3:44 AM | Updated on Nov 8 2025 3:47 AM

Witnesses Penaka Sarath Chandra Reddy and Rohit Reddy approached the High Court

మద్యంపై అక్రమ కేసులో కీలక మలుపు

మేం చెప్పని విషయాలతో సెక్షన్‌ 161 కింద దర్యాప్తు సంస్థ వాంగ్మూలం తయారు చేసింది 

తీవ్ర విస్మయకరంగా.. మేం చెప్పిన దానికి భిన్నమైన విషయాలు అందులో ఉన్నాయి.. అవి మేం స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావు

వాటిని దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశించండి.. 

మేం చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవటాన్ని చట్ట, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించండి.. సెక్షన్‌ 161 కింద మేం ఇచ్చామని దర్యాప్తు సంస్థ చెబుతున్న వాంగ్మూలాలు.. మేం స్వచ్ఛందంగా ఇవ్వలేదు 

దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను, చెప్పిన విషయాలను.. చెప్పినట్లుగానే నమోదు చేయాలి.. వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాల్సి ఉన్నా దాన్ని పాటించలేదు 

నిష్పాక్షిక దర్యాప్తు రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగం..

గత నెల 16న మేం ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం.. 

మద్యంపై అక్రమ కేసులో హైకోర్టును ఆశ్రయించిన సాక్షులు పెనకా శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి  

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసులో ఇన్నాళ్లూ భేతాళ విక్రమార్క కథలు చూశాం! సాక్షుల వాంగ్మూలం పేరుతో సిట్‌ ద్వారా టీడీపీ పెద్దలు ఆడిస్తున్న నాటకాలు తాజాగా బట్టబయలయ్యాయి! హైకోర్టులో వేసిన పిటిషన్‌తో ఈ విషయం మరోసారి తేలిపోయింది. తాము చెప్పని విషయాలతో సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద విచారణ సంస్థ తయారు చేసిన వాంగ్మూలాలను దర్యాప్తు రికార్డు నుంచి తొలగించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ ఈ కేసులో సాక్షులు పెనకా శరత్‌ చంద్రారెడ్డి, ఆయన సోదరుడు పెనకా రోహిత్‌రెడ్డి తాజాగా హైకోర్టును ఆశ్రయించడం కీలకంగా మారింది. 

తాము చెప్పిన వాస్తవాలను నమోదు చేయకపోవడాన్ని చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో వారిద్దరూ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద తాము ఏ వాంగ్మూలాలైతే ఇచ్చామని సీఐడీ చెబుతోందో... వాటిని తాము స్వచ్ఛందంగా ఇవ్వనేలేదని వారు తమ పిటిషన్‌లో స్పష్టం చేశారు. 

దర్యాప్తు అధికారి సాక్షుల వాంగ్మూలాలను వారు చెప్పిన విషయాలను చెప్పినట్లుగా నమోదు చేయాల్సి ఉంటుందని.. అలాగే వాంగ్మూలం ఇచ్చే ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయాల్సి ఉన్నా, అలాంటిదేమీ చేయలేదని తమ పిటిషన్‌లో కోర్టుకు నివేదించారు. నిష్పాక్షిక దర్యాప్తు అన్నది రాజ్యాంగంలోని అధికరణ 21లో భాగమన్నారు. దర్యాప్తు ప్రక్రియ దుర్వినియోగం అవుతున్నప్పుడు, దర్యాప్తు నిష్పాక్షికతను పరిరక్షించేందుకు కోర్టు తనకు స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చునని నివేదించారు.  

మేం చెప్పింది వేరు.. వాంగ్మూలాల్లో ఉన్నది వేరు...
మద్యం విధానంపై అక్రమ కేసులో సిట్‌ అధికారులు గత నెల 13న హైదరాబాద్‌ వచ్చి సీఆర్‌పీసీ సెక్షన్‌ 161 కింద తమ వాంగ్మూలాలను నమోదు చేశారని పిటిషన్‌లో తెలిపారు. ల్యాప్‌టాప్‌లో తమ వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు ఈ ప్రక్రియను ఆడియో, వీడియోగ్రఫీ చేయలేదని పేర్కొన్నారు. దర్యాప్తునకు సహకరిస్తామని, తెలిసిన విషయాలన్నీ చెబుతామని ఆ అధికారులకు చెప్పామన్నారు. 

