రాష్ట్రంలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు

Telangana: BSP Chief RS Praveen Kumar Criticized BRS And BJP Party - Sakshi

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌   

ఉట్నూర్‌/ఇంద్రవెల్లి: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీలు మ్యాచ్‌ ఫిక్సింగ్‌ రాజకీయాలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా సోమవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాల్లో పర్యటించారు. ముందుగా ఉట్నూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ధరణి పోర్టల్‌ పనితీరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అనంతరం ఐబీ చౌరస్తాలో మాట్లాడుతూ, పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కాంగ్రెస్, బీజేపీలు పూర్తిగా విఫలమయ్యాయన్నారు. సచివాలయం గుమ్మటాలు కూల్చుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు.

కూల్చాల్సింది గుమ్మటాలు కాదని.. రాష్ట్రంలో అవినీతిలో కురుకుపోయిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని అని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పాలనకు చరమగీతం పాడి, బీఎస్పీని ఆదరించాలన్నారు. అనంతరం యాత్ర పెర్కగూడ, శ్యాంపూర్, యోందా, ఉమ్రి, నర్సాపూర్, గోట్టిపటార్‌ మీదుగా ఇంద్రవెల్లి చేరుకుంది. ఇంద్రవెల్లిలోని బుద్ధనగర్, ప్రబుద్ధనగర్, సట్వాజిగూడ, బుర్సన్‌పటర్‌ గ్రామాల్లో యాత్ర సాగింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top