
సాక్షి, అనంతపురం: ఏపీలో చంద్రబాబు పాలన అగమ్యగోచరంగా సాగుతోందన్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. ఎన్నికల హామీలు అమలు చేయడంలో చంద్రబాబు సర్కార్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదం అంటూ మండిపడ్డారు. మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు హాజరు కాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఎన్టీఆర్ ఏఐ వీడియో హాస్యాస్పదమని అన్నారు.
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారు. చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందన్న అనుమానం ఉంది. చేయని పనులను చేసినట్లుగా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ఇది హాస్యాస్పదం. వైఎస్ జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను చంద్రబాబు నిలిపేశారు. చంద్రబాబుది రౌడీ రాజ్యం, గూండా రాజ్యం.
మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్‌నే గొప్పగా చెప్పుకోవడం సిగ్గుచేటు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని చంద్రబాబు.. బనకచర్ల డ్యాం అంటూ ఊదరగొడుతున్నారు. కరవు, అబద్ధాలు, వెన్నుపోటుకు చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్. సాగునీటి ప్రాజెక్టుల్లో నీళ్ళు కాదు.. టీడీపీ నేతలు అవినీతి నిధులు పారిస్తున్నారు. చంద్రబాబు రాయలసీమ బిడ్డ కాదు.. సీమ ద్రోహి. ప్రజలను వంచించే వాళ్ళు సీమ బిడ్డలు కాలేరు. నిజమైన రాయలసీమ బిడ్డలు వైఎస్సార్, వైఎస్ జగన్’ అని చెప్పుకొచ్చారు.