ఆ తరువాత తమకు తెలిసిన విషయాలు వారికి చెప్పామన్నారు. రెండు గంటల పాటు వాంగ్మూలాలను నమోదు చేసిన అధికారులు, వాటిని ఓసారి చదువుకోవాలని ల్యాప్‌టాప్‌ తమకు ఇచ్చారని, అందులో ఉన్న వివరాలన్నీ సరైనవేన్నారు. ఇదిలా ఉంటే, గత నెల 16న సోషల్‌ మీడియాలో తాము ఇచ్చిన వాంగ్మూలాలు అంటూ ఓ రిపోర్ట్‌ విస్తృతంగా సర్కూలేట్‌ అయిందని తెలిపారు. 

ఆ తరువాత సిట్‌ అధికారులు నమోదు చేసిన వాంగ్మూలం కాపీని తీసుకుని పరిశీలించామని, విçస్మయకరంగా తాము చెప్పిన దానికి భిన్నమైన విషయాలో ఆ వాంగ్మూలాల్లో ఉన్నాయని శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్‌రెడ్డి తమ పిటిషన్‌లో వెల్లడించారు. ఇవి తాము స్వచ్ఛందంగా ఇచ్చిన వాంగ్మూలాలు కానే కావని స్పష్టం చేశారు. 

విచారణ అర్హత ఉంది.. సుప్రీం తీర్పులున్నాయి.. 
శరత్‌ చంద్రారెడ్డి, రోహిత్‌ దాఖలు చేసిన వ్యాజ్యాలపై న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయి ప్రతాప గురువారం విచారణ జరిపారు. వ్యాజ్యం విచారణకు రాగానే పిటిషనర్ల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది మయాంక్‌ జైన్‌ ఈ కేసు గురించి వివరిస్తుండగా.. సీఐడీ, సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, పోసాని వెంకటేశ్వర్లు జోక్యం చేసుకుంటూ పూర్తి వివరాలను సమర్పించేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. 

ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని, దీనిపైనే మొదట వాదనలు వినిపిస్తామన్నారు. దీనిపై మయాంక్‌ జైన్‌ ప్రతిస్పందిస్తూ.. విచారణ అర్హత ఉందని, దీనికి సంబంధించి సుప్రీం కోర్టు తీర్పులు కూడా ఉన్నాయని నివేదించారు. ఇరుపక్షాల వాదనలను విన్న అనంతరం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 27కి వాయిదా వేశారు. పూర్తి వివరాలను తమ ముందుంచాలని సీఐడీ, సిట్‌ని ఆదేశించారు. 

నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ 
మద్యం విధానంపై అక్రమ కేసులో సాక్షులుగా మారాలని దర్యాప్తు సంస్థ ‘సిట్‌’ ద్వారా తీవ్ర ఒత్తిళ్లు తెస్తూ.. అందుకు ఒప్పుకోకపోతే వారి కుటుంబ సభ్యులనూ టీడీపీ పెద్దలు వేధించారు. సిట్‌ ద్వారా ఓ కట్టుకథ అల్లేసి.. సోదాల పేరుతో ఏమార్చే కుట్రలకు దిగారు. వాస్తవాలు, ఆధారాలతో నిమిత్తం లేకుండా.. కోర్టులపై గౌరవం లేకుండా లెక్కలేనితనంతో వ్యవహరించారు. కేసు విచారణ పేరుతో తమకు నచ్చినట్లుగా నివేదికలు సిద్ధం చేసుకుంటూ టీడీపీ పెద్దల కుట్రలకు తలొగ్గారు! 

అసలు తాను చెప్పని అంశాలను వాంగ్మూలం పేరుతో రిమాండ్‌ రిపోర్టులో పొందుపరిచారంటూ ఈ అక్రమ కేసులో నిందితుడిగా ఉన్న రాజ్‌ కేసిరెడ్డి గతంలోనే న్యాయస్థానానికే మొరపెట్టుకోగా.. ప్రపంచంలో ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలా వ్యవహరించిన దాఖలాలు లేవని న్యాయ నిపుణులు వ్యాఖ్యానించారు.  ఈ నేపథ్యంలో సిట్‌ ఏర్పాటైన నాటి నుంచి టీడీపీ పెద్దల కనుసన్నల్లో పచ్చ కుట్రలు, కట్టు కథలు ఎలా అల్లారో ఒకసారి పరిశీలిద్దాం..

దర్యాప్తు పేరిట వేధింపులు, బెదిరింపులు
వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, అనూషలపై ఒత్తిడి
మద్యం విధానంపై అక్రమ కేసు దర్యాప్తులో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి, పూర్వ ఉద్యోగి సత్య ప్రసాద్‌లను బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే సిట్‌ ఆధారంగా చేసుకుంది. అబద్ధపు వాంగ్మూలం నమోదుకు నిరాకరిస్తూ, సిట్‌ బెదిరింపులకు వ్యతిరేకంగా వాసుదేవరెడ్డి మూడుసార్లు హైకోర్టును ఆశ్రయించారు. 

