6 ఏళ్లు.. 60 తప్పులు

Telangana BJP Releases Chargesheet On TRS Government - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల సమయంలో ఇచ్చే హామీలను అధికారంలోకి రాగానే అమలు చేయాలని, అమలు చేయకుండా విస్మరిస్తే అది అధికార పార్టీ వైఫల్యమని భారతీయ జనతా పార్టీ తెలంగాణ శాఖ స్పష్టం చేసింది. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన తర్వాత, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో గెలిచిన తర్వాత.. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా విఫలమైందని ఆరోపించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్‌ వైఫల్యాలపై రాష్ట్ర బీజేపీ చార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రులు ప్రకాశ్‌ జవదేకర్, కిషన్‌ రెడ్డి దీన్ని విడుదల చేశారు. ‘ఆరేళ్ల టీఆర్‌ఎస్‌ జమానా... 60 తప్పుల ఖజానా’శీర్షికతో ఈ చార్జ్‌షీట్‌ను రూపొందించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ చేసిన వాగ్దానాలను ఇందులో పొందుపర్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, అమలు, వైఫల్యాలను ప్రస్తావించారు. 

అరవై తప్పుల ఖజానా... లక్షకోట్ల అవినీతి
టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాల అమలును బీజేపీ వివరించింది. ఇందులో ప్రధానంగా 60 రకాల అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించింది. పొంతనలేని, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మభ్యపెట్టినట్లు ఆరోపించింది. ఆరేళ్లలో 60 తప్పులు, లక్షకోట్ల అవినీతి జరిగిందని పేర్కొంది. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆరేళ్లలో రూ.67 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్తోందని, దీనికి సంబంధించి ప్రతిపైసాకు లెక్క చెప్పాలని డిమాండ్‌ చేసింది. నగరవాసులకు ఉచితంగా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ పదేపదే చెప్పారని.. కానీ 1,100 మందికి మాత్రమే ఇళ్లు ఇచ్చారని, హామీ అమల్లో పొంతన ఉందా అని ప్రశ్నించింది. హైదరాబాద్‌ను డల్లాస్, ఇస్తాంబుల్‌ చేస్తానని కేసీఆర్‌ చెప్పారని, ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వరదలతో అతలాకుతలమైందని వివరించింది. మూసీ రివర్‌ ఫ్రంట్‌ అందాలెక్కడ పోయాయని, ఆరులేన్ల రోడ్లు ఏవని, 2016లో వచ్చిన వర్షాలతోనైనా తేరుకుని తీసుకున్న చర్యలు ఎక్కడని ప్రశ్నిం చింది. వరద బాధితులకు ఇవ్వాల్సిన రూ.10 వేలు ఎవరి జేబుల్లోకి పోయాయని నిలదీసింది. ఆస్తిపన్ను రాయితీ అనేదీ నాటకమని పేర్కొంది. 

పేదల పాలిట శాపంలా ఎల్‌ఆర్‌ఎస్‌.. 
హుస్సేన్‌ సాగర్‌ నీళ్లు కొబ్బరినీళ్లలా ఇంకెప్పుడు మారతాయో ప్రభుత్వం చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. మెట్రోరైలు ఓల్డ్‌సిటీ వరకు ఎందుకు నిర్మించలేదని దుయ్యబట్టింది. సచివాలయం లేని ధనిక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని విమర్శించింది. విజన్‌ లేని రిజర్వాయర్లు, కనెక్షన్లు లేని నల్లాలు రాష్ట్రంలో మాత్రమే ఉన్నాయని, ఉద్యోగాల టాస్క్‌ ఉత్తమాటలేనని, గ్రేటర్‌ హైదరాబాద్‌పైనా అప్పులు తీసుకొచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎంఎంటీఎస్‌ సెకండ్‌ ఫేజ్‌ ఎందుకు ఆగిందని ప్రశ్నించింది. ఎల్‌ఆర్‌ఎస్‌ పేద ప్రజల పాలిట శాపంగా మారిందని, కరోనా కట్టడిలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడింది. నగరం చుట్టూ నాలుగు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం ఎక్కడ జరిగిందో చెప్పాలని ప్రశ్నించింది. ఒక కుటుంబం కోసం తెలంగాణ రాష్ట్రం వచ్చినట్లు ఉందని విమర్శించింది.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top