మున్సిపల్, మండల, జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల
13 నగర కార్పొరేషన్లు
77మున్సిపాలిటీలు
10 నగర పంచాయతీలు
ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల
రేపటి నుంచి 18వ తేదీ సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ
ఈ నెల 28న ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్.. 30న ఓట్ల లెక్కింపు
నవంబర్ 3న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. 5న ఓట్ల లెక్కింపు
మూడు దశల్లో నవంబరు 26, 29, డిసెంబర్ 2న పంచాయతీ ఎన్నికల పోలింగ్
నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్న ఎస్ఈసీ
సాక్షి, అమరావతి: మున్సిపల్, మండల.. జిల్లా పరిషత్, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ బుధవారం విడుదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ షెడ్యూల్ విడుదల చేశారు. రాష్ట వ్యాప్తంగా 13 నగర కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 10 నగర పంచాయతీలలో ఈ నెల 28వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. కోర్టు కేసుల కారణంగా ఎన్నికల ముందస్తు కార్యక్రమాలు పూర్తి కాని మరో నాలుగు కార్పొరేషన్లు, 15 మున్సిపాలిటీలు, నాలుగు నగర పంచాయతీల్లో డిసెంబర్ ఆఖరులో ఎన్నికలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నవంబర్ 3న పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ను మూడు విడతల్లో.. నవంబర్ 26, 29, డిసెంబర్ 3వ తేదీల్లో నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మూడు కేటగిరీల స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో పాటే బుధవారమే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఆయా నగర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఈ నెల 18వ తేదీ మద్యాహ్నం 3 గంటల వరకు వరకు నామినేషన్ల స్వీకరణ చేపడతారు. 28న పోలింగ్.. 30న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ను ఈ నెల 19వ తేదీన విడుదల చేయనున్నారు. మూడు దశల గ్రామ పంచాయతీ ఎన్నికలకు నవంబర్ 13, 16, 19వ తేదీల్లో వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. కాగా, నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ఎస్ఈసీ తెలిపింది.
మున్సిపల్ ఎన్నికల తేదీలు
నామినేషన్లు స్వీకరణ : 16–10–2026 ఉదయం 11:00 గంటల నుంచి
నామినేషన్లు దాఖలకు చివరి తేదీ : 18–10–2026 మధ్యాహ్నం 3:00 గంటల వరకు
నామినేషన్ల పరిశీలన : 19–10–2026
ఉపసంహరణకు చివరి తేదీ : 21–10–2026 మధ్యాహ్నం 3 గంటల వరకు
పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ : 21–10–2026 మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత
పోలింగ్ తేదీ: 28–10–2026 ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
అవసరమైన చోట రీ పోలింగ్ : 29–10–2026 ఉదయం 7:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు
ఓట్ల లెక్కింపు : 30–10–2026 ఉదయం 8:00 గంటల నుంచి..
డిప్యూటీ మేయర్ లేదా డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తేదీ : 05–11–2026
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ : 19–10–2026
నామినేషన్ల స్వీకరణ మొదలు : 21–10–2026
నామినేషన్లు దాఖలకు చివరి తేదీ : 23–10–2026
నామినేషన్ల పరిశీలన : 24–10–2026
ఆపీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం : ఈ నెల 25, 26 తేదీల్లో
ఉప సంహరణకు చివరి తేదీ : 27–10–2026
పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ప్రచురణ : 27–10–2026
పోలింగ్ తేదీ : 03–11–2026
అవసరమైన చోట రీ పోలింగ్ : 04–11–2026
ఓట్ల లెక్కింపు : 05–11–2026
జెడ్పీ చైర్మన్ లేదా ఎంపీపీల పరోక్ష ఎన్నిక : 11–11–2026

ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు
విశాఖపట్నం రీజియన్ : పలాస–కాశీబుగ్గ, బొబ్బిలి, యలమంచిలి, పాలకొండ, నెల్లిమర్ల, ఇచ్ఛాపురం, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్,పార్వతీపురం, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ), సాలూరు, నర్సీపట్నం.
రాజమండ్రి రీజియన్ : తుని, అమలాపురం, నిడదవోలు, మండపేట, నర్సాపూర్, జగ్గారెడ్డిగూడెం, కొవ్వూరు, సామర్లకోట, పెద్దాపురం, నందిగామ, నూజివీడు, ఉయ్యూరు, ముమ్మిడివరం, ఏలేశ్వరం, తిరువూరు, గొల్లప్రోలు, కొండపల్లి, ఆకివీడు, విజయవాడ, రామచంద్రపురం, ఏలూరు, పిఠాపురం, పెడన, మచిలీపట్నం, జగ్గయ్యపేట.
గుంటూరు రీజియన్ : తెనాలి, రేపల్లె,అద్దంకి, చీమకుర్తి,కనిగిరి,గిద్దలూరు, వెంకటగిరి,ఆత్మకూరు, సూళ్లురుపేట, నాయుడుపేట,దర్శి, బుచ్చిరెడ్డిపాలెం, పిడుగురాళ్ల, గురజాల,దాచేపల్లి, మాచర్ల, గుంటూరు, నెల్లూరు, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మార్కాపురం, ఒంగోలు, చీరాల.
అనంతపురం రీజియన్ : హిందూపూర్, గూడూర్ (కర్నూలు), గుంతకల్లు, ఆదోని, ఎమ్మిగనూరు, పుంగనూరు, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు (నంద్యాల జిల్లా), ఆళ్లగడ్డ, గుత్తి, కల్యాణదుర్గం, మైదుకూరు, రాజంపేట, కుప్పం, బేతంచర్ల, పెనుకొండ, మదనపల్లె, మడకశిర, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు, ప్రొద్దుటూరు, రాయచోటి, రాయదుర్గం, పుట్టపర్తి, బద్వేల్, నగిరి, పుత్తూరు, కడప, ధర్మవరం, తాడిపత్రి, నంద్యాల, ఎర్రగుంట్ల, కదిరి, జమ్మలమడుగు, పలమనేరు, తిరుపతి, పులివెందుల, కమలాపురం.


