కేసీఆర్‌ నాకన్నా పెద్ద నటుడు: విజయశాంతి

Vijayashanti Takes On Telangana CM KCR - Sakshi

2023లో తెలంగాణలో బీజేపీదే అధికారం

సాక్షి, హైదరాబాద్‌ : భారతీయ జనతా పార్టీలో చేరిక అనంతరం తొలిసారి హైదరాబాద్‌ చేరుకున్న విజయశాంతికి ఘన స్వాగతం లభించింది.  ఆమె గురువారం మొదటిసారి పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ 2023లో కేసీఆర్‌ను గద్దె దించడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను  ధీటుగా నిలబడేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. (కాంగ్రెస్‌ పార్టీకి విజయశాంతి గుడ్‌బై!)

‘జీవితం ఎన్నో మలుపులు తిరుగుతుంది. నేను అప్పట్లో బీజేపీలో ఉండే తెలంగాణ కోసం పోరాడాను.  కొన్ని కారణాల వల్ల భారతీయ జనతా పార్టీకి దూరం కావాల్సి వచ్చింది. నేను 1998 జనవరి 26న బీజేపీలో చేరాను. ఆ తర్వాత తెలంగాణ కోసం నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను... పోరాడాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను ఆ రోజు బీజేపీని వీడాను. కొన్ని పార్టీలు తెలంగాణ రావడానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఆ కారణంగానే పార్టీ బయటకు నుంచి వచ్చేశాను. 

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2005 తర్వాత తల్లి తెలంగాణ పార్టీని స్థాపించి, అనేక సమస్యలపై పోరాటాలు చేశాను. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌ పుట్టుకొచ్చింది. టీఆర్‌ఎస్‌కు ఎదురు ఉండకూడదని కేసీఆర్‌ భావించారు. ఉద్యమాలు చేసినవారిని ఆయన ఇబ్బంది పెట్టారు. ఒక దశలో అయితే కేసీఆర్‌ తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేయాలని ఒత్తిడి తెచ్చారు. అందుకోసం చాలామందిని నాతో చర్చలకు పంపారు. పార్టీని విలీనం చేయాలని ఇష్టం లేకున్నా.. పరిస్థితులను బట్టి పార్టీని విలీనం చేయాల్సి వచ్చింది.  (కాంగ్రెస్‌కు కేసీఆర్‌ స్లో పాయిజన్ ఎక్కించారు)

టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత ఎంపీగా గెలిచాను. ఆ తర్వాత పార్లమెంట్‌లో రాష్ట్ర సాధన కోసం కొట్లాడాం. 2013లో నన్ను టీఆర్‌ఎస్‌ నుంచి కేసీఆర్‌ సస్పెండ్‌ చేశారు. అదంతా ప్రీ ప్లాన్డ్‌గానే చేశారు. తెలంగాణ బిల్లు పాస్‌ అయిన రోజు కూడా పార్లమెంట్‌లో లేరు. రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్‌ తన కుటుంబంతో సోనియా గాంధీ కాళ్లమీద పడ్డారు.  రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ పార్టీ ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో టార్గెట్‌ చేశారు. 

నా కన్నా గొప్ప నటుడు కేసీఆర్‌. తనకన్నా బలమైన నేతలెవరూ ఉండకూడదనేది ఆయన ఆలోచన. కేసీఆర్‌లా మాట మార్చడం నాకు రాదు. తెలంగాణ ఇస్తే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తానని మోసం చేసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది చనిపోయారు. వాళ్ల శవాల మీద కూర్చొని కేసీఆర్‌ పరిపాలిస్తున్నారు.  కేసీఆర్‌ ఎన్నడూ తెలంగాణ ప్రజలను ప్రేమించలేదు. ఆయనకు డబ్బులే ముఖ్యం. ఏం చేసుకుంటారు దొర డబ్బుని. ఎల్లకాలం అబద్ధాలతో మోసం చేయలేరు. తెలంగాణ ప్రజల్లోనూ మార్పు వస్తోంది. కేసీఆర్‌కు దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు బాగా బుద్ధి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తుంది. అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపి, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి’ అని విజయశాంతి పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top