మమ్మల్ని గెలిపించే మంత్రం: వైవీ సుబ్బారెడ్డి

TTD Chairman YV Subba Reddy Slams Chandrababu Naidu Over Manifesto - Sakshi

ప్రజలను మభ్యపెట్టేందుకే చంద్రబాబు మ్యానిఫెస్టో రిలీజ్‌ చేశాడు

షెడ్యూల్‌ ప్రకారం ఎన్నికలు జరిగితే 40 శాతం ఏకగ్రీవాలయ్యేవి

సాక్షి, తాడేపల్లి: చంద్రబాబుకు మత్రిభ్రమించిందో.. లేక ఎన్నికల కమిషనర్‌ ఇచ్చిన సలహానో తెలియదు కానీ పంచాయతీ ఎన్నికలుకు మ్యానిఫెస్టో రిలీజ్‌ చేశారు అంటూ టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే మ్యానిఫెస్టోలో చెప్పిన నవరత్నాలని అమలు చేసిన ఘనత మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది. చంద్రబాబుకు మ్యానిఫెస్టో అంటే గౌరవం లేదు. సీఎం జగన్‌ కరోనా పరిస్థితుల్లో సైతం సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు. ఏ రాష్ట్రంలో జరగని సంక్షేమ పాలనను సీఎం జగన్‌ ఏపీ ప్రజలకు అందిస్తున్నారు. పేదవాడి గడప వద్దకే సంక్షేమాన్ని చేర్చారు. మ్యానిఫెస్టో అమలు చేయడం అంటే అది. లోకల్‌ బాడీ ఎన్నికలు పార్టీల గుర్తులపై జరగవని చంద్రబాబుకు తెలియదా.. ప్రజలను మభ్యపెట్టడానికి చంద్రబాబు స్టార్ట్‌ చేసిన కొత్త డ్రామా మ్యానిఫెస్టో రిలీజ్‌ చేయడం’’ అంటూ దుయ్యబట్టారు.
(చదవండి: కొంప కొల్లేరు.. టీడీపీ బెంబేలు..)

ఏకగ్రీవాలు అయితే అభివృద్ధికి నోచుకుంటాయి
‘‘చంద్రబాబు 2014 ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో ఇచ్చిన 600 హామీలలో ఆరు కూడా అమలు చేయలేదు. ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచేందుకు తయారుగా ఉన్నారు. రాష్ట్రంలో అత్యధిక గ్రామాల్లో ఏకగ్రీవం అయ్యే పరిస్థితులు ఉన్నాయి. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే 40 శాతం ఏకగ్రీవాలయ్యేవి. ప్రజల,ఉద్యోగుల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై  ఉంది కాబట్టే ఎన్నికల వాయిదా కోరాం. చంద్రబాబు లాగా ఎన్నికలకు భయపడి మేము వాయిదా కోరలేదు. చంద్రబాబు బై ఎలక్షన్‌లో చేసిన రౌడీయిజాన్ని ప్రజలు చూశారు. అదే రీతిలో మేము చేస్తామని చంద్రబాబు ఊహించుకుంటున్నారు. మేము గ్రామాల్లో ఏకగ్రీవాలు అవుతాయని ఆశిస్తున్నాము. అలా జరిగితే గ్రామల్లో సమస్యలు లేకుండా ఉంటాయి.. అభివృద్ధికి నోచుకుంటాయి. అందుకే ఏకగ్రీవాల కోసం మా పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు. దాంట్లో తప్పేముంది. గతంలో సైతం ఏకగ్రీవాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. ఎవరు గ్రామాల్లో అభివృద్ధి  చేస్తారో అంటువంటి నాయకులను చూసి ప్రజలు ఓటు వేస్తారు. చంద్రబాబు ఎన్ని దొంగ మ్యానిఫెస్టోలో రీలీజ్ చేసినా ప్రజలు నమ్మరు’’ అని పేర్కొన్నారు.
(చదవండి: ఏకగ్రీవాలకు నజరానాలు ఆనవాయితీనే)

విగ్రహాల ధ్వంసంలో టీడీపీ కుట్ర బట్టబయలైంది
‘‘రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు ప్రతిపక్ష పాత్ర పోషించకుండా రాజకీయ లబ్ధి కోసం దేవుడిని కూడా వాడుకుంటున్నారు. మా ప్రభుత్వం వచ్చాక దేవాలయలపై దాడులను ప్రోత్సాహించలేదు. విగ్రహాల ధ్వంసం విషయంలో కఠిన చర్యలు తీసుకున్నాము. ఈ విషయంలో టీడీపీ రాజకీయ కుట్ర బట్టబయలైంది. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకోవడంలో చంద్రబాబు దిట్టని మరోసారి రుజువైంది. కులాలకు, పార్టీలకు అతీతంగా మేము చేస్తున్న సంక్షేమ పథకాలే మా పార్టీకి అండగా నిలుస్తాయి. అవే మా నాయకులను గ్రామాల్లో  గెలిపిస్తాయి. వేరే మంత్రం అంటూ ఏదీ లేదు’’ అని సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top