ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు జరిగితే వైఎస్‌ఆర్‌సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు

Times now nava bharat survey 24 to 25 mp seats for ycp in next elections - Sakshi

ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఏపీలో క్లీన్‌స్వీపే

టైమ్స్‌ నౌ–ఈటీజీ సర్వే వెల్లడి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగనుందని ప్రముఖ వార్తా చానల్‌ టైమ్స్‌ నౌ సర్వే వెల్లడించింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే పార్టీ క్లీన్‌స్వీప్‌ చేయడం ఖాయమని పేర్కొంది. వైఎస్సార్‌సీపీ 24 నుంచి 25 స్థానాలు గెలుస్తుందని టౌమ్స్‌ నౌ–ఈటీజీ చేసిన సర్వే తేల్చింది. ఏపీలో మొత్తం 25 లోక్‌సభ స్థానాలున్న విషయం తెలిసిందే. ఇక దేశవ్యాప్తంగా మోదీ మేనియా కొనసాగనుందని, కేంద్రంలో వరుసగా మూడోసారి బీజేపీ విజయం ఖాయమని సర్వే తేల్చింది.

బీజేపీ కూటమికి 292 నుంచి 338 స్థానాలు రావచ్చని పేర్కొంది. కాంగ్రెస్‌ కూటమికి 106 నుంచి 144 వరకు, ఇతరులకు 66 నుంచి 96 దాకా సీట్లు లభిస్తాయని తెలిపింది. బీజేపీ కూటమికి 38.2 శాతం, కాంగ్రెస్‌ కూటమికి 28.7, ఇతరులకు 33.1 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీ నిస్సందేహంగా 300 పై చిలుకు స్థానాలు గెలుస్తుందని సర్వేలో పాల్గొన్న వారిలో 42 శాతం మంది, కష్టమని 26 శాతం, ఎన్నికల నాటికే దీనిపై స్పష్టత వస్తుందని 19 శాతం మంది అభిప్రాయపడ్డారు. 13 శాతం ఏమీ చెప్పలేమన్నారు. మోదీ 2.0 పాలన తీరు అత్యంత సంతృప్తికరంగా ఉందని ఏకంగా 51 శాతం మంది చెప్పారు!

చాలావరకు సంతృప్తికరమేనని 16 శాతం, ఓ మాదిరిగా ఉందని 12 శాతం చెప్పగా, బాలేదని 21 శాతం బదులిచ్చారు. మోదీ సర్కారు అతి పెద్ద వైఫల్యం ద్రవ్యోల్బణమని 34 శాతం, నిరుద్యోగమని 46 శాతం మంది పేర్కొన్నారు. నల్లధనాన్ని వెనక్కు తేలేకపోవడమని 13 శాతం, చైనా దూకుడును అడ్డుకోవడంలో వైఫల్యమని 7 శాతం చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం, వాక్‌ స్వాతంత్య్రం ప్రమాదంలో పడ్డాయా అన్న ప్రశ్నకు 41 శాతం మంది లేదని బదులిచ్చారు. చాలాసార్లు అలా అన్పించిందని 21 శాతం, అది విపక్షాల దృక్కోణమని 14 శాతం, ఏమీ చెప్పలేదని 24 శాతం అన్నారు. ప్రాంతీయ పార్టీల్లో పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 20 నుంచి 22 సీట్లు, ఒడిశాలో బిజూ జనతాదళ్‌కు 11 నుంచి 13 సీట్లు వస్తాయని సర్వే పేర్కొంది.

‘ప్రధాని’గా మోదీకి పోటీయే లేదు
అత్యంత శక్తిమంతుడైన ప్రధాని అభ్యర్థిగా మోదీకి 64 శాతం మంది ఓటేశారు. రాహుల్‌కు 13, కేజ్రీవాల్‌కు 12, నితీశ్‌కు 6, కేసీఆర్‌కు 5 శాతం ఓట్లొచ్చాయి. ఇక వచ్చే ఎన్నికల్లో విపక్షాల సారథిగా రాహుల్‌కు 29 శాతం, కేజ్రీవాల్‌కు 19, మమతకు 13, నితీశ్‌కు 8, కేసీఆర్‌కు 7 శాతం ఓట్లొచ్చాయి. 2024 ఎన్నికలకు ముందే విపక్షాలు ఒక్కటవుతాయని 31 శాతం, లేదని 26 శాతం, ఎన్నికల అనంతర పొత్తులుండొచ్చని 26 శాతం అన్నారు.

రాహుల్‌పై వేటు కాంగ్రెస్‌కు లాభించదు
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు కాంగ్రెస్‌కు ఎన్నికల్లో పెద్దగా లాభించదని సర్వేలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. అది కేవలం న్యాయపరమైన అంశమని వారన్నారు. ఈ అంశానికి జాతీయ రాజకీయాల్లో ప్రాధాన్యతేమీ ఉండదని మరో 11 శాతం మంది అన్నారు. 23 శాతం మంది ఇది రాహుల్‌కు సానుభూతి తెస్తుందని చెప్పగా 27 శాతం ఏమీ చెప్పలేమన్నారు. దొంగలందరికీ ఇంటిపేరు మోదీయే ఎందుకు ఉంటుందంటూ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వ్యాఖ్యలు చేసినందుకు పరువు నష్టం కేసులో రాహుల్‌కు సూరత్‌ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించడం, తర్వాత 24 గంటల్లోపే ఆయన లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ స్పీకర్‌ నిర్ణయం తీసుకోవడం, ఇది కక్షసాధింపని కాంగ్రెస్, విపక్షాలు దుయ్యబట్టడం తెలిసిందే.

ఇదీ చదవండి : పెట్టుబడుల ఆకర‍్షణలో ఏపీ నంబర్‌ 1.. గుజరాత్‌ అధిగమించి సత్తా!

ఇదీ చదవండి : బాబు దయనీయ స్థితికి అద్దం పడుతున్న ఉపన్యాసాలు!

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top