టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి కోదండరెడ్డి రాజీనామా  | Sakshi
Sakshi News home page

టీపీసీసీ క్రమశిక్షణా సంఘానికి కోదండరెడ్డి రాజీనామా 

Published Mon, Aug 30 2021 4:37 AM

TS: Kodanda Reddy Resigns From TPCC Disciplinary Committee Chief Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీపీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్‌ పదవికి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ఎం. కోదండరెడ్డి ఆదివారం రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి మెయిల్‌ ద్వారా పంపారు. రాజీనామా ప్రతులను ఎంపీ రాహుల్‌గాంధీ, ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డిలకు పంపారు. తనకు ఇన్నేళ్లు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తన టీంను ఏర్పాటు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించాలన్న ఉద్దేశంతోనే రాజీనామా చేస్తున్నానని తెలిపారు.

తన రాజీనామా విషయమై కోదండరెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ కొత్త పీసీసీ అధ్యక్షుడి నియామకం తర్వాత గతంలో ఉన్న కమిటీలకు రాజీనామాలు చేయడం కాంగ్రెస్‌ పార్టీ సంప్రదాయమని చెప్పారు. కొన్ని పిటిషన్లు తన వద్ద పెండింగ్‌లో ఉన్నందున అప్పుడు రాజీనామా చేయలేదని, ఇప్పుడు అన్ని పిటిషన్ల విచారణ పూర్తి అయిందని చెప్పారు. రాజీనామాకు ప్రత్యేక కారణాలు ఏమీ లేవని ఆయన స్పష్టం చేశారు. 

 
Advertisement
 
Advertisement