సాక్షి, తాడేపల్లి: రాష్ట్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తుందా?. అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గుతుందా?. ఎన్నికల సంఘం నిర్ణయాలే దాని విశ్వసనీయతపై అనుమానాలు కలిగిస్తున్నాయి’’ అంటూ వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు వ్యాఖ్యానించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు హయాంలో సీఎస్గా పనిచేసిన అనిల్ చంద్ర పునేఠా ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా ఉన్నారు. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధంగా పనిచేయాలి.. ఎవరి ఆదేశాలకో తలొగ్గకూడదు’’ అని టీజేఆర్ పేర్కొన్నారు.
‘‘అక్టోబర్ 16న కొత్త ఓటర్ల జాబితా వస్తుందని తెలిసినా 14నే ఎన్నికల షెడ్యూల్ ఎందుకు ప్రకటించారు?. కేవలం 30 గంటలు ఆగలేనంత తొందర ఎన్నికల సంఘానికి ఎందుకు వచ్చింది?. కొత్త ఓటర్ల జాబితా కోసం వేచి ఉండకుండా ఎన్నికలకు వెళ్లడంలో ఆంతర్యమేంటి?. కొత్తగా చేరే 11 నుంచి 13 లక్షల మంది ఓటర్ల హక్కులపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. చనిపోయినవారు, డూప్లికేట్ ఓటర్లు, వలస వెళ్లినవారి వివరాలు సరిచూసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి.
..అక్టోబర్ 30 వరకు ఓటర్ల జాబితా ప్రక్రియ గడువు పొడిగించిన విషయం రాష్ట్ర ఎన్నికల సంఘానికి తెలియదా?. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య సమాచార లోపం ఉందా?. ఉదయం ప్రకటించాల్సిన షెడ్యూల్ను మధ్యాహ్నం 3.30 గంటలకు మార్చాల్సిన అవసరమేంటి?. మొదట ప్రకటించిన స్థానాల్లో మంగళగిరి, తాడేపల్లిని తర్వాత ఎందుకు తొలగించారు?. లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని స్థానాలకే మినహాయింపు ఎందుకు?. ఎన్నికల సంఘాన్ని నడిపిస్తున్నదెవరు? ముఖ్యమంత్రా, ఉప ముఖ్యమంత్రా, షాడో ముఖ్యమంత్రా?
..పులివెందుల, ఒంటిమిట్ట ఎన్నికల్లో జరిగిన ఘటనలపై ఎన్నికల సంఘం ఏ చర్యలు తీసుకుంది?. నామినేషన్లు ఉపసంహరించుకోవాలని మా అభ్యర్థులను బెదిరించిన ఘటనలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్ర పోలీసు వ్యవస్థపై మాకు నమ్మకం లేదు.. కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలి. ఎన్నికల ప్రక్రియ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో జరగాలని కోరాం. ఎన్నికల నిర్వహణ అధికార పార్టీ చేతుల్లో కాకుండా ఎన్నికల సంఘం నియంత్రణలో ఉండాలి. వైఎస్సార్సీపీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు
‘‘కుల ధ్రువీకరణ పత్రాల జారీలో రాజకీయ వివక్షపై ఎన్నికల సంఘం ఏం చర్యలు తీసుకుంది?. నో డ్యూస్ సర్టిఫికెట్లు అందకపోతే అభ్యర్థుల నామినేషన్లకు ఇబ్బందులు ఎదురవుతాయి. మా ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎన్నికల సంఘం బహిరంగంగా ప్రకటించాలి. 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతాల మార్పులపై అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం లేదు. సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో వెల్లడించాలి. రాత్రి 11.45 గంటల తర్వాత పోలింగ్ కొనసాగిన కేంద్రాల సంఖ్య ఎంత?. పోలింగ్ శాతం 68 శాతం స్థాయి నుంచి 81.78 శాతానికి చేరడంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలి.’’ అని టీజేఆర్ డిమాండ్ చేశారు.
‘‘ఈవీఎంల బ్యాటరీ రీడింగులపై లేవనెత్తిన సందేహాలకు సమాధానం ఎందుకు ఇవ్వలేదు?. వీవీప్యాట్ వెరిఫికేషన్ కోరిన అభ్యర్థుల ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారు?. హిందూపురంలోని ఒక పోలింగ్ కేంద్రంలో వైఎస్సార్సీపీకి ఒక్క ఓటే రావడంపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఏది?. ఫారం-20 పత్రాల లభ్యతలో జాప్యంపై సమాధానం చెప్పాలి. పండుగల సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాల్సిన అవసరమేంటి?. దసరా, నవరాత్రి ఉత్సవాలు పూర్తయ్యే వరకు వేచి ఉండాలని అఖిలపక్ష సమావేశంలో కోరాం. సనాతన ధర్మం గురించి మాట్లాడే కూటమి నేతలకు ప్రజల పండుగల ఇబ్బందులు కనిపించడం లేదా?
కుప్పంలో ఇప్పటికీ రాజకీయ ఫ్లెక్సీలు, జెండాలు, బ్యానర్లు ఉన్నా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?. విజయవాడ పరిసరాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా రాజకీయ ర్యాలీలు, ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఎన్నికల కోడ్ వైఎస్సార్సీపీకి మాత్రమేనా? అధికార కూటమి పార్టీలకు వర్తించదా?. కూటమి నేతల కోడ్ ఉల్లంఘనలపై ఎన్నికల సంఘం ఎందుకు మౌనంగా ఉంది?. ఎన్నికల సంఘం ప్రజలందరినీ సమానంగా చూడాలి. పార్టీల ఆధారంగా వివక్ష చూపకూడదు. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించాలి’’ అని టీజేఆర్ సుధాకర్బాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ‘స్థానిక’ నగారా మోగింది


