
విజయవాడ, సాక్షి: భక్తుల మనోభావాల్ని దెబ్బ తీసే ఏ చర్యను.. ఏ రాజకీయ పార్టీ కూడా ఒప్పుకోదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. సీతారాం ఏచూరి సంస్కరణ సభలో తిరుపతి లడ్డు వివాదంపై స్పందించిన ఆయన.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కూ చురకలంటించారు.
‘‘ఏపీలో లడ్డు గొడవ నడుస్తోంది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే ఏచర్యను ఏ రాజకీయ పార్టీ ఒప్పుకోదు. కల్తీ నెయ్యి వాడినట్లు తెలిస్తే.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. దోషులను పట్టుకుని శిక్షించాలి. అంతేగానీ రాజకీయం చేయడం సరికాదు.
సనాతన ధర్మం బోర్డు పెట్టాలని ఒక పెద్ద మనిషి అంటున్నాడు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఆయన్ని చెప్పమనండి అంటూ పవన్‌కు పరోక్షంగా రాఘవులు చురకలు అంటించారు.
తిరుమల లడ్డూ వివాదంపై ఎక్స్ ఖాతాలో పవన్ స్పందిస్తూ.. ఆలయాల్లో జరిగే అంశాల పర్యవేక్షణకు జాతీయ స్థాయిలో 'సనాతన ధర్మరక్షణ బోర్డు' ఏర్పాటు చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దీనిపై అన్ని వర్గాల వారితో జాతీయస్థాయిలో చర్చ జరగాలని అన్నారు.


ఇదీ చదవండి: లడ్డూ పేరుతో రాజకీయాలు సరికాదు..: బీవీ రాఘవులు