దీదీకి షాక్‌.. మరో ఎమ్మెల్యే రాజీనామా

TMC Sports Minister Stepped Down From His Post - Sakshi

పదవికి రాజీనామా చేసిన స్పోర్ట్స్‌ మినిస్టర్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్‌ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే‌, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి లక్ష్మి రతన్‌ శుక్లా తన పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ​ నేతలు ఒక్కొక్కరు టీఎంసీ వీడుతూ దీదీకి షాక్‌ ఇస్తున్నారు. ఈ క్రమంలో రతన్‌ శుక్లా తన రాజీనామా లెటర్‌ ఒక కాపీని ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి, మరో దాన్ని గవర్నర్‌ జగదీప్‌ ధంకర్‌కు అందజేశారు. గతంలో బెంగాల్‌ రంజీ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన రతన్‌ శుక్లా హౌరా(ఉత్తర) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రతన్‌ శుక్లా రాజీనామాపై స్పందిస్తూ.. ‘పార్టీకి, నాకు మధ్య ఎలాంటి విబేధాలు లేవు. రాజకీయాల నుంచి రిటైర్‌ అవుదామనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అన్నారు. (చదవండి: మమతకు వరుస షాక్‌లు.. స్పీకర్‌ ట్విస్టు!)

ఇక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బెంగాల్‌లో పాగా వేసేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. మమతకు కంటికి మీద కునుకు లేకుండా చేస్తోంది. సువేంధు అధికారి పార్టీ నుంచి బయటకు వచ్చిన నాటి నుంచి టీఎంసీలో చీలికలు మొదలయ్యాయి. ఇక కేంద్ర హోం మినిస్టర్‌ అమిత్‌ షా ఎన్నికల నాటికి టీఎంసీలో దీదీ మాత్రమే మిగులుతుందని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెబెల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు సువేందు అధికారి తమ్ముడు కూడా బీజేపీలో చేరారు. సౌమేందు అధికారి తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని మునిసిపాలిటీకి కౌన్సిలర్, చైర్‌పర్సన్‌గా ఉన్నారు. గత వారం ఆయనతో కలిసి మరో డజను మంది ఇతర పార్టీ కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. అయితే అధికారి కుటుంబానికి చెందిన మరో ఇద్దరు సభ్యులు సువేందు అధికారి తండ్రి సిసిర్, సోదరుడు దిబ్యేండుల్‌లు మాత్రం టీఎంసీలో కొనసాగుతున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top