Gutta Sukender Reddy: వాహనం లేదు.. గుంట భూమీ లేదు.. కానీ భార్య పేరిట కోట్ల రూపాయలు

TRS MLC Candidate Gutta sukender Reddy Assets Details - Sakshi

సాక్షి, నల్లగొండ: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన గుత్తా సుఖేందర్‌రెడ్డి పేరిట వాహనాలు ఏమీ లేవు. గుంట భూమి కూడా లేదు. బంగారు ఆభరణాలు లేవు. స్థిర, చరాస్తులన్నీ కుటుంబ సభ్యుల పేరునే ఉన్నాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా మంగళవారం నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా ఆయన ఇచ్చిన అఫిడవిట్‌లో తన, తన కుటుంబ సభ్యుల పేరున ఉన్న ఆస్తుల వివరాలను వెల్లడించారు. గోపాలపురం పోలీసు స్టేషన్‌లో కేసు ఉన్నట్లు తెలిపారు. అలాగే కోర్టుల్లోనూ కేసులు ఉన్నట్లు వివరించారు. తన చేతిలో రూ. 1.5 లక్షలు, తన భార్య వద్ద రూ. 1.08 లక్షలు, అవిభక్త కుటుంబం వద్ద రూ.2,97,026 నగదు ఉన్నట్లు పేర్కొన్నారు.

తన పేరిట రూ. 83 లక్షలకు పైగా వివిధ బ్యాంకుల్లో డిపాజిట్లు ఉండగా, భార్య అరుంధతి పేరిట రూ.1.01 కోట్లు, అవిభక్త కుటుంబం పేరుతో రూ.1.72 కోట్లకుపైగా డిపాజిట్లు బ్యాంకుల్లో ఉన్నట్లు వెల్లడించారు. వైడ్‌ బిజినెస్‌ సొల్యూషన్స్‌ పేరుతో రూ.6.4 లక్షలు, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో కొత్త పేటలో మహాలక్ష్మి థియేటర్‌ (ప్రస్తుత విలువ రూ.2.5 కోట్లు), అమిత్‌ఎంటర్‌ ప్రైజెస్‌(రూ.70 లక్షలు) ఉన్నట్లు పేర్కొన్నారు. తన పేరున గానీ, తన భార్య పేరున గానీ ఎలాంటి వాహనాలూ లేవని తెలిపారు. తనకు ఆభరణాలు లేవని తెలిపారు.

 భార్య పేరిట రూ. 50 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, 2.5 లక్షల విలువైన 4 కిలోల వెండి, హిందూ అవిభక్త కుటుంబం పేరిట రూ.8.75 లక్షల విలువైన 175 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు సుఖేందర్‌రెడ్డి వివరించారు. భార్య పేరిట చిట్యాల, కేశంపల్లిలో 7.48 ఎకరాల వ్యవసాయ భూమి, ఫిలీంనగర్‌లో 2389.5 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ కలుపుకొని వాణిజ్య భవనం, చిట్యాలలో 3888 చదరపు అడుగుల వాణిజ్య భవనం ఉన్నట్లు పేర్కొన్నారు. పుప్పాలగూడలో 473 చదరపు అడుగుల నివాస భవనం, చిట్యాలలో 3,600 చదరపు అడుగుల నివాస భవనం ఉన్నట్లు పేర్కొన్నారు.

మొత్తంగా వాటి విలువ రూ.5,89,13,480గా పేర్కొన్నారు. ఆయనకు చెందిన హిందూ అవిభక్త కుటుంబం పేరుతో ఊరుమడ్ల, దేవరకొండలో 39.72 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు వెల్లడించారు. ఊరుమడ్ల గ్రామకంఠంలో నాలుగు గుంటలు, మామిళ్లగూడ, నందిపహడ్‌లో 1012 చదరపు గజాల వ్యవసాయేతర భూములు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తన పేరిట రూ.36,57,500, భార్య పేరిట రూ.1,20,04,000, హిందూ అవిభక్త కుటుంబం పేరుతో రూ.1,32,07,566 లోన్లు తీసుకున్నట్లు తెలిపారు.

·    భార్య పేరిటనే స్థిరాస్తులు
·    ఎమ్మెల్సీ నామినేషన్‌ అఫిడవిట్‌లో పేర్కొన్న సుఖేందర్‌రెడ్డి 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top