రైతుల జీవితాలతో ఆటలు

Telangana: Nalgonda MP Uttam Kumar Reddy Comments On CM KCR Over Paddy Procurement - Sakshi

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంపీ ఉత్తమ్‌ ధ్వజం

వానాకాలం ధాన్యం కొనకుండా యాసంగి కోసం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లారని విమర్శ

రైతులను మోసం చేస్తున్న కేసీఆర్, మోదీ: భట్టి 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రైతుల జీవితాలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. నెల రోజులుగా రైతులు ధాన్యాన్ని రోడ్లమీద, కొనుగోలు కేంద్రాల్లో పోసి ఎదురుచూస్తున్నా ఈ ప్రభుత్వం కొనడం లేదని విమర్శించారు. గురువారం ఆయన ఇతర కాంగ్రెస్‌ నేతలతో కలిసి జూమ్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల టన్నుల బియ్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ నుంచి 40 లక్షల టన్నుల బియ్యం మాత్రమే సేకరిస్తామని చెప్పిందన్నారు.

రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం తీరు అధ్వాన్నంగా ఉందని విమర్శించారు. కల్లాల్లో, రోడ్ల మీద ధాన్యం వానలకు తడిసి మొలకలు వస్తున్నా కొనకపోవడం రైతుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందన్నారు. రైస్‌ మిల్లర్లతో కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. రబీలో వరి నాట్లు వేయవద్దని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమని, నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ, చెరువుల కింద ఉన్న పొలాల్లో రైతులు ఏ పంటలు వేస్తారని ప్రశ్నించారు.    

సీఎల్‌పీ నాయకుడు మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ, వానాకాలం పంటను చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి మాటతప్పిన ముఖ్యమంత్రి యాసంగి పంట గురించి ఢిల్లీ పర్యటనకు వెళ్లానని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్, మోదీ కలిసి నాటకాలాడుతున్నారని విమర్శించారు. కాగా కోవిడ్‌తో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలని భట్టి విక్రమార్క సీఎం కేసీఆర్‌కు రాసిన ఒక లేఖలో డిమాండ్‌ చేశారు.

ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ధాన్యం విక్రయించిన రైతులకు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం బ్యాంకుల నుంచి క్రెడిట్‌ సదుపాయాన్ని కూడా తీసుకోలేదని అన్నారు. ఎం.కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రైతు తీవ్ర ఆవేదనకు గురవుతున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు బాధ్యతల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తే తీవ్ర పరి ణామాలను ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top