దయాకర్‌కు నోటీసులు.. మదన్‌మోహన్‌కు హెచ్చరిక

TPCC Disciplinary Committee Warns Madan Mohan Rao, Addanki Dayakar - Sakshi

టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయాలు

సాక్షి, హైదరాబాద్‌: గత ఎన్నికల్లో తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన అద్దంకి దయాకర్‌కు షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి పార్టీ నేతలు ఉత్తమ్, కోమటిరెడ్డి, దామోదర్‌రెడ్డిపై ఆరోపణలు చేయడం క్రమశిక్షణ ఉల్లంఘనగా భావించి ఈ నోటీసుల్విలని టీపీసీసీ క్రమశిక్షణ సంఘం నిర్ణయించింది. ఆదివారం గాంధీభవన్‌లో సంఘం చైర్మన్‌ జి.చిన్నారెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం లో సంఘం సభ్యులు కమలాకర్‌రావు, మాజీ మంత్రి వినోద్, గంగారాంలు పాల్గొన్నారు. 

జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా పోటీచేసిన కె.మదన్‌మోహన్‌రావును పార్టీ లైన్‌ దాట వద్దని క్రమశిక్షణ సంఘం హెచ్చరించింది. ఆయన పార్టీ పేరుతో కాకుండా మదన్‌ యూత్‌ ఫోర్స్‌ పేరుతో కార్యక్రమాలు చేయడం, పార్టీ నాయకత్వానికి సమాచారం లేకుండానే ఎల్లారెడ్డిలో ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేయడం వంటివి ప్రస్తావిస్తూ.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటూ క్రమశిక్షణ సంఘం ఆయనకు లేఖ పంపనుంది. కాగా, మదన్‌మోహన్‌ను సస్పెండ్‌ చేసిన కామారెడ్డి డీసీసీ అధ్యక్షుడు శ్రీనివాస్‌కు ఆ అధికారం లేదని అభిప్రాయపడ్డ కమిటీ, డీసీసీ అధ్యక్షులకు వచ్చే ఫిర్యాదులను రాష్ట్ర కమిటీకి తెలియ జేయాలని, అలా నేరుగా సస్పెండ్‌ చేయవద్దంటూ ఆయనకు కూడా లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: బీజేపీకి తీన్మార్‌ మల్లన్న గుడ్‌బై?)

ఇక, దుబ్బాక నియో జకవర్గానికి చెందిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పార్టీకి సంబంధించిన వారిపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టి వేధిస్తున్నారన్న అంశంపై సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కమిటీ సూచించింది. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి తన పరిధి దాటి వరంగల్‌లో రాజకీయం చేస్తున్నారని.. వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన క్రమశిక్షణ సంఘం, రాఘవరెడ్డి పాలకుర్తికే పరిమితం కావాలని సూచిస్తూ ఆయనకు లేఖ రాయాలని నిర్ణయించింది. (చదవండి: అన్నీ కొరతలే.. అద్భుతం: కేటీఆర్‌ ట్వీట్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top