సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్‌ కారత్, బీవీ రాఘవులు  

Telangana: CPM State Mahasabha Begin - Sakshi

తుర్కయాంజాల్‌ వేదికగా మూడు రోజుల పాటు సభలు 

హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్‌ కారత్, బీవీ రాఘవులు  

సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్‌ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్‌) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు.

సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్‌ఎస్‌ఆర్‌ కన్వెన్షన్‌తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు.  

చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... 
ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top