అయినా సరే ప్రభుత్వం ఆయన్ను వెంటాడి వేధించింది. డిప్యుటేషన్‌ ముగిసినా కేంద్ర సర్వీసులకు వెళ్లనివ్వకుండా, రిలీవ్‌ చేయకుండా అడ్డుకుంది. మూడు రోజులపాటు గుర్తు తెలియని ప్రదేశంలో నిర్బంధించి వేధించింది. ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేసింది. చివరికి సిట్‌ చెప్పినట్టుగా ఆయన అబద్ధపు వాంగ్మూలం ఇవ్వడంతో ఆ వెంటనే రిలీవ్‌ చేసి కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. 

అదే రీతిలో బెవరేజస్‌ కార్పొరేషన్‌ పూర్వ ఉద్యోగులు సత్య ప్రసాద్, అనూషలను వేధించి అబద్ధపు వాంగ్మూలాలు నమోదు చేయించింది. సత్యప్రసాద్‌ ఎన్నో ఏళ్లుగా మానసిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టు తాజాగా వైద్య నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి వ్యక్తితో ఇప్పించిన వాంగ్మూలం ఆధారంగా సిట్‌ అక్రమ కేసును దర్యాప్తు చేస్తుండటం విస్మయపరుస్తోంది. 

రాజ్‌ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే కుతంత్రం..!
అసలు ఈ కుట్ర కేసుకు కేంద్ర బిందువుగా రాజ్‌ కేసిరెడ్డిని ఎంపిక చేసుకోవడంలోనే చంద్రబాబు ప్రభుత్వ కుతంత్రం దాగుంది. అసలు విషయం ఏమిటంటే..  రాజ్‌ కేసిరెడ్డి టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) వ్యాపార భాగస్వామి కావడం గమనార్హం. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన సన్నిహితుడు కూడా. వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉండగానే.. అంటే 2021లోనే రాజ్‌ కేసిరెడ్డి.. కేశినేని చిన్ని భాగస్వామిగా వ్యాపారాలు నిర్వహించారు. రాజ్‌ కేసిరెడ్డికి చెందిన ‘డే ఇన్‌ఫ్రాకాన్‌ ఎల్‌ఎల్‌పీ’లో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులుగా ఉన్నారు. 

అక్రమంగా నిధులు తరలించారని సిట్‌ అధికారులు చెబుతున్న ఇషన్వీ ఇన్‌ఫ్రా ప్రాజెక్టŠస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రైడే ఇన్‌ఫ్రా ఎల్‌ఎల్‌పీ హైదరాబాద్‌లోని ఒకే చిరునామాతో (జూబ్లీ హిల్స్, సర్వే నంబర్‌ 403, ప్లాట్‌ నంబర్‌ 9)తో రిజిస్టర్‌ అయ్యాయి. అంతే కాదు ఆ రెండు కంపెనీలు ఒకే మెయిల్‌ ఐడీ (accounts@wshanviinfraprojects. com)నే ఉపయోగిస్తుండటం గమనార్హం. కేశినేని చిన్ని ఏకంగా 12 రియల్‌ ఎస్టేట్, విదేశీ కంపెనీల ద్వారా భారీగా నల్లధనాన్ని అమెరికా, దుబాయ్‌లకు తరలించి భారీ పెట్టుబడులు పెట్టారు. 

రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన కేశినేని చిన్ని మంత్రి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడే కాదు బినామీ కూడా అన్నది బహిరంగ రహస్యమే! అందుకే పట్టుబట్టి మరీ ఆయనకు విజయవాడ ఎంపీ టికెట్‌ ఇప్పించారు. కేశినేని చిన్ని బినామీ కంపెనీ ఉర్సా ఐటీ సొల్యూషన్స్‌కు విశాఖలో అత్యంత విలువైన 60 ఎకరాలను కారుచౌకగా కట్టబెట్టే కుట్రలకు తెర తీయడం తెలిసిందే. మరి రాజ్‌ కేసిరెడ్డి వ్యాపార భాగస్వామి అయిన ఎంపీ కేశినేని చిన్నిపై సిట్‌ ఎందుకు కేసు నమోదు చేయడం లేదన్నది కీలకం. దీంతో ఇదంతా చంద్రబాబు రెడ్‌బుక్‌ కుతంత్రమేనన్నది తేటతెల్లమవుతోంది. 

