సీఎంని స్టాలిన్‌ చెప్పుతో పోల్చిన నాయకుడు

TN Assembly Polls 2021 A Raja Compared CM Palaniswami With Stalin Slipper - Sakshi

పళనిస్వామి స్టాలిన్‌ ధరించే చెప్పు పాటి విలువ చేయరు: రాజా

చెన్నై: మరో రెండు వారాల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నాయి. తాజాగా, ముఖ్యమంత్రి పళనిస్వామిపై కేంద్ర మాజీ మంత్రి, డీఎంకే నేత రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం పళనిస్వామి.. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కాలికి వేసుకున్న చెప్పు పాటి విలువ కూడా చేయరు’ అంటూ రాజా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.

‘ఒకప్పుడు బెల్లం మార్కెట్‌‌లో కూలీగా పనిచేసి పళనిస్వామికి స్టాలిన్‌తో పోటీయా.. పళని కంటే స్టాలిన్ వేసుకునే చెప్పుకు విలువ ఎక్కువ.. అలాంటిది తనకు స్టాలిన్‌నే సవాల్ చేసే ధైర్యం ఉందా. నెహ్రూ, ఇందిరా గాంధీ, మోదీ సైతం చేయలేని సాహసం పళనిస్వామి చేస్తున్నాడంటే అందుకు కారణం డబ్బు. రాష్ట్రాన్ని లూటీ చేసిన తనను పార్టీని రక్షిస్తుందని భావిస్తున్నాడు. అటువంటి వ్యక్తి స్టాలిన్‌ను అడ్డుకుంటాను అంటున్నాడు. అదే జరిగితే సీఎం వాహనం తన నివాసం నుంచి కార్యాలయానికి వెళ్లదని నేను సవినయంగా మనవిజేస్తున్నాను’ అన్నాడు రాజా.

డీఎంకే నేత రాజా చేసిన వ్యాఖ్యలను తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నారు పళనిస్వామి. తాను ఒక రైతునని, పేద కుటుంబం నుంచి వచ్చానని, అందువల్ల వినయంగా ఉంటానంటూ ప్రజల్లో తన మీద సానుభూతి పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే క్రమంలో 2జీ స్పెక్ట్రం కుంభకోణాన్ని ప్రస్తావించిన సీఎం.. కంటికి కనిపించని గాలితో కూడా కుంభకోణాలు చేసిన ఏకైక పార్టీ డీఎంకే అని ధ్వజమెత్తారు.

ఈ క్రమంలో మదురై జిల్లా మెలూర్‌లోని ఎన్నికల ప్రచారంలో పళనిస్వామి  మాట్లాడుతూ..‘నేను కష్టపడి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాను. కానీ స్టాలిన్ తండ్రి సీఎంగా ఉన్నందున ఆయన సిల్వర్ స్పూన్‌తో పుట్టారు. రాజా మాట్లాడిన భాష ఎలా ఉందో చూడండి.. నా విలువ స్టాలిన్ ధరించే చెప్పు కన్నా తక్కువని..  పొగరుగా మాట్లాడుతున్నారు. ఒక ముఖ్యమంత్రిని చెప్పుతో పోల్చి వారు ఎంతటి సంస్కారహీనులో నిరూపించుకున్నారు. నేను ఒక రైతును, మా పేదలు అలానే ఉంటారు.. మేము కష్టపడి పనిచేస్తాం.. మేం కొనుక్కోగలిగింది మాత్రమే కొనుగోలు చేస్తాం... కానీ వారు రూ. 1.76 లక్షల కోట్ల అవినీతి కుంభకోణం వెనుక ఉన్నారు. కాబట్టి కోరుకున్నది కొనుక్కుంటారు’ అంటూ పళనిస్వామి రాజాకు కౌంటర్ ఇచ్చారు.

చదవండి: కింది స్థాయి నుంచి వచ్చా..: సీఎం
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top