
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం నుంచి విచారించనున్నారు. రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ ప్రకారం జరగనున్న ఈ విచారణకు సోమవారం నలుగురు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. వచ్చే నెల ఒకటో తేదీన కూడా ఈ నలుగురిని ప్రత్యక్షంగా విచారించాలని స్పీకర్ నిర్ణయించారు.
ఆ షెడ్యూల్‌ను ఇప్పటికే అసెంబ్లీ వర్గాలు అధికారికంగా విడుదల చేశాయి. ఒక్కో ఎమ్మెల్యే విచారణ గంటపాటు జరగనుంది. ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది, అనర్హత పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్యే, ఆయన తరఫు న్యాయవాది సమక్షంలో అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ ఈ విచారణ నిర్వహిస్తుంది. సోమవారం ఈ విచారణకు ఎమ్మెల్యేలు టి.ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, గూడెం మహిపాల్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి హాజరవుతారు.
కఠిన ఆంక్షలు
అనర్హత పిటిషన్లపై ప్రత్యక్ష విచారణ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో కఠిన ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు సోమవారం నుంచి వచ్చే నెల ఆరో తేదీ వరకు అమల్లో ఉంటాయని ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.
👉ముందస్తు అనుమతి లేకుండా అసెంబ్లీ ప్రాంగణంలోకి సందర్శకులకు అనుమతి ఉండదు
👉మీడియా ప్రతినిధులకు ప్రవేశం లేదు. మీడియా పాయింట్‌తో పాటు అసెంబ్లీ భవనాల్లో ఎక్కడా ప్రెస్ మీట్ నిర్వహించకూడదు.
👉మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు కూడా అసెంబ్లీ ప్రాంగణంలోకి ప్రవేశం ఉండదు. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చినా వారి శాసనసభాపక్ష కార్యాలయాలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది
👉విచారణ జరిగే హాలులోకి పిటిషనర్లు, వారి న్యాయవాదులు, విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు, వారి న్యాయవాదులెవరూ మొబైల్ ఫోన్లను తీసుకెళ్లకూడదు. ఎవరైనా విచారణ ప్రక్రియను రికార్డు చేసేందుకు ప్రయత్నించినా, ఫొటోలు తీసినా ఆ ఉపకరణాలను అసెంబ్లీ వర్గాలు స్వా«దీనం చేసుకుంటాయి. ఇందుకు బాధ్యులైన వారి న్యాయవాదులను విచారణ ప్రక్రియలో పాల్గొనేందుకు కూడా అనుమతించరు.
ఏ ఎమ్మెల్యే ఎప్పుడంటే..!
టి. ప్రకాశ్‌గౌడ్- ఉదయం 11–12 గంటల వరకు
కాలె యాదయ్య 12 నుంచి ఒంటిగంట వరకు
గూడెం మహిపాల్‌రెడ్డి మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు
బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి 3 నుంచి నాలుగు గంటల వరకు
(అక్టోబర్ ఒకటో తేదీన కూడా ఇదే సమయాల్లో ఆయా ఎమ్మెల్యేలను మరోమారు విచారించనున్నారు)