డిస్టిలరీల ప్రతినిధులకు వేధింపులు..
అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని టీడీపీ పెద్దలు డిస్టిలరీల ప్రతినిధులను వేధించారు. వృద్ధులని కూడా చూడకుండా విచారణ పేరుతో హైదరాబాద్‌ నుంచి విజయవాడ తీసుకువచ్చి వేధించడంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాంతో వారిని హైదరాబాద్‌లోని వారి నివాసంలోనే విచారించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేని రాజ్‌ కేసిరెడ్డి  తండ్రిని బలవంతంగా తీసుకువచ్చి విచారణ పేరుతో వేధించారు. మరో నిందితుడి తండ్రి, రిటైర్డ్‌ కానిస్టేబుల్‌ను అక్రమంగా నిర్బంధించి మరీ వేధించడంతో ఆ కుటుంబం హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. 

రూ.11 కోట్ల జప్తు డ్రామా
రాజ్‌ కేసిరెడ్డి కుటుంబానికి చెందిన ఇంజినీరింగ్‌ కాలేజీలో రూ.11 కోట్లు స్వా«దీనం చేసుకున్నామని సిట్‌ మరో కట్టుకథ అల్లింది. అయితే ఆ నగదు తనది కాదని ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో సిట్‌ కుట్రకథ అడ్డం తిరిగింది. ఆ నోట్ల కట్టలపై ఉన్న బ్యాచ్‌ నంబర్ల ఆధారంగా ఎప్పుడు? ఏ బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేశారు? ఆర్బీఐ ద్వారా దీనిపై విచారించాలని ఆయన న్యాయస్థానాన్ని కోరడంతో సిట్‌ తోకముడిచింది.  

వెంకటేష్‌ నాయుడుకు ప్రలోభాలు
అబద్ధపు వాంగ్మూలం ఇస్తే  నామినేటెడ్‌ పదవి ఇవ్వడంతోపాటు రూ.2 కోట్లు ఇస్తామని టీడీపీ పెద్దలు రియల్టర్‌ వెంకటేశ్‌ నాయుడు దంపతులను ప్రలోభ పెట్టారు. అందుకు వారు తిరస్కరించడంతోనే వెంకటేశ్‌నాయుడును అరెస్టు చేశారు. ఆయన నోట్ల కట్టలను లెక్కిస్తున్నట్లుగా ఓ వీడియోను సెల్‌ఫోన్‌ నుంచి రిట్రీవ్‌ చేశామంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారంలోకి తెచ్చింది. ఎన్నికల ఖర్చు కోసం ఆ డబ్బు వినియోగించారని దుష్ప్రచారానికి తెర తీశారు. 

వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి వద్ద గతంలో గన్‌మెన్‌గా పని చేసిన గిరి, మదన్‌రెడ్డిలను అక్రమంగా నిర్బంధించి అబద్ధపు వాంగ్మూలం కోసం తీవ్రస్థాయిలో వేధించారు. బెంబేలెత్తిన గిరి.. సిట్‌ అధికారులు చెప్పినట్టు అబద్ధపు వాంగ్మూలం ఇచ్చారు. ఆ వెంటనే ఆయనకు ప్రమోషన్‌ కల్పించి మరీ జీతం పెంచారు. అందుకు సమ్మతించని మదన్‌రెడ్డిపై సిట్‌ అధికారులు థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. 

మిథున్‌రెడ్డిపై నిరాధార అభియోగాలు..
మద్యం విధానంతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్సార్‌సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి ప్రజలను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ పెద్దలు యత్నించారు. గత ప్రభుత్వంలో మిథున్‌రెడ్డి ఎంపీగా మాత్రమే ఉండగా.. ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కనీసం ఆ శాఖ మంత్రిగా కూడా లేకపోవడం గమనార్హం. ఎంపీ మిథున్‌రెడ్డిపై నమోదు చేసిన అభియోగాలు అవాస్తవమని స్పష్టమైంది. 

ఆయన కంపెనీలోకి అక్రమంగా నిధులు వచ్చాయన్న సిట్‌ అభియోగాలు న్యాయస్థానంలో తేలిపోయాయి. మిథున్‌రెడ్డి తమ బ్యాంకు స్టేట్‌మెంట్లు, ఇతర ఆధారాలు న్యాయస్థానానికి సమర్పించారు. ఆయనపై నమోదు చేసిన అభియోగాల్లో సిట్‌ కనీస ఆధారాలు కూడా చూపలేకపోయిందని, ఒక్క దానికీ ఆధారం లేదని  న్యాయస్థానం స్పష్టం చేసింది. దీంతో మిథున్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు చేసింది. 

