నేను పురుషులకంటే మెరుగ్గానే పనిచేస్తా: గవర్నర్‌ సంచలన వ్యాఖ్యలు

Telangana Governor Tamilisai Sensational Comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై పువ్వులు వేసే వారు ఉన్నారని, రాళ్లు వేసే వారు కూడా ఉన్నారని అన్నారు. అందరూ అందరికీ నచ్చాలని లేదని తెలిపారు. అయితే మంచి పనులు చేయడానికి అధికారం ఉండాలన్న గవర్నర్‌.. ఎన్ని అవమానాలు ఎదురైనా వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు.

నాపై రాళ్లు విసిరితే ఇల్లు కట్టుకుంటా.. పిన్స్‌ వేస్తే ఆ పిన్స్‌ గుచ్చుకొని వచ్చే రక్తంతో నా చరిత్ర పుస్తకం రాస్తానంటూ తమిళిసై వ్యాఖ్యానించారు. ఈ మేరకు శనివారం గవర్నర్‌ మాట్లాడుతూ.. లోక్‌సభ, శాసనసభలో 33% మహిళా రిజర్వేషన్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత 27 ఏళ్లుగా ఈ బిల్లు గురించి మాట్లాడుతున్నారు కానీ అమలు కాలేదని పేర్కొన్నారు. ఓ మహిళా రాష్ట్రపతి ఈ బిల్లుపై సంతకం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

ప్రతి ఒక్కరూ ఒక కలతోనే రాజకీయాల్లోకి వస్తారని, అవకాశం వచ్చినప్పుడు పురుషులతో పోలిస్తే 20 రేట్లు ఎక్కువగా పని చేస్తే కానీ మహిళకు గుర్తింపు లభించదని తమిళిసై అన్నారు. ఒకప్పుడు తాను బీజేపీ నేతనని, ఇప్పుడు గవర్నర్‌ అని పేర్కొన్నారు. అప్పట్లో బీజేపీలో 33 శాతం రిజర్వేషన్‌ను మహిళలకు కల్పిస్తూ పార్టీ నిర్ణయించిందని, ఫలితంగా ఎంతోమంది మహిళలు పార్టీలో చేరారని ప్రస్తావించారు. రాజకీయాలపై మక్కువతోనే తను ఎంతగానో ఇష్టమైన వైద్యవృత్తిని కూడా పక్కన పెట్టాల్సి వచ్చిందన్నారు గవర్నర్‌. 

‘రాజకీయాల్లో పురుషాధిక్యత ఎక్కువ. భారత్‌లో 15 లక్షల పంచాయతీలకు ప్రెసిడెంట్‌లుగా  మహిళలు ఉన్నారు.  నేను పురుషులకంటే మెరుగ్గానే పని చేస్తున్నాను. ఇకపై రాజకీయాల్లో మహిళా పవర్ కనిపిస్తుంది. నేను గవర్నర్‌గా వచ్చినప్పుడు ఒక మహిళా మంత్రి కూడా లేరు.  గవర్నర్‌గా  పదవి చేపట్టిన రోజు సాయంత్రం ఇద్దరు మహిళా మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ప్రోటోకాల్‌ ఇచ్చినా ఇవ్వకున్నా పనిచేసుకుంటూ పోతానంటూ’ తమిళిసై పేర్కొన్నారు. 
చదవండి: పాతబస్తీ ఫలక్‌నుమాలో మరో బాలుడు కిడ్నాప్..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top