ముందస్తు ఎన్నికల ఊహాగానాలు: ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్‌ కీలక ఆదేశాలు

Telangana CM KCR Key Orders to TRS Party MLAs Over Early Elections - Sakshi

ఎమ్మెల్యేలకు కేసీఆర్‌ ఆదేశం

ఎన్నికలు ఎప్పుడైనా పథకాలపై సమీక్షలు నిర్వహించాలన్న సీఎం

15 లేదా 16న ఎంపీలు, ఎమ్మెల్యేలతో టీఆర్‌ఎస్‌ విస్తృత భేటీ

కొనసాగుతున్న ఐ ప్యాక్‌ బృందం రెండో విడత సర్వే

సాక్షి, హైదరాబాద్‌: శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు, రాజ కీయ పక్షాల సవాళ్లు ప్రతి సవాళ్ల నడుమ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతుంటే.. ఈ చర్చతో సంబంధం లేకుండా పార్టీ ఎమ్మెల్యేలంతా నియోజకవర్గాల్లోనే ఉండాలని టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా జరుగుతాయా? లేదా షెడ్యూల్‌ ప్రకారమే వస్తాయా..? అనే అంశంతో సంబంధం లేకుండా నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రం తేదీ ప్రకటిస్తే తాను అసెంబ్లీ రద్దు చేసేందుకు సిద్ధమంటూ మూడు రోజుల క్రితం సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో నేతలు, పార్టీల్లో హడావుడి పెరిగిన సంగతి విదితమే.

ప్రతిపక్షాలు సైతం ముందస్తుకు తాము సిద్ధమంటూ.. దమ్ముంటే అసెంబ్లీని రద్దు చేయాలని డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ లక్ష్యంగా విపక్షాలన్నీ పావులు కదుపుతూ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అయితే టీఆర్‌ఎస్‌ ఈ హడావుడికి దూరంగా భిన్నమార్గంలో ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించింది. వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతున్న సర్వే ఫలితాలు టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉన్నట్లు వస్తున్నందున నియోజకవర్గంపై ‘ఫోకస్‌’పెంచాలని ఎమ్మెల్యేలకు సీఎం నిర్దేశించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు, విపక్ష పార్టీల నేతల పనితీరుపై అందుతున్న నివేదికల ఆధారంగా స్థానిక రాజకీయ పరిస్థితులను కేసీఆర్‌ అంచనా వేస్తున్నారు. ఈ నివేదికలు వెల్లడించే అంశాల ఆధారంగా పనితీరును మెరుగు పరుచుకోవాలని సూచించినట్లు సమాచారం. 

నియోజకవర్గాల్లోనే మకాం వేయండి..
ఏడాదిన్నరకు ముందే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం వేడెక్కుతుండటంతో ఇప్పటికే నియోజకవర్గానికి మంజూరైన పనులను పూర్తి చేసి ఎన్నికల షెడ్యూలు వెలువడేనాటికి ప్రారంభించేలా వాటి పురోగతిపై ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఎన్నికల బూత్‌వారీగా లబ్ధిదారుల జాబితాలు సిద్ధం చేసి ఒక్కో ఇంటికి ఏయే ప్రభుత్వ పథకాల కింద వ్యక్తిగతంగా లబ్ధి జరిగిందనే సమాచారాన్ని రెడీ చేసుకోవడంపై ఎమ్మెల్యేలు దృష్టి పెట్టారు. సభలు, సమావేశాలకు పరిమితం కాకుండా లబ్ధిదారులతో వ్యక్తిగతంగా భేటీ అయ్యేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు ఉండేలా షెడ్యూలు సిద్ధం చేసుకుంటున్నారు.

వర్షాల నేపథ్యంలో ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో మకాం వేయగా.. తర్వాత కూడా అక్కడే ఉండేలా కార్యక్రమాలు రూపొందించుకోవడంపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దృష్టి సారించారు. ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు అందరూ హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15 లేదా 16వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటర్లుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గంతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించే యోచనలో కేసీఆర్‌ ఉన్నారు. ఈ భేటీలో ఎన్నికల కోణంలో కాకుండా ప్రజలతో మమేకయ్యేందుకు అనుసరించాల్సిన తీరుపై లోతుగా దిశా నిర్దేశం చేసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

కొనసాగుతున్న పీకే రెండో విడత సర్వే...
ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా టీఆర్‌ఎస్‌తో పాటు ఇతర పార్టీల పరిస్థితిపై కేసీఆర్‌కు నివేదికలు అందజేసిన పీకే ‘ఐప్యాక్‌’బృందం రెండో విడత సర్వేకు శ్రీకారం చుట్టింది. తొలి విడత సర్వేలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో పాటు టీఆర్‌ఎస్‌కే చెందిన ముఖ్య నేతలను పరిగణనలోకి తీసుకుని పనితీరుపై నివేదికలు రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో సుమారు 30 అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా మిగతా చోట్ల ఒకటి కంటే ఎక్కువ మంది పేర్లను పరిగణనలోకి తీసుకుని సర్వే ఫలితాలను క్రోడీకరిస్తున్నట్లు సమాచారం. పీకే బృందం చేస్తున్న సర్వే నివేదికలు ఆగస్టు మొదటి వారం నాటికి కేసీఆర్‌కు చేరే అవకాశమున్నట్లు సమాచారం. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top