తప్పుల తడకగా చార్జ్‌షీట్‌లు 
న్యాయస్థానం సాక్షిగా సిట్‌ అక్రమ అరెస్టుల కుట్రలు బెడిసికొట్టాయి. సిట్‌ దాఖలు చేసిన మొదటి చార్జ్‌షీట్, అనుబంధ చార్జ్‌షీట్లను పరిశీలించిన న్యాయస్థానమే వాటి చట్టబద్ధతను ప్రశ్నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. న్యాయస్థానం వ్యక్తం చేసిన 21 అభ్యంతరాలపై సిట్‌ కనీసం సమాధానం చెప్పలేకపోయింది. దాంతో ఈ కేసులో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ధనుంజయ్‌రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి, వికాట్‌ కంపెనీ డైరెక్టర్‌ బాలాజీ గోవిందప్పలకు న్యాయస్థానం డిఫాల్ట్‌ బెయిల్‌ మంజూరు చేసింది.  

కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాలతో హడావుడి 
భేతాళ కుట్రలు బెడిసికొట్టిన ప్రతిసారి సోదాల పేరుతో హడావుడి చేస్తూ ఏదో ఒక పేరును తెరపైకి తెచ్చి సిట్‌ ఏమారుస్తోంది. తనిఖీల పేరుతో తప్పుడు సాక్ష్యాలు సృష్టించేందుకు యత్నిస్తోంది. టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఓ డాక్యుమెంట్‌ను వదలడం.. అందుకు ఎల్లో మీడియా తాన తందానా అంటూ బ్రేకింగ్‌ న్యూస్‌గా ప్రచారం చేస్తోంది. అక్రమ కేసును నిజమని భ్రమింప చేసే ఎత్తుగడలకు తెర తీస్తోంది. 

ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలతో ఏమాత్రం సంబంధం లేని వైఎస్‌ అనిల్‌రెడ్డి కార్యాలయాల్లో సోదాల పేరుతో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు సిట్‌ యత్నించింది. ఇక ఆయన కంపెనీల్లో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సతీమణి భారతి డైరెక్టర్‌గా వ్యవహరించారని ఎల్లో మీడియా దు్రష్పచారం చేసింది. వాస్తవానికి వైఎస్‌ అనిల్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్‌ భారతి ఆ కంపెనీల్లో గతంలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. 

హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది, వ్యాపారి నర్రెడ్డి సునీల్‌ రెడ్డి నివాసాల్లోనూ తనిఖీల పేరిట సిట్‌ రాద్ధాంతం చేసింది. ఆ సమయంలో ఓ ప్రైవేటు వాహనంలో కొన్ని సందేహాస్పద పత్రాలను ఆయన నివాసంలో చేరవేసేందుకు సిట్‌ యత్నించడం గమనార్హం. ఆ వాహనంలో ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్‌ కార్యాలయంలో పని చేసే ఉద్యోగి ఉండటంతో అసలు కుట్ర బట్టబయలైంది.  

రిమాండ్‌ రిపోర్టుపై సంతకం చేయని రాజ్‌ కేసిరెడ్డి 
లేని కుంభకోణం ఉన్నట్టుగా భ్రమింపజేసేందుకు సిట్‌ అక్రమ అరెస్టులకు తెగబడింది. అప్రూవర్‌గా మారి తాము చెప్పినట్టు వాంగ్మూలం ఇవ్వాలని టీడీపీ పెద్దలు రాజ్‌ కేసిరెడ్డిని వేధించారు. అందుకు ఆయన తిరస్కరించడంతోనే అరెస్టు చేశారు. అసలు రాజ్‌ కేసిరెడ్డి చెప్పని విషయాలు చెప్పినట్టుగా సిట్‌ అధికారులే అబద్ధపు వాంగ్మూలం నమోదు చేయడం ఈ కుట్రకు పరాకాష్ట. 

ఆ వాంగ్మూల పత్రంపై సంతకం చేసేందుకు రాజ్‌ కసిరెడ్డి నిరాకరించారని సిట్‌ స్వయంగా తన నివేదికలో పేర్కొనడం గమనార్హం. దీంతో అసలు బండారం బయటపడింది. అక్రమ కేసులో చంద్రబాబు ప్రభుత్వం ఎంతగా బరితెగిస్తోందన్నది ఆ నివేదికే బట్టబయలు